ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విలంబినామ ఉగాది వేడుకలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఉగాది ఆస్థానం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనంపై గురుడాళ్వార్‌కు అభిముఖంగా ఆశీనులను చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. బంగారు వాకిలిలో ఆగమపండితులు, అర్చకులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పర్వదినం సందర్భంగా శ్రీవారి మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరించారు. ఆస్థానం అయిన తరువాత పండితులు పంచాంగశ్రవణం నిర్వహించారు. శ్రీ విలంబినామ సంవత్సరంలో దేశ కాల, రుతు స్థితిగతులను, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను తెలియజేశారు. అనంతరం ప్రసాద నివేదనతో కార్యక్రమం ముగిసింది.
ప్రత్యేక ఆకర్షణగా ఫల, పుష్ప, కూరగాయల ఆకృతులు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, సపోటా, నారింజ, దానిమ్మ, కర్బూజ, మొక్కజొన్న, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం వద్ద పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీ వేంకటేశ్వర మహత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయం వెలుపల వివిధ రకాల పుష్పాలతో పూర్ణకుంభం, అశ్వరథంలో రాధాకృష్ణులు, నవనీత చిన్ని కృష్ణుడు, ఐరావతం వంటి సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహణకు వెళ్తున్న దృశ్యం