ఆంధ్రప్రదేశ్‌

ట్రిపుల్ ఐటీల్లో త్వరలో శాశ్వత సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో నడుస్తున్న ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పర్మినెంట్ సిబ్బంది నియామకానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటి వరకు పర్మినెంట్ అధ్యాపకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని, తాత్కాలిక అధ్యాపకులు, సిబ్బందితో నడుస్తున్నాయని చెప్పారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీని మంగళవారం సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఇటీవల జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన సంఘటనపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి 54 మంది విద్యార్థులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదిస్తామని మంత్రి శ్రీనివాసరావు వివరించారు. ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారన్నారు.
నంద్యాల పర్యటనలో ఉన్న సిఎం ఈ విషయంపై దృష్టి సారించి ట్రిపుల్ ఐటీల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్‌ను పూర్తి స్థాయిలో నిషేధించామన్నారు. ర్యాగింగ్ నిరోధానికి విద్యార్థుల్లో అవగాహన పెరిగేలా సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడితే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో తాత్కాలిక సిబ్బంది సేవలు అందిస్తున్నారని, త్వరలో కనీసం 25 శాతం మంది పర్మినెంట్ సిబ్బందిని తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. పర్మినెంట్ సిబ్బందిని నియమిస్తే ఫలితాలు ఇంకా మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఉప కులపతుల నియామకం జరిగిందని, ఇంకా రెండు విశ్వవిద్యాలయాలకు నియమించాల్సి ఉందని అన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో 6,300 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతులు కూడా నూజివీడు లోనే జరుగుతున్నందున అక్కడి విద్యార్థులు మరో 2100 మంది ఉన్నారని, వీరిలో బాలికల శాతం 56 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో బాలికల శాతం ఎక్కువగా ఉందని అన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇంకా భూమి సేకరించాల్సి ఉందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణం చుట్టూ ప్రహరీగోడ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్జేయుకెటీ విసి వి రామచంద్రరాజు, డైరెక్టర్లు వీరంకి వెంకటదాసు, అప్పలనాయుడు, నూజివీడు రెవిన్యూ డివిజన్ అధికారి చెరుకూరి రంగయ్య, పలువురు ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు