ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దు కోసం ఇక ఉమ్మడి పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: దేశ వ్యాప్తంగా గత 13 సంవత్సరాలుగా పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం వేర్వేరు దారుల్లో జరుగుతున్న ఆందోళన ఇక కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఉమ్మడి ఉద్యమంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం తీసుకున్న చొరవే కారణం కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా 30 లక్షల మంది వివిధ రాష్ట్రాల ఉద్యోగులు, మరో 16 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) స్థానంలో పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్‌జీవో సంఘం తొలుతగా రాష్ట్రంలోని వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలన్నింటితో కల్సి పెన్షన్ సాధన సమితి ఏర్పాటు చేయడమే కాకుండా తొలిసారిగా శనివారం విజయవాడ నగరంలో ఏర్పాటుచేసిన సదస్సుకు వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు హాజరై నూతన సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యక్ష పోరు సాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. జనవరి 9న తొలుత ఆయా రాష్ట్రాలా వ్యాప్తంగా పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 10న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, ప్రజాప్రతినిధులు, ఆర్థికవేత్తలు, వివిధ కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, చివరగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టి పాలకుల్లో కదలిక తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏలో భాగస్వామి అయినందున కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీపీఎస్ విధానం నుంచి తాను వైదొలిగేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరవధిక సమ్మెబాట పట్టేందుకు వెనుకాడేది లేదని ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీకుమార్ తెలిపారు. శనివారం జరిగిన సదస్సులో శ్రీకుమార్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏకతాటిపైకి వచ్చి ‘పెన్షన్ సాధన సమితి’ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని ఒక హక్కుగా కల్పించిందని, ఉద్యోగులందరికీ ఒక పనికి ఒకే వేతనం అమలుచేయాలని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆందోళన బాట బట్టి హక్కులు సాధించేందుకు ఒకేతాటిపైకి రాక తప్పడం లేదన్నారు.
ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన 98వేల కోట్ల డిపాజిట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. తొలిసారి అన్ని సంఘాలు ఏక వేదికపైకి వచ్చి పెన్షన్ సాధన సమితి ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. సీపీఎస్ రద్దుపై చర్చించేలా రాజకీయ నాయకులు వారి గళాలను వినిపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఎటువంటి ఒత్తిడి తీసుకురానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపించి సీపీఎస్ విధానాన్ని ఉద్యోగులపై బలవంతంగా రుద్దాయన్నారు. టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ విధానం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 55లక్షల మంది పైగా ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. వారికి బాసటగా నిలిచి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేసే వరకు ఉద్యోగ సంఘాల పోరాటాలకు టీఎన్‌జీవోస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ప్రతాప్ మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుపై సింగిల్ అజెండాగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కేంద్ర, రాష్ట్ర సంఘాలు ముందుకు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ ఐవీ రావు మాట్లాడుతూ పెన్షన్ సాధన సమితి ఏర్పాటు దేశానికే స్ఫూర్తిని ఇచ్చేలాగా ఉందన్నారు. సదస్సులో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ కార్యదర్శి ఆర్.శ్రీనివాసన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్, ఉపాధ్యక్షుడు రఘురామన్, ఎకెఎస్‌జిఇఎఫ్ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎస్ జయకుమార్, కార్యదర్శి శోభాలోక్‌నాధ్, ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
చిత్రం..విజయవాడలో శనివారం జరిగిన కేంద్ర ప్రభుత్వ, వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో సంఘ నేత పి. అశోక్‌బాబు