ఆంధ్రప్రదేశ్‌

జైళ్ల శాఖ భూమి ప్రైవేటు పరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: ‘వడ్డించేవారు మనవారైతే’ అన్న చందాన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ.60 కోట్ల విలువైన జైళ్ల శాఖ భూమి పర్యాటక ప్రాజెక్టు పేరుతో ప్రైవేటు సంస్థకు అప్పగించేశారు. 33 ఏళ్ల లీజు పేరిట ఈ సంస్థ చేతికి స్థలాన్ని అప్పగించడంతో చకచకా నిర్మాణ పనులు సాగిపోతున్నాయి. ఎంతో విలువైన, కీలకమైన ఈ స్థలం ఇలా ప్రైవేటు చేతికి చిక్కడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక సెంట్రల్ జైలుకు విశాలమైన, విలువైన భూములున్నాయి. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ జైలు వుంది. దీనిని అనుకుని మరో 15 ఎకరాల భూమిలో వివిధ రకాల తోటలున్నాయి. స్థానిక మిలట్రీ రోడ్డులో జైళ్ళ శాఖ క్వార్టర్లు, సెంట్రల్ జైలు భూభాగం, ఖాళీ స్థలాలు తదితర విలువైన ఆస్తులున్నాయి. ఈ భూములపై ఎప్పటి నుంచో ప్రైవేటు వ్యక్తుల కళ్లు పడ్డాయి. ఏదోవిధంగా ఈ భూములను దక్కించుకోవాలని గత కాంగెస్ ప్రభుత్వ హయాం నుంచి ప్రయత్నాలు సాగించారు. గత ప్రభుత్వం జైళ్ల శాఖకు చెందిన ఈ భూములను గృహనిర్మాణానికి కేటాయించాలని ఆలోచన చేసింది. సెంట్రల్ జైలును సైతం జగ్గంపేట ప్రాంతానికి తరలించాలని ప్రయత్నాలుచేసింది. అప్పట్లో ఈ ప్రయత్నాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికితోడు జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి తోట నరసింహం కూడా తన నియోజకవర్గంలోకి సెంట్రల్ జైలు తరలించకుండా అడ్డుకోగలిగారు. జైలు అధికారులు కూడా ఈ భూములు ఇతర శాఖలకు మళ్ళించేందుకు ఇష్టపడక ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకోవడంతో ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకుంది. అయితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా జైళ్ళ శాఖకు చెందిన సుమారు 6.80 ఎకరాల ఈ భూమిని ప్రైవేటుకు దఖలు పర్చింది. సెంట్రల్ జైలు ఎదురుగావున్న జైళ్ళ శాఖ డిఐజి బంగ్లా భూమిలో సుమారు 6.80 ఎకరాల భూమిని ప్రభుత్వం పర్యాటక లీజు పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. పర్యాటక శాఖ నిర్వహించిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌లో తెలంగాణకు చెందిన మంజీర సంస్థకు ఈ భూమిని కట్టబెట్టింది. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో మంజీర సంస్థ ఇక్కడ చేపట్టిన పర్యాటక ప్రాజెక్టు చక చకా తయారవుతోంది. గత గోదావరి మహా పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ స్థలంలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. అనంతర పరిణామాల్లో ఈ భూమి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంజీర సంస్థ చేజిక్కించుకుంది. సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో మొదటి దశలో కనె్వన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్, హోటల్ నిర్మాణం చేపట్టింది. ముందుగా కనె్వన్షన్ సెంటర్‌ను మార్చిలోగా పూర్తిచేయడానికి చర్యలుచేపట్టారు. అదే విధంగా హోటల్, మల్టీఫ్లెక్స్, షాపింగ్ మాల్ నిర్మించేందుకు ప్రణాళిక చేపట్టారు. కాగా లీజుకు పొందిన సంస్థ వెనుక కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పలుకుబడి కలిగిన కొంతమంది నేతలు వున్నట్టు తెలిసింది. స్థానికంగావున్న నేతలు, కేంద్ర స్థాయిలో కీలకమైన ఒక నేత కుమారుడు ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. కేంద్ర స్థాయి నేతకు స్థానిక నేత కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడిదారుగా ఉండటంతో ఆయన ప్రోద్బలంతోనే ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. ఈ సంస్థ వెనుక పెట్టుబడిదారులు ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన పెద్దలు కాబట్టే గుట్టుచప్పుడు కాకుండా భూమిని దారాదత్తమైందని తెలుస్తోంది. రూ.కోట్ల విలువైన భూమి నామమాత్ర లీజు పద్ధతిన ప్రైవేటు సంస్థ మంజీర చేతికి చిక్కింది.
చిత్రం..జైళ్ల శాఖ భూమిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న కనె్వన్షన్ సెంటర్