ఆంధ్రప్రదేశ్‌

చెట్టుకొకటి.. పుట్టకొకటి! (తరలింపు తిప్పలు-1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 5: హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులు, హెచ్‌ఓడిలను రాజధాని అమరావతికి తరలింపు అంశం రోజురోజుకూ జటిలమవుతోంది. సిబ్బంది తరలింపుపై ఇటీవలి వరకూ నోరు మెదపని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అమరావతి వెళ్లడానికి ససేమిరా అంటున్నాయి. అమరావతి వెళితే తమకు ఎదురయ్యే కష్టాలను ఒక్కొక్కటిగా ఏకరువు పెడుతున్నారు. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కానందున దశలవారీగా ఉద్యోగులను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ చెప్పడంతో వారు కాస్తంత శాంతించారు. అయితే హెచ్‌ఓడిలు మాత్రం విధిగా వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో సమస్య మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ సెక్రటేరియట్ ఉద్యోగుల తరలింపు కష్టమనుకుంటున్న ప్రభుత్వానికి హెచ్‌ఓడిలను ఇక్కడికి తీసుకురావడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 15 నుంచి 25లోగా విజయవాడకు వెళ్లిపోవాలని హెచ్‌డిఓలను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 110 హెచ్‌ఓడి కార్యాలయాలు ఇక్కడికి తరలిరావాల్సి ఉంది. ఇప్పటికి కేవలం నాలుగు హెచ్‌ఓడిలు మాత్రమే వచ్చాయి. హెచ్‌ఓడి కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 17 లక్షల ఎస్‌ఎఫ్‌టి వైశాల్యం కలిగిన భవనాలను కృష్ణా జిల్లా కలెక్టర్ సిద్ధం చేశారని, అందులో పార్కింగ్ సౌకర్యం కూడా ఉందని ప్రభుత్వం హెచ్‌ఓడిలకు చెప్పింది. దీంతో కొందరు హెచ్‌ఓడిలు విజయవాడకు వచ్చి కార్యాలయాలను పరిశీలించారు. నగరంలోని పటమటలంక వద్ద ఉన్న ఒక కల్యాణ మంటపంలో ఎండోమెంట్స్ హెచ్‌ఓడి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. అయితే అధికారులు వచ్చి చూసి అక్కడ హెచ్‌ఓడి కార్యాలయం ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెప్పారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ పైన నిర్మిస్తున్న భవనాల్లో ఇరిగేషన్ శాఖ హెచ్‌ఓడిని ఏర్పాటు చేసుకోమన్నారు. ఆర్టీసీ బస్డాండ్‌లో హెచ్‌ఓడి కార్యాలయం ఉంటే ఎలా పనిచేయగమని ఆ శాఖ హెచ్‌ఓడి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే నిత్యం రద్దీగా ఉండే విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరికొన్ని కార్యాలయాలను కృష్ణా జిల్లా గన్నవరం, జి కొండూరు, మైలవరం, కంకిపాడుతో పాటు గుంటూరు జిల్లా నల్లపాడు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు మిర్చియార్డులో వ్యవసాయ శాఖ హెచ్‌ఓడి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విజయవాడ శివారు పోరంకిలో విద్యాశాఖ హెచ్‌ఓడి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి భవనాన్ని చూశారు. ఉద్యోగులు అక్కడికి వెళ్లి చూస్తే, కనీసం ద్విచక్ర వాహనం కూడా ఆ భవనం దగ్గరకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాళ్లంతా విస్తుపోయారు. గుంటూరు జిల్లా నల్లపాడులో సహకార శాఖ హెచ్‌ఓడి కార్యాలయాన్ని ఏర్పటు చేయనున్నారు. ఇలా చెట్టుకొకటి పుట్టకొకటిగా హెచ్‌ఓడి కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హెచ్‌ఓడి కార్యాలయ ఉద్యోగులు నిత్యం సెక్రటేరియట్, హైకోర్టు, ఎపి ట్రిబ్యునల్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. హైకోర్టు, ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో ఉండి, హెచ్‌ఓడిలు విజయవాడలో ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్‌ఓడిలు చెపుతున్నారు.
రూ.200 కోట్ల అదనపు భారం
హెచ్‌ఓడి కార్యాలయాలను ఆదరాబాదరాగా తరలించడం వల్ల ప్రభుత్వంపై రెండు వందల కోట్ల అదనపు భారం పడబోతోంది. విజయవాడ, గుంటూరుల్లో ఎస్‌ఎఫ్‌టికి 30 రూపాయలు చెల్లించి భవనాలను అద్దెకు తీసుకోవాలని ఆయా హెచ్‌ఓడిలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదాహరణకు అటవీ శాఖ హెచ్‌ఓడి కార్యాలయాన్ని తాడికొండ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి నెలకు 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించబోతున్నారు. రెండేళ్ల వరకూ ఈ భవనాన్ని ఖాళీ చేయబోమని అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. అంటే ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఈ అపార్ట్‌మెంట్ యజమానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలన్నమాట. ఇలా ప్రతి హెచ్‌ఓడి కార్యాలయానికి రెండేళ్లకు సుమారు 2 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 100 హెచ్‌ఓడిలకు కనీసం రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉందన్నమాట!
కొన్ని ఫైళ్లే ఇక్కడికి..
ఒక్కో హెచ్‌ఓడి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి సుమారు 80 నుంచి 100 మంది పనిచేస్తుంటారు. వీరిలో ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు విజయవాడకు రావడానికి సిద్ధంగా లేరు. హెచ్‌ఓడిలు ఇక్కడికి వచ్చిన తరువాత మళ్లీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలి. అలాగే రన్నింగ్ ఫైళ్లు, ఒకటి లేదా రెండేళ్ల బ్యాకప్ ఫైళ్లను మాత్రమే తీసుకెళ్లాలని, అంతకుమించి ఇక్కడ స్థలం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఆయా హెచ్‌ఓడిల్లో ఉన్న ఫైళ్లంటినీ క్లోజ్ చేసి హైదరాబాద్‌లోనే రికార్డు రూంలో ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌టిఐ కింద ఎవరైనా దేని గురించైనా ప్రశ్నిస్తే, దానికి కావాల్సిన సమాచారం కోసం విజయవాడ నుంచి ఉద్యోగులు తిరిగి హైదరాబాద్ వెళ్లి, రోజుల తరబడి ఆ సమాచారాన్ని సేకరించి తీసుకురావల్సి వస్తుందని హెచ్‌ఓడిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఓడి కార్యాలయాల తరలింపు వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుని, ఈ 200 కోట్లుతో శాశ్వత భవనాలు నిర్మిస్తే బాగుంటుందని హెచ్‌ఓడి సంఘ నాయకులు చెపుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మించి, సౌకర్యాలు కల్పిస్తే వచ్చే ఏడాదికి ఉద్యోగులంతా స్వచ్ఛందంగా తరలి వస్తారని ఉద్యోగ సంఘ నాయకులు తెలియచేస్తున్నారు.
ఔట్‌పుట్ తగ్గిపోతుంది!
వారానికి ఐదు రోజుల పనిదినం వల్ల ఉద్యోగులకు ఏమేరకు వెసులుబాటు ఉంటుందో కానీ ప్రభుత్వం ఆశించిన మేరకు పనులు జరగవని ఓ మహిళా ఉద్యోగి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఉద్యోగులంతా హైదరాబాద్‌కు బయల్దేరుతారు. తిరిగి సోమవారం మధ్యాహ్నానికి కానీ విజయవాడ చేరుకోరు. దీంతో మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. మిగిలిన రెండు రోజుల్లో అంతంతమాత్రంగానే పనులు జరుగుతాయని చెపుతున్నారు. దీనివల్ల ఔట్‌పుట్ ఏమేర వస్తుందని ఆమె ప్రశ్నిస్తున్నారు.

మా ప్రమేయం లేదు!
హెచ్‌ఓడిల తరలింపు వ్యవహారంలో మరో కొత్త అంశం వెలుగుచూసింది. విజయవాడలో అరకొర సౌకర్యాలతో కార్యాలయాలను ఏర్పాటు చేయడం, స్థానికతపై స్పష్టత లేకపోవటం వంటి అనేక అంశాలను ఆయా శాఖల కార్యదర్శులు, డైరెక్టర్ల వద్ద ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. ‘హెచ్‌ఓడిలను తరలించాలని మేమేం అనుకోవడం లేదు. మీ నేతలే ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దాంతో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దాన్ని అమలు చేస్తున్నాం’.. అని కమిషనర్లు, డైరెక్టర్లు చెప్పడం గమనార్హం.

దీర్ఘకాలిక సెలవుపై ఉద్యోగులు?
హెచ్‌ఓడిల్లో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులు విజయవాడ రావడానికి ఇష్టపడక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు స్కూళ్లలో తమ పిల్లలకు సీట్లు దొరకనివారు, హైదరాబాద్‌లో పిల్లలకు ఫీజులు చెల్లించిన వారు స్థానికత అంశం తేలకపోవడం వల్ల దీర్ఘకాలిక సెలవు పెట్టాలని భావిస్తున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు చెప్పారు.

కెవిజి శ్రీనివాస్