ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ హెచ్చరించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్టీఆర్ జలసిరి కింద రాష్ట్ర వ్యాప్తంగా 35వేల బోర్లు వేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 400 కొండలపై 4వేల హెక్టార్లలో గ్రామాలకు ఆదాయాన్నిచ్చే మొక్కలు నాటాలన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలోని జాతీయ ఉపాధి హామీ పథకం, తాగునీటి ప్రాజెక్టులపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద అమలవుతున్న పనులను అంశాలవారీగా సమీక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు ఉపాధి హామీ పథకం ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సిఎస్‌కు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద అందజేస్తున్న జాబ్‌కార్డుల పంపిణీలో అలక్ష్యం చూపొద్దని, పని కావాల్సిన వారందరికీ ఉపాధి కల్పించాలని, కూలి అధికంగా వచ్చేలాగా చూడాలని సిఎస్ ఆదేశించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పంట కుంటల తవ్వకం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసక్తి చూపని రైతులకు పంట కుంటల వల్ల కలిగే ఉపయోగాలను వివరించి, వారు కూడా తమ భూముల్లో ఫామ్ పాండ్స్‌ను తవ్వుకునేలా చైతన్యం తీసుకురావాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాల్లో జాప్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణాలు పూర్తిచేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇచ్చిన లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తిచేయకపోతే, కఠిన చర్యలు తీసుకుంటానని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను హెచ్చరించారు. జలసిరి కింద ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 35వేల బోర్లు వేయాలన్నారు. ఐటిడిఎ పరిధిలో చేపట్టిన తాగునీటి పథకాలను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో డ్రాపౌట్లు తగ్గించడమే కాకుండా, ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే పంచాయతీలకు అవార్డులివ్వాలని సిఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, కమిషనర్ రామాంజనేయులతోపాటు ఆ శాఖకు చెందిన 13 జిల్లాల పీడీలు పాల్గొన్నారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్