ఆంధ్రప్రదేశ్‌

గిరిగీసి.. బరిలోకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 13: సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెదా అంటూ ఒక సినీ రచయిత భావానికి తీసిపోకుండా, రాజధాని కృష్ణా జిల్లా నలుచెరుగులా సంక్రాంతి సంబరాలు అంబరానంటేలా ప్రారంభమయ్యాయి. పట్టిసీమ నీటి సాఫల్యంతో కళకళలాడిన జిల్లా ధాన్యాగారాలతో ఉత్సాహంతో ఉన్న రైతులు సంక్రాంతి సంబరాలను కోడి పందాలతో శ్రీకారం చుడుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో అతి ముఖ్యమైన కోడి, పొట్టేళ్ల పందాలకు పందెం రాయుళ్లు సిద్ధపడుతుండగా, వారిని నిలువరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంతో, కాస్త డీలా పడినప్పటికీ.. సంప్రదాయాలను మాత్రం కొనసాగిస్తున్నారు. ఫలితంగా గిరిగీసి మరీ బరిలోకి కోళ్లు, పొట్టేళ్లను దించుతున్నారు. శుక్రవారం నుంచి కృష్ణా జిల్లా యనమలకుదురులో కోడిపందాలు ప్రారంభం కాగా, శనివారం నుంచి గొడవర్రు, పోరంకిలో ప్రారంభం కాగా, ఈడ్పుగల్లులో ఆదివారం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. వాటిని పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అయినప్పటికీ వారిని ఖాతరు చేయని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి బరిని ప్రారంభించారు. అంతకుముందు గొడవర్రులో టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ బరిని రిబ్బన్‌కట్ చేసి కోడిని బరిలోకి దింపారు. ప్రతీ ఏడాది భిన్నంగా నిర్వహించే పందెం బరిలో ఈసారి కాసినోవా ప్రత్యేకం కానుంది. సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న కోడి పందాల నిర్వహణను అడ్డుకోవడం సరికాదని ప్రజాప్రతినిధులు వాదిస్తుంటే, సంప్రదాయం పేరుతో జూదం నిర్వహిస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యే ఉన్నారు. గత ఏడాదికి భిన్నంగా ఈ ఏడాది పోరంకి, ఈడ్పుగల్లు, గొడవర్రు, యనమలకుదురు, హనుమాన్ జంక్షన్‌తో పాటు పలు ప్రాంతాల్లో సకల సదుపాయాలు, అన్ని హంగులతో బరులను సిద్ధం చేశారు. ఒక్కొక్క బరి పది ఎకరాల్లో పూర్తి స్థాయి ఫెన్సింగ్ ఏర్పాటుతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా బరులు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సారథ్యం వహిస్తున్న పెనమలూరు నియోజకవర్గ పరిధిలో యనమలకుదురు, పోరంకి, ఈడ్పుగల్లు, గొడవర్రులో పందెం బరులను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా పందాల కోసం బరులకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు సమాచారంతో పందెం జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, పందాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. పందెం నిర్వహణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కోళ్లకు కత్తులను కట్టకూడదని ఆదేశాలు ఇవ్వడంతో పాటు, రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ పూచీకత్తును వారి నుండి తీసుకుంటున్నారు. పోలీసు పహారా, నిరంతర నిఘా ఉన్నప్పటికీ కంకిపాడు మండలంలోని గొడవర్రులో సుమారు ఆరు ఎకరాల్లో ఏర్పాటు చేసిన కోడి పందాలను ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. వీటితో పాటు పోరంకి గ్రామంలో కూడా ఎనిమిది ఎకరాల్లో కోడి, పొట్టేళ్ల పందాల కోసం బరులు ఏర్పాటు చేశారు. యనమలకుదురు గ్రామంలో ఇప్పటికే ప్రారంభమైయిన కోడి పందాల పోటీలు, రాత్రి పగలు అనే తేడా లేకుండా గత రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు. గుడివాడలో కోడి పందాలను అధికార పార్టీ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుతో కలసి స్థానిక ప్రజా ప్రతినిధులు శనివారం లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. అంపాపురంలో పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో కోడి పందాలు నిర్వహించే స్థల యజమానిపై బైండోవర్ కేసు నమోదు చేశారు. ఇక్కడ ప్రతీ ఏడాది ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో కోడి పందాలను నిర్వహిస్తారు. బైండోవర్ కేసు నమోదు చేసినప్పటికీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండటంతో పోలీసులు ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేశారు. కోడి పందాలను నిర్వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ పోలీస్ కమిషనర్ రమణకుమార్, జిల్లా ఎస్పీ త్రిపాఠి హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీల పేరుతో కోడి పందాలు నిర్వహిస్తే సహించేది లేదంటున్నారు.

చిత్రాలు..ఈడుపుగల్లులో కోళ్లను బరిలోకి దించుతున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్
*గొడవర్రులో కోడి పందాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ వైరాజేంద్రప్రసాద్