ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు ఝలక్ తప్పదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 15 : రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ఉండాలని గత కొంతకాలంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను నిజం చేసేందుకు తెర వెనుక భారీ కసరత్తే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించే నవంబర్ 2వ తేదీకి కొద్ది రోజులు అటు ఇటుగా వైకాపాకు భారీ ఝలక్ ఇవ్వనున్నట్లు టిడిపిలోని కీలక నేతల ద్వారా తెలుస్తోంది. జగన్ పాదయాత్ర చేస్తే రాష్ట్ర ప్రజలు అటువైపు చూస్తారని టిడిపి భావిస్తోంది. ఇదే జరిగితే పార్టీకి ఎంతో కొంత నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని నివారించడానికి ప్రజల చర్చ జగన్ వైపు కాకుండా రాజకీయాల వైపు మళ్లించడం, మానసికంగా వైకాపాను దెబ్బతీయడం ఒకేసారి జరిగేలా టిడిపి పథకం రచించినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని వైకాపా కూడా పసిగట్టిందని తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా వారు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని టిడిపి భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రతిపక్ష వైకాపా నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే పెద్దఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపిలు వైకాపాను వీడి టిడిపిలో చేరారు. మరికొందరు నాయకులు కూడా వైకాపాను వీడటంతో పార్టీ ఆత్మరక్షణలో పడి నష్ట నివారణ చర్యలు తీసుకోవడంతో పార్టీ ఫిరాయింపులకు బ్రేక్ పడింది. అయితే నంద్యాల శాసనసభ ఉపఎన్నిక, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో మరోమారు పార్టీ ఫిరాయింపుల చర్చ తెరపైకి వచ్చింది. వైకాపా నుంచి టిడిపిలో చేరడానికి చాలామంది ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధంగా ఉన్నారని వారితో తమ పార్టీ నేతలు చర్చిస్తున్నారని టిడిపి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వైకాపాకు చెందిన నాయకులు టిడిపిలో చేరనున్నారంటూ ప్రచారం చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు, కర్నూలు ఎంపి పార్టీ ఫిరాయించనున్నారన్న వార్తలతో వైకాపా అధినేత జగన్ వారితో సమావేశం కూడా నిర్వహించారు. ఈ కారణంగానే కర్నూలు ఎంపి బుట్టా రేణుక పార్టీ వీడటం ఖాయమని టిడిపితో ఒప్పందం కుదిరిందని జగన్ సొంత పత్రిక, ఛానల్‌లో ప్రచారం చేయడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అయితే సిఎం చంద్రబాబును కలవనున్నారని వార్తలు వచ్చినా ఇప్పుడే ఆమె టిడిపిలో చేరబోరని ఆమె కుటుంబ సభ్యులు సైతం పేర్కొనడం గమనార్హం. కాగా బుట్టా రేణుకపై వచ్చిన వార్తలపై వైకాపా నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఆడుతున్న ఫిరాయింపు ఆటలో జగన్ పావుగా మారారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. టిడిపి నేతలు రచించిన భారీ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తే నవంబర్‌లో జగన్ పాదయాత్ర సమయంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం ఖాయమని రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు.