ఆంధ్రప్రదేశ్‌

కుల పంచాయతీలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: నవ్యాంధ్రలో ఉన్న సమస్యలకు కులాల తలనొప్పి తోడవడంతో, దానికి తెరదించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సర్వే నిర్వహణకు తెరలేపినట్లు కనిపిస్తోంది. జనాభా సంఖ్య ప్రాతిపదిక న్యాయం చేయాలన్న డిమాండ్లు పెరగడం, అసలు ఏ కులానికి ఎంత జనాభా ఉందో తెలియక ఇప్పటివరకూ తర్జనభర్జన జరుగుతోంది. ఇక ఈ పంచాయితీకి తెరదించడం ద్వారా, భవిష్యత్తులో పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించాలన్నది బాబు లక్ష్యంగా కనిపిస్తోంది.
కాపులకు బీసీ హోదాపై మొదలయిన కులాల చిచ్చు, ఇతర కులాలకు విస్తరించి అదో పెద్ద సమస్యలా పరిణమించింది. ఇది సర్కారుకు తలనొప్పిలా మారింది. దానికితోడు, ప్రతి కులం తమ జనాభా ఇంత అని వాదించడం, వారి వాదన ప్రకారం చూస్తే రెండు రాష్ట్రాల జనాభా సంఖ్య అంత ఉండటంతో.. అసలు నిజంగా ఏ కులం జనాభా ఎంతన్నది తలనొప్పిగా మారింది. దాదాపు ప్రతి కులం తమది జనాభాలో 30, 40శాతం ఉందని, ఆ మేరకు తమకు రిజర్వేషన్లు కల్పించాలని వాదిస్తున్నాయి. ఇవన్నీ రిజర్వేషన్లకు లింకు ఉండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక వౌనం వహిస్తోంది.
ఈ నేపథ్యంలో కుల పంచాయితీకి చెక్ పెట్టేందుకు బాబు నడుంబిగించారు. రాష్ట్రంలో సకల జనుల సర్వే చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, వ్యవసాయ గణాంకాలను తెలుసుకోనున్నారు. అదే సమయంలో ఎవరు ఏ కులానికి చెందిన వారన్న వివరాలు కూడా వెలుగుచూడనున్నాయి. దానితో ఇప్పటివరకూ తమ కుల జనాభా ఎక్కువంటే, తమ కుల జనాభానే ఎక్కువని వాదిస్తోన్న కుల సంఘాల నేతల వాదనలో పస ఎంతన్నది తేలనుంది.
ప్రభుత్వం నిర్దేశించిన కాలమ్‌లో ఆదాయం, ఉద్యోగం, ఇంట్లో ఉన్న వారి సంఖ్యతోపాటు వారి కులాన్ని కూడా చేర్చుతున్నారు. దీనితో ఆ కులంతోపాటు, వారి ఆదాయం, అక్షరాస్యత, చేతివృత్తులు, వ్యవసాయంపై ఆధారపడిన వారు ఎంతమంది అన్న వాస్తవాలు కూడా తేలిపోనున్నాయి.
2011 జనాభా లెక్కలే ఇప్పటికీ అన్నింటికీ ప్రాతిపదికగా ఉన్నాయి. ప్రభుత్వం వివిధ కులాలు, వర్గాలకు కేటాయిస్తున్న బడ్జెట్ కూడా అప్పటి జనాభా లెక్కల ప్రాతిపదికనే కొనసాగుతున్నాయి. ఈ నాలుగేళ్లలో పరిస్థితులు మారడంతోపాటు, కొత్త రాష్ట్రం ఏర్పడటంతో రాష్ట్రంపై సమగ్ర అవగాహన ఏర్పడడం అవసరం అని బాబు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రాధాన్యతలేమిటన్నది నిర్దేశించుకునేందుకు, ఈ సకల జనుల సర్వే చేపట్టినట్లు కనిపిస్తోంది. కులాలకు ఆర్థికంగా దన్నుగా ఉండాలని బాబు ప్రభుత్వం ఇటీవలి కాలంలో నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్, 65 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. త్వరలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది. బీసీ సబ్‌ప్లాన్‌కు 8 వేల కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో మరిన్ని కులాలకు దన్నుగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న బాబు సర్కారుకు సకల జనుల సర్వే అన్ని రకాలుగా అక్కరకు రానుంది. ఒకరకంగా ఇది బాబుకు రాజకీయంగా కూడా పనికివచ్చే అవకాశం ఉంది. ఏ జిల్లాలో ఏ కులం వారి సంఖ్య ఎక్కువగా ఉందన్న విషయాలు తెలిసిపోతాయి. దానితో పార్టీపరంగా ఏ కులానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపైనా స్పష్టత వస్తుంది. ఈనెల 28 నుంచి సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సర్వే రెండు విడతలుగా ఉండనుంది. జులై చివరి నాటికి రాష్ట్రంలో ఏ కుల జనాభా ఎంతన్నదానిపై ఒక స్పష్టత రావచ్చని అధికారులు చెబుతున్నారు. దానిని కంప్యూటరైజేషన్ చేయాల్సి ఉన్నందున, పూర్తి వివరాలు ఆగస్టు నాటికి రావచ్చంటున్నారు.
ఈ సర్వే వివరాలు బయటకొచ్చిన తర్వాత, ఇక కుల సంఘాల వాదనలో పస ఉండే అవకాశం ఉండదని విశే్లషకులు భావిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం కూడా ఏ కులానికి ఏ రకంగా కేటాయింపులు జరపాలి? ఏ కులాన్ని ఆదుకోవాలి? అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈ నెల 28 నుంచి మొదలయ్యే సర్వేకు, ప్రస్తుతం కాపులను బీసీల్లో చేర్చేందుకు మంజునాధ కమిషన్ చేసే సర్వేకు ఎలాంటి సంబంధం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అది కేవలం కాపులను బీసీల్లో చేర్చే అంశానికే పరిమితమైన సర్వే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.