ఆంధ్రప్రదేశ్‌

ఆత్మహత్యలతో సర్కారుకు అప్రతిష్ఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: సొంత పార్టీకి చెందిన మంత్రులు, నేతల విద్యాసంస్థల్లో శరపరంపరగా కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలతో పార్టీ, ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతున్నాయన్న ఆందోళన టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది. వీటిపై ఇప్పటికే విపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో, తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు 158 హాస్టళ్లకు అనుమతి లేదంటూ చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందని పార్టీ సీనియర్లు అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ అనధికారికంగా దాదాపు 100 మంది విద్యార్థులు హాస్టళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న వైనం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. వీరిలో మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ, మరో నేతకు చెందిన శ్రీచైతన్యలోనే ఎక్కువగా జరగడంపై అన్ని పార్టీలూ సర్కారును దుమ్మెత్తిపోస్తున్న వైనాన్ని టిడిపి సీనియర్లు గుర్తు చేస్తున్నారు. ఒక్క కడప జిల్లాలోనే అత్యధిక ఆత్మహత్యలు చోటుచేసుకోవడం, దానికీ నారాయణ విద్యాసంస్థనే కేంద్రబిందువు కావడాన్ని ప్రస్తావిస్తున్నారు. నారాయణ వియ్యంకుడైన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంత జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గత కొద్ది నెలల నుంచీ విద్యార్థి సంఘాలు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. చివరకు పార్టీకి మిత్రపక్షమైన బిజెపి అనుబంధ విభాగం ఏబివిపి కూడా వియ్యంకుల చేతిలో విద్యావ్యవస్థ భ్రష్ఠుపడుతోందంటూ విరుకుపడుతోంది. ఈ పరిణామాలు ఇప్పటికే విద్యార్థుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయని, వైసీపీ దీనికి మరింత ఆజ్యం పోస్తుండటం, వాటికి వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంస్థలు మద్దతుగా నిలిచి, రాష్టవ్య్రాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. ‘నారాయణ మంత్రి కావడం, శ్రీచైతన్యకు చెందిన వ్యక్తి కూడా మా పార్టీ వారే కావడం, అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండటంతో సహజంగా మా ప్రభుత్వంపై నిందలు వస్తున్నాయి. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం కూడా ఎవరిపై చర్యలు తీసుకోనందుకు ఆ నిందలు నిజమన్న భావన కలిగిస్తున్నాయి. గంటా శ్రీనివాస్ నారాయణకు వియ్యంకుడైనందుకే ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయానికి తెరదించే ప్రయత్నం చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం. యువకుల ఓట్లను దృష్టిలో పెట్టుకోకపోతే వాటిని వైసీపీ సొమ్ము చేసుకోవడం ఖాయమ’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.యువభేరీల పేరిట జగన్ తరచూ నిర్వహిస్తోన్న కార్యక్రమాలకు విద్యార్ధుల నుంచి వస్తున్న స్పందనను పార్టీ నాయకత్వం తేలిగ్గా తీసుకుంటే నష్టపోతామని నేతలు అభిప్రాయపడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల హాస్టళ్లకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు తరచూ ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలకు ఒడిగడుతున్న వైనంపై మీడియా కంటే, సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుండటంతో ప్రభుత్వం అప్రతిష్టపాలువుతోందని టిడిపి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వీటిపై ఆ సంస్థలు మీడియా మేనేజ్‌మెంట్ చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేస్తున్నారు. గత మూడేళ్ల క్రితం వందల సంఖ్యలో రైతు ఆత్మహత్యలు జరిగితే, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. రుణమాఫీ, సబ్సిడీ, అవగాహన కార్యక్రమాల ద్వారా వాటి నివారణలో చంద్రబాబు విజయం సాధించిన వైనాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీని అప్రతిష్ఠపాలుచేస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న విద్యాసంస్థలపై కొరడా ఝళిపించడంలో బాబు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందంటున్నారు. నారాయణపై చర్యలు తీసుకునేందుకు బాబు భయపడుతున్నారన్న అభిప్రాయాన్ని తొలగించకపోతే, విద్యార్థులను దూరం చేసుకోక తప్పదని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరికించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. తన వియ్యంకుడైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ, శ్రీచైతన్య వంటి 158 హాస్టళ్లకు అనుమతులు లేవని అంగీకరించడం ప్రతిపక్షాలకు అస్త్రాలిచ్చినట్టయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించడమేనని, అనుమతులు లేని హాస్టళ్లను ప్రభుత్వమే అనుమతిస్తోందన్న సంకేతాలివ్వడమేనని విశే్లషిస్తున్నారు. అనుమతులు లేని హాస్టళ్లలో జరుగుతున్న ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ చంద్రబాబు, నారాయణ, గంటా ఫొటోలతో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోన్న వీడియో, 158 హాస్టళ్లకు అనుమతులు లేవన్న గంటా ప్రకటన విద్యార్థులలో చర్చనీయాంశమవుతున్న విషయాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.