ఆంధ్రప్రదేశ్‌

‘కాపు వేదిక’గా ముఖ్యమంత్రి కార్యాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పడానికి వినియోగించుకోవలసిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్‌ను కాపు ఉద్యమ వేదికగా వాడుకునే పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన తరువాత, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చల్లార్చేందుకు, అలాగే, ముద్రగడపై ఎదురు దాడికి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కాపు ఎమ్మెల్యేలను, మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉసిగొలుపుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఈ మంత్రులు బయటెక్కడా మాట్లాడకుండా, ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్‌నే వేదికగా చేసుకుని మాట్లాడ్డం గమనార్హం. ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు తదితరులు సిఎంఓ మీడియా పాయింట్ నుంచే రోజూ కాపు ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. మంత్రులే కాదు, బోండా ఉమతోపాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా సిఎంఓ కార్యాలయం నుంచి మాట్లాడ్డం విమర్శలకు దారి తీస్తోంది. కేవలం ఒక సామాజికవర్గం గురించి వారు సిఎంఓలో మాట్లాడుతున్నారు. ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వం చేసిన, చేయబోతున్న ప్రయోజనాల గురించి మాట్లాడితే అంతగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ వీరంతా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఉద్యమకారులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఉద్యమాన్ని విరమించమని ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేసి సరిపెట్టాల్సిన ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు ముద్రగడను టార్గెట్‌గా చేసుకుని మాట్లాడ్డం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు ఉద్యమం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకూ సిఎం కార్యాలయం నుంచి మాట్లాడలేదు. ముద్రగడ ఉద్యమం ప్రారంభించిన తరువాత ఆయన కడపలో జరిగిన విలేఖరుల సమావేశంలోనే మాట్లాడారు తప్ప, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడలేదు. కానీ ఆయా ఛానళ్ల లైవ్ సమయాలను చూసుకుని, మంత్రో, ఎమ్మెల్యేనో వచ్చి మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఈ సంప్రదాయం తగదని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. అన్నింటికీ మించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కూర్చుని, ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. విజయవాడలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈ అంశంపై మాట్లాడవలసినవారంతా ప్రభుత్వ అధికార కార్యాలయం నుంచి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. ముద్రగడ ఉద్యమం రోజు రోజుకూ రాజకీయ కోణం తీసుకుంటోంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన ఎవ్వరైనా, సిఎంఓ నుంచి కాకుండా, పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రులు చినరాజప్ప, నారాయణ (ఫైల్‌ఫొటో)