ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు మంత్రులకు బాబు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 15: కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి, ఆ కులానికి చెందిన యువతకు సొంత ఖర్చులతో విదేశీ విద్యా రుణాలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్ గత కొద్దికాలం నుంచీ గాడితప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యల కొరడా ఝుళిపించటం సంచలనం రేపింది. కార్పొరేషన్ ఎండీ అమరేంద్రపై బదిలీ వేటు వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలమే రేపింది. ఆయనను మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాపు కార్పొరేషన్‌లో జరుగుతున్న లోపాలపై ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ఇప్పటికే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. నిజానికి అమరేంద్రపై బదిలీ వేటు వేయాలని ప్రభుత్వం చాలాకాలం క్రితమే భావించినా నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి చక్రం అడ్డువేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఎన్టీఆర్ విద్యోన్నతి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కోచింగ్ సెంటర్ల ఎంపిక, నిధుల విడుదల వంటి అంశాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణిని ప్రభుత్వం నియమించింది. అయితే అమరేంద్ర ఎండీ హోదాలో ఉండగా విచారణ సక్రమంగా జరగదన్న భావనతో ఆయనను తప్పించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఎండీకి మద్దతిస్తోన్న ఆ ఇద్దరు మంత్రులు, ఓ ఐఏఎస్‌కు షాకిచ్చాయి. వారికి తెలియకుండానే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మికి ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. సహజంగా ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వుల్లో బదిలీ కారణాలను పేర్కొనరు. కానీ ఈ వ్యవహారంలో మాత్రం అందుకు భిన్నంగా జరగడాన్ని బట్టి ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్‌గా తీసుకుందో స్పష్టమవుతోందని కాపు వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపు వర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఎండీ, చైర్మన్ వ్యక్తిగత వైరం వల్ల కాపు కార్పొరేషన్ పనితీరు అప్రతిష్ఠ పాలవుతోందని పలువురు కాపు నేతలు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవలసిందని, మంత్రుల ఒత్తిళ్లతో ఆలస్యం చేశారనే వ్యాఖ్యలు కాపు సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. నిజాయితీ కలిగిన అధికారిగా పేరున్న ఉదయలక్ష్మికి ఆ శాఖ బాధ్యతలు అప్పగించిన తర్వాతనే కాపు కార్పొరేషన్ వ్యవహారాలు విచారణకు నోచుకున్నాయని, గతంలో ఒక మంత్రి, ఓ ఐఏఎస్ అధికారి దన్నుగా నిలిచినందుకే ఇంతకాలం వెలుగులోకి రాలేదంటున్నారు. ఇదిలాఉండగా ఈ వ్యవహారంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉదయలక్ష్మికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆదివారం పెట్టిన పోస్టింగులు చర్చనీయాంశమయ్యాయి. ఉదయలక్ష్మి ప్రకాశం కలెక్టర్‌గా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న క్రమంలో విచారణకు ఆదేశించారేతప్ప బదిలీ చేసి, దోషిగా తేల్చలేదని ఆ పోస్టింగులో పేర్కొన్నారు. కేవలం కాపు అధికారి కావడం వల్లే బదిలీ చేశారని, ఇప్పటికే పోలీసు, రెవిన్యూ శాఖల్లో కాపులు ఇలాంటి వేధింపులతో బలి అయ్యారంటూ ఆరోపించారు. నీతి, నిజాయితీగా పనిచేసే ఆఫీసర్‌పై వేటు వేయడం అన్యాయమని నిరసన తెలిపారు. ఈ పోస్టింగ్ హల్‌చల్ చేయడంతో ప్రభుత్వం స్పందించింది. దీని వెనుక ఎవరున్నారో విచారణకు ఆదేశించింది. ఇది కాపు కార్పొరేషన్‌లో పనిచేసే వారి పనే అయి ఉంటుందని, దీనివెనుక ఎవరున్నారనే దానిపై ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ‘ఒకరికి జరిగిన అన్యాయంపై ఆలోచించేంత ఓపిక మా వర్గానికి లేదు. కాబట్టి ఇది ఎవరు చేశారో, ఎవరు చేయించారో అందరికీ తెలుసు. కార్పొరేషన్ చైర్మన్ స్వయంగా ఎండీపై సీఎంకు ఫిర్యాదు చేసినా, చక్రపాణితో విచారణ జరిపిస్తున్నా రాని పోస్టింగులు ఎండీ బదిలీ అయిన తర్వాతనే ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసు. ఉదయలక్ష్మి గారు మా ముందే లబ్ధిదారులతో స్పీకర్ ఫోన్‌లో మాట్లాడారు. పత్రికల్లో వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేదు? అప్పుడు వౌనంగా ఉన్నారంటే అర్థమేమిటి? అయినా ఒక అధికారిపై విచారణ జరిపే సమయంలో ఆయన అదే పదవిలో ఉంటే విచారణపై ప్రభావం పడుతుంది కదా? ఒకవేళ అందులో ఆయన తప్పేమీ లేకపోతే ప్రభుత్వమే మళ్లీ పోస్టింగ్ ఇస్తుంది. దానికోసం ఇంత రాద్ధాంతం, ప్రచారం అవసరం లేదు’ అని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఒకరు వ్యాఖ్యానించారు.
జీఎంకు బాధ్యతలు
కాగా, పరిపాలన వ్యవహారాలు చూసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న కార్పొరేషన్ జనరల్ మేనేజర్, గతంలో వివిధ జిల్లాల్లో పీడీగా పనిచేసిన రాంబాబుకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం.