ఆంధ్రప్రదేశ్‌

జనం నాడి పడుతున్న జనసేనాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: పార్టీకి, తనకు బలం, బలహీనతగా మారిన అభిమానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాను ప్రచారం చేసిన ప్రజారాజ్యం పార్టీ పతనానికి, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సింహభాగం స్థానాలు కైవసం చేసుకోలేకపోవడానికి వెనుక కారణాలు పసిగట్టిన పవన్, తన జనసేనకూ అలాంటి దుస్థితి రాకుండా ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నట్లు ఆయన ఇటీవలి కాలంలో రాస్తున్న లేఖలు, చేస్తున్న ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, విమర్శకులకు మధ్య పతాక స్థాయిలో జరుగుతున్న మాటల యుద్ధం వికటించి చేయిచేసుకునే వరకూ వెళ్లడం, అది మీడియాలో ప్రముఖంగా రావడంతో పవన్ నష్ట నివారణకు దిగాల్సి వచ్చింది. ముఖ్యంగా పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఫెయిలయిందంటూ ఆవేదన చెందిన పవన్ అభిమాని, స్వయంగా ఆయన పోస్టర్‌ను కొట్టిన దృశ్యాలకు రెచ్చిపోయిన పవన్ అభిమానులు సదరు సహచర అభిమానిని గుర్తించి పట్టుకుని మరీ అతని దుస్తులు విప్పి గాయపరిచి అదే పోస్టర్‌కు బలవంతంగా దండం పెట్టించిన వీడియో హల్‌చల్ చేసింది. ఒకరకంగా అది ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు పంపినట్లయింది. ఇలాంటి వికృత, హింసాత్మక చర్యల ప్రభావం భవిష్యత్తులో పార్టీపై పడుతుందని గ్రహించిన పవన్ దిద్దుబాటు చర్యలకు దిగి, అభిమానులకు లేఖ రాయవలసి వచ్చింది. తనను ఎవరు దూషించినా, మాటలతో అవమానించినా, తనను వ్యక్తిగతంగా, పార్టీపరంగా కించిపరిచినా ఎవరూ స్పందించవద్దని పవన్ తన లేఖలో కోరాల్సి వచ్చింది. జనక్షేత్రంలో దిగేవరకూ అంతా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పవన్ లేఖ రాసిన రోజునే ఆయనను తరచూ విమర్శించే విమర్శకులు కూడా మెత్తబడటం, ఇకపై పవన్ గురించి వ్యక్తిగతంగా ఎక్కడా మాట్లాడబోమని హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ‘కల్యాణ్ గారి పార్టీకి అభిమానులే బలం, బలహీనత. వారు లేకపోతే కార్యక్రమాలు సక్సెస్ కావు. అలాగని వారిని పూర్తిగా నెత్తిన పెట్టుకోవడం కష్టం. అలాగని వదిలేస్తే, ఆలోచన లేకుండా ఉండే వారి ఆవేశం భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తుంది. పీఆర్పీ అనుభవం మాకందరికీ ఇదే చెప్పింది. అందుకే ఇప్పటినుంచే అభిమానులను ఒక పద్ధతి ప్రకారం, వారు ఇబ్బంది పడకుండా వ్యవహరించాల్సి ఉంది’ అని జనసేన నేత ఒకరు వ్యాఖ్యానించారు. చిరంజీవి పీఆర్పీ స్థాపించినప్పుడు కూడా అభిమానులే కీలక పాత్ర పోషించారు. వారి అత్యుత్సాహం, తమ వర్గానికి చెందిన వ్యక్తిని ఎలాగైనా సీఎం చేయాలన్న తపనతో మిగిలిన వర్గాలను సమన్వయం చేసుకోలేకపోవడం, పార్టీపై పడిన కాపు ముద్ర కలిసి పుట్టిముంచాయి. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉండే కాపులను బీసీ వర్గాలు సంప్రదాయకంగా వ్యతిరేకిస్తాయి. ఆ సమయంలో ఒక వర్గానికి చెందినవారు, అభిమానులు మోతాదుకు మించి వ్యవహరించడంతో ‘అధికారంలోకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత భయంకరంగా ఉంటుందో’నన్న ప్రచారం క్షేత్రస్థాయికి వెళ్లడం కూడా పీఆర్పీ ఓటమికి మరో ప్రధాన కారణమయింది. పీఆర్పీలో ఎక్కువ మంది కాపులే ఉండటం, ఆ పార్టీపై కులం ముద్ర పడటంతో ఆ వర్గాన్ని వ్యితిరేకించే మిగిలిన సామాజికవర్గాలన్నీ ఏకమై పీఆర్పీని ఓడించాయి. ఫలితంగా చిరంజీవి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి, బలిజల సహకారంతో తిరుపతిలో స్వల్ప మెజారిటీతో గెలిచి గట్టెక్కాల్సి వచ్చింది. ఇలాంటి అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న పవన్, భవిష్యత్తులో జనసేనకు అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి. పీఆర్పీ సమయంలో చిరంజీవి చుట్టూ ప్రైవేటు సైన్యం ఎక్కువగా ఉండటంతో ఆయన జనంలోకి వెళ్లలేకపోయారు. చిరంజీవి మీడియా సమావేశాల్లో కూడా అభిమానులు చొరబడి గందరగోళం సృష్టించేవారు. చిరంజీవిని ఎవరైనా విమర్శిస్తే వారిపై దాడులకు దిగేవారు. ప్రస్తుతం పవన్ పర్యటనల్లోనూ అవే దృశ్యాలు పునరావృతం కావడం జనసేన నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. పవన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై నేరుగా దాడి చేయడం, విలేఖరుల సమావేశాల్లో కూడా చొరబడి మీడియాను ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా జిందాబాదులు కొట్టడంతో పాటు, వారే విలేఖరుల మాదిరిగా ప్రశ్నలు వేయడం వంటి చర్యలు చికాకు తెప్పిస్తున్నా, వారిని అదుపు చేయలేని పరిస్థితి కొనసాగుతోంది. అటు పవన్ తనకు కులాలు, మతాలు లేవని చెబుతున్నప్పటికీ, ఆయన పర్యటనలో కనిపించే ఫ్లెక్సీలు, కనిపించే వారంతా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో, తిరిగి పీఆర్పీ మాదిరిగా పార్టీపై కులముద్ర పడే అవకాశం ఉందన్న ఆందోళన జనసేన నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పవన్.. ఇటీవలి కాలంలో అభిమానులను సున్నితంగా నియంత్రించే అంశంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.