రాష్ట్రీయం

వీగిన అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మంగళవారం శాసనసభలో సుమారు రెండు గంటలపాటు జరిగిన చర్చ అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సూచన మేరకు సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌లో అవిశ్వాసానికి అనుకూలంగా 57, వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. దీంతో వ్యతిరేకించే వారి ఓట్లు అధికంగా ఉండడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుండగా సభ తలుపులు మూసివేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఆదేశాలతో శాసనసభ సిబ్బంది అనుకూల, వ్యతిరేకంగా నిలబడిన వారిని లెక్కించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కె.ఇ కృష్ణమూర్తి తలుపులు మూసివేయడంతో ఆయన బయటే ఉండిపోయారు. కాగా ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు లండన్ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు. మరో ఇద్దరు సభ్యులు వర్మ, యరపతినేని శ్రీనివాసరావులు కూడా సభకు హాజరు కాలేకపోయారు. సభలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల, పురపాలక శాఖ మంత్రి నారాయణ శాసనమండలి సభ్యులు కావడంతో వారు ఓటింగ్ సమయంలో కూర్చునే ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల పార్టీ మారిన 8 మంది శాసనసభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. నగరి శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌లో ఉన్న కారణంగా సభకు రాలేదు. మరో వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ్యుడు అనిల్ కూడా ఓటింగ్‌కు హాజరు కాలేదు. ఓటింగ్‌కు ముందు జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేరే బిఫాంపై గెలిచిన వారిని తన వద్ద అక్రమ సంపదతో కొనుగోలు చేస్తూ చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఈ దారుణాన్ని నివారించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరినా కనీసం స్పందించలేదని, మా వాదనను పట్టించుకోలేదని అన్నారు. నిన్న ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానానికి నోటీసు ఇస్తే వెంటనే చర్చ అంటూ మా నోరునెక్కారని, ఇప్పుడు స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇచ్చి చర్చ జరగాలి, డివిజన్ కావాలని కోరితే సమయం ఇవ్వకుండా వెంటనే చర్చ చేపట్టారని అన్నారు. తమ సభ్యులకు విప్ జారీ చేసే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ శాసనసభ రూల్ 340 (2)ని ఉల్లంఘించి తమ శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేశారని అన్నారు. తాము రూల్ 179 (సి)ని అనుసరించి స్పీకర్‌ను తొలగించే క్లాజ్‌తో నోటీసు ఇస్తే 14 రోజుల్లోగా చర్చ జరిగి, డివిజన్‌కు అంగీకరించాలని కోరామని అన్నారు. అయితే మంగళవారం రూల్ నెం 71ని సస్పెండ్ చేసి సభను జరుపుతున్నామని ప్రకటించారు. ఇది చాలా అన్యాయమని, శాసనసభ నిబంధనలకు విరుద్దమని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ఏ రకంగా అవిశ్వాసతీర్మానంపై చర్చ చేపట్టారో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు రూలింగ్ ఇవ్వాలని ప్రతిపక్ష నేత జగన్ పట్టుబట్టారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మనమే తయారు చేసుకుని మనమే ఉల్లంఘించడం ఏమిటని నిలదీశారు. అనంతరం సిఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో జగన్ ధ్వజమెత్తారు. ఆయనకు క్రెడిబిలిటీ, కేరక్టర్ రెండూ లేవని అన్నారు. ప్రజలను మోసం చేసి తప్పుడు వాగ్ధానాలతో గెలిచిన చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదని, సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కున్న చంద్రబాబుకు వ్యక్తిత్వం లేదన్నారు. దీంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి జగన్‌పై అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘మీ తండ్రి చనిపోయిన వెంటనే కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలను చీల్చి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలీదా’అని నిలదీశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రూల్‌ను సస్పెండ్ చేసే అధికారం సభకు మాత్రమే ఉంది తప్ప స్పీకర్‌కు కాదన్న సంగతి జగన్ గమనించాలని అన్నారు. నోటీసు పరిగణనలోకి తీసుకోవడానికి 14 రోజుల సమయం ఉంటుంది గానీ, చర్చకు కాదని, ఎప్పుడైనా చర్చించవచ్చని యనమల సభకు వివరణ ఇచ్చారు. ‘మీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని పిఆర్‌పి ఎమ్మెల్యేలతో బేరసారాలు పెట్టింది నిజం కాదా’ అని యనమల అనడంతో ఒక్కసారిగా వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు లేచి నిలబడి గొడవ చేశారు. చర్చకు ఎలా అనుమతించారో రూలింగ్ ఇవ్వాలని పట్టుబట్డారు. యనమల తన ప్రసంగం పూర్తికాగానే ఇంతటితో చర్చ ఆపి, ఓటింగ్ నిర్వహించాలని డిప్యూటీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే ఓటింగ్ నిర్వహిస్తున్నామని, అందుకు అనుగుణంగా నిబంధనలను చదివి వినిపించారు. దాంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
స్పీకర్ పదవిని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్న కోడెల కుటుంబం శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు విమర్శల దాడి చేశారు. కోడెల కుమారుడు,కుమార్తె అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సి సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. కోడెలకు గతంలో బాంబుపేలుళ్ల కేసుతో సంబంధం ఉందని, పౌరసరఫరాల శాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఫ్యాక్షనిజం, అవినీతి ఉన్న ఆయనను ఎలా స్పీకర్‌ను చేస్తారని నిలదీశారు. సిబిఐ కేసు కూడా బాంబులకు సంబంధించి విచారణ చేపట్టిందని అన్నారు. స్పీకర్‌పై ఆరోపణలు చేసిన శ్రీనివాస్‌రెడ్డిపై మంత్రులు మూకుమ్మడి దాడి చేశారు. మంత్రులు యనమల, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, రఘునాధరెడ్డి తదితరులు మాట్లాడుతూ స్పీకర్ కోడెల కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని, అయినా ఎప్పుడో కేసులకు ఇప్పుడు ఉన్న స్పీకర్ పదవికి సంబంధం లేదని వారు తిప్పికొట్టారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు ఆయన ఎంత నిజాయితీపరుడో మీరే చెప్పి ఇప్పుడు మీ స్వార్ధానికి ఇలా మాట్లాడతారా అని ప్రతిపక్షం దాడికి ఎదురు దాడి చేశారు.