ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ కళాశాలల బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా చైతన్య, నారాయణ విద్యాసంస్థల ఎదుట భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్యాలు కళాశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించి ప్రధాన గేట్లకు తాళాలు వేసి హాస్టల్ విద్యార్థులు వెలుపలకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పలుచోట్ల విద్యార్థి సంఘాల నేతలు చైతన్య, నారాయణ, ఎన్‌ఆర్‌ఐ కళాశాలల గేట్ల వద్ద కొంతసేపు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఆందోళన పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.మహేష్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు ఎం.రామకృష్ణ నాయకత్వం వహించారు. వేర్వేరు కళాశాలల వద్ద జరిగిన సభల్లో వీరు మాట్లాడుతూ శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలు మృత్యుకుహరాలుగా మారి విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని అన్నారు. మార్కులు, ర్యాంకులు, ఫీజుల కోసం విద్యార్థులను మానసిక, భౌతిక హింసలకు గురిచేస్తున్నారని అన్నారు. అక్షరాలపై లక్షల వ్యాపారం సాగిస్తూ వీరి పెట్టుబడి, లాభం కోసం విద్యను మార్కెట్ సరుకుగా మార్చాయంటూ దుయ్యబట్టారు. పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ ఇరువురూ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. వీరిని తక్షణమే మంత్రి పదవుల నుంచి తొలగించి సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్ నీరదారెడ్డి, చక్రపాణిలు అందచేసిన రిపోర్టులను తక్షణం బహిర్గతం చేయాలన్నారు.

చిత్రం..విజయవాడలో ఒక కార్పొరేట్ కళాశాల ముందు ధర్నా చేస్తున్న విద్యార్థిసంఘాల నేతలు