ఆంధ్రప్రదేశ్‌

బాబు డ్రామాలను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 5: పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని, ఆ దిశగా తాము అధికారంలోకి రాగానే పలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఓసి కింద వచ్చే రెడ్డి, కమ్మ కులాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కేంద్రంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యమని, ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారని, కేబినెట్ ఆమోదంలో ఆ మంత్రులకు తెలియకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండదన్నారు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబునాయుడు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ ప్రజల్ని మోసగించేలా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సహకార రంగానికి చంద్ర గ్రహణం పట్టుకుందని, లాభాల బాటలో నడుస్తూ ఉన్న సహకార సంఘాలు, ఫ్యాక్టరీలు మూతపడడటమే ఇందుకు నిదర్శనమన్నారు. నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ.12కోట్లకు ప్రస్తుత ఎంపీ అయిన సీ ఎం రమేష్‌కు ధారాదత్తం చేశారని, ఈ విషయాన్ని స్వయానా రైతులే తనకు చెప్పారని అన్నారు. కోవూరు చక్కెర కర్మాగారాన్ని కూడా తక్కువ ధరకు అమ్మేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వరి పండించే జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఎంతో ముఖ్యమైందని, ఇక్కడి రైతులకు మేలు చేసే ప్రయత్నం ఏదీ చంద్రబాబు చేయలేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదని దుయ్యబట్టారు. కానీ కోకాకోలా కంపెనీ ఏర్పాటు చేయించి, దీనికి నీరిచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సంగం, నెల్లూరు బ్యారేజీలు ఉన్నాయని, వై ఎస్ హయాంలోనే వాటి ఆధునీకరణ పనులు 80 శాతం పూర్తి కాగా, మిగిలిన 20 శాతం పనులను ఇప్పటికీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ముదివర్తి కాజ్‌వే కోసం రూ.250కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారని, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. రాష్ట్రంలో ఆక్వాసాగులో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల నుండి ఏసిడి పేరుతో అదనపు విద్యుత్ రుసుంలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో అన్నీ అక్రమాలేనని, ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. వడ్డీలేని రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి పేదవాడిని 3 సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని హామీనిచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో ఎంత మంది పేదలకు ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో సోమవారం నాటికి జగన్ బహిరంగసభకు ప్రజలు హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, జిల్లా వైకాపా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
చిత్రం..బుచ్చిరెడ్డి పాలెంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్