ఆంధ్రప్రదేశ్‌

రచ్చగా మారిన చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 8: రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతనిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయనే అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లపై హైడ్రామా నెలకొంది. నియోజకవర్గంలో అనర్హులు పింఛన్లు పొందుతున్నారని, జన్మభూమి కమిటీ సభ్యులు కనుసన్నల్లో కొద్దిమందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని, అసలు వితంతు, వికలాంగులైన అర్హులను పక్కనపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ పూర్తిస్థాయిలో పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, ఎలాంటి అక్రమాలు నిరూపించినా అందుకు అధికార పార్టీ బాధ్యత వహిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేయటంతో పాటు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీంతో సోమవారం సత్తెనపల్లి వేదికగా ఇరువురు నేతలు చర్చకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం 6 గంటలకే గుంటూరు నవభారత్‌నగర్‌లోని అంబటి రాంబాబు ఇంటికి చేరుకున్నారు. ఆయన్ను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమని ప్రశ్నించిన అంబటికి హౌస్ అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు జారీచేశారు. మరోవైపు బహిరంగ వేదికపై చర్చించేందుకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ నుంచి బయల్దేరగా, ఆయనను కాజ టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు అడ్డగించారు. అయితే శాంతియుతంగా చర్చించేందుకు వస్తున్నట్లు చెప్పి కారులో సాగిపోతుండగా తిరిగి చుట్టుగుంట వద్ద గుంటూరు అర్బన్ పోలీసులు అడ్డుకుని తిప్పిపంపారు. తనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచటంపై అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఒకానొక దశలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనకు వెంకన్న సుపరిచితుడే అని అయితే ఆయనతో యుద్ధానికి వెళ్లడంలేదని సామరస్య పూర్వక వాతావరణంలో చర్చించేందుకు బయల్దేరిన తనను అడ్డగించి నిర్బంధించడం అక్రమమని మండిపడ్డారు. సత్తెనపల్లిలో అవకతవకలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని దీనిపై చర్చించేందుకు అనుమతించక పోవటం అప్రజాస్వామిక మన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశ్యపూర్వకంగానే గృహ నిర్బంధానికి పోలీసులను ప్రేరేపించారని విమర్శించారు. తనను మాత్రమే నిర్బంధించిన పోలీసులు వెంకన్నకు విజయవాడ నుంచి స్వాగతం పలికి సత్తెనపల్లిలో స్పీకర్ కార్యాలయానికి తీసుకువెళ్లారని, తాను రాలేకపోయినందున అంబటి ముఖం చాటేశారనే దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. అంబటి హౌస్ అరెస్టును నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు రావి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఖండిస్తూ కార్యకర్తలతో సహా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుద్దా వెంకన్నను రాజలాంఛనాలతో తీసుకువెళ్లి వైసీపీ నేతలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇటీవల జన్మభూమి గ్రామసభలో తమ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో మైకు లాక్కుని దౌర్జన్యకరంగా ప్రవర్తించారంటూ ఈ నైజం ఈనాటిది కాదన్నారు. జన్మభూమి గ్రామసభల్లో పింఛన్లు అందరికీ అందిస్తున్నట్లు అధికార పార్టీ అబద్ధాలు చెప్తోందని ఆరోపించారు. కాగా దీనిపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ తనను కూడా పోలీసులు అడ్డుకున్నారని, కనీసం మీడియా ఎదుట హాజరు కానివ్వలేదని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తాము సహకరించామని తెలిపారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజీపడటంలేదని, నూటికి నూరుశాతం అర్హులకే పథకాలు అందుతున్నాయన్నారు. తప్పులు ఉన్నట్లు నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు.