ఆంధ్రప్రదేశ్‌

అలసత్వమే శాపమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 15: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు పదేళ్లయినా పరిహారం పూర్తిగా అందని పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. పోలవరం హెడ్ వర్క్సులో భాగంగా అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపువున్న మొదటి విడత ముంపు గ్రామాల నిర్వాసితులను పదేళ్లుగా ఖాళీచేయించడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. తమకు ఇవ్వాల్సిన పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందిస్తే ఖాళీచేయడానికి సిద్ధమని నిర్వాసితులు చెబుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫలితంగా ఇప్పటివరకు ఆయా గ్రామాల నిర్వాసితులకు ప్యాకేజీ పూర్తిగా అందకపోవడమేకాక, ప్రస్తుతం పరిహార భారం ఇంతలింతలుగా పెరిగిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం దేవీపట్నం మండలంలో మొదటివిడత ఖాళీ చేయించాల్సిన ఏడు గ్రామాల్లో పరిహారం చెల్లింపులో అనేక లొసుగులు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. మొదటివిడత తరలించాల్సిన గ్రామాల్లో దేవీపట్నం మండలం పి గొందూరు పంచాయతీ పరిధిలోని నేలకోట, అంగుళూరు, పి గొందూరు, ఎ వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలోని నాగళ్ళపల్లి, పరసనపాడు, బోడుగూడెం, రావిలంక వున్నాయి. వీటిలో రికార్డుల ప్రకారం ఐదు గ్రామాలు ఖాళీ అయ్యాయి. వాస్తవానికి ఇప్పటివరకు నేలకోట, అంగుళూరు గ్రామాలు మాత్రమే నిర్వాసితులు పునరావాస కాలనీలకు వెళ్ళడంతో ఖాళీ అయ్యాయి. తాజాగా పి గొందూరు, నాగళ్ళపల్లి గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రెండు గ్రామాల్లో అత్యధికంగా కోయదొర, కొండరెడ్డి, కొండకమ్మర తెగలు జీవిస్తున్నాయి.
కొంత మంది గిరిజనేతరులు కూడా ఉన్నారు. పదేళ్ల క్రితమే వీరిని ఖాళీ చేయించాల్సి ఉన్నప్పటికీ నేటికీ పునరావాసం పూర్తిస్థాయిలో అందించకపోవడంతో ఇపుడు కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాల్సి వస్తోంది. ఉదాహరణకు మొదట్లో ఒక్కో ఇంటికీ నష్టపరిహారంగా సుమారుగా రూ.70 వేలు చెల్లిస్తే ఇపుడు అవే ఇళ్లకు కొత్త చట్టం ప్రకారం సుమారు రూ.4 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ పునరావాస ప్యాకేజీ వర్తింపజేయాల్సివుంది. అయితే పదేళ్ల క్రితమే ఖాళీచేయించాల్సిన గ్రామాలను ఇప్పటివరకు అనాలోచితంగా వదిలేయడంవల్ల ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరింత పెరిగింది. దీనితో పరిహార భారమూ అధికమయ్యింది. అయితే తామేమీ వెళ్ళమని భీష్మించుకుని కూర్చోలేదని, తమకు రావాల్సిన పునరావాస ప్యాకేజీని పూర్తిస్థాయిలో ఇచ్చేస్తే గ్రామాలను ఖాళీ చేసి వెళ్ళిపోతామని అంటున్నా, పట్టించుకునే నాథుడు కన్పించడం లేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటివరకు అందించిన పరిహారం విషయంలో పి గొందూరు, నాగళ్ళపల్లి గ్రామాల్లో అనేక అవతకవలు వెలుగుచూస్తున్నాయి. ఈ గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఒక విధంగా భూమి వివరాలు వుంటే, క్షేత్ర స్థాయిలో మరోవిధంగా ఉన్నాయి. కొంతమంది పట్టాదార్ పాస్ పుస్తకాలను అధికారులు గుప్పెట్లో పెట్టుకున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయంలోని భూసేకరణ కార్యాలయం చుట్టూ తిరగ్గా తిరగ్గా తమ పుస్తకాలు ఇచ్చారని కొంత మంది గిరిజనులు చెప్పారు. కొంతమందికైతే పరిహారం ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు వేలి ముద్రలు వేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. పి గొందూరు గ్రామానికి చెందిన నేపిక అప్పన్నదొర తనకున్న 2.20 ఎకరాల భూమికి పరిహారం ఇచ్చేసినట్టు వేలి ముద్ర వేయించుకున్నారని, తనకు ఎటువంటి పరిహారం అందలేదని చెప్పారు. తనకు పరిహారం చెల్లించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. తమకు పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించడానికి వస్తే మాత్రం సహించేది లేదంటున్నారు. ఈ రెండు గ్రామాల్లో పద్దెనిమిదేళ్లు నిండినవారికి పునరావాస ప్యాకేజీతో పాటు, భూములు, ఇళ్లకు నష్టపరిహారం, భూమికి భూమి ఇచ్చిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేస్తామని స్పష్టంచేస్తున్నారు.

చిత్రాలు..తాజాగా ఖాళీచేయించనున్న పి గొందూరు, నాగళ్లపల్లి గ్రామాలు