ఆంధ్రప్రదేశ్‌

పన్నుల్లో వాటా అంతా మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: కేంద్ర పన్నుల వాటా అంతా మాయ అని, కేటాయింపుల విధానంలో లోపం ఉందంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఆరోపించారు. దక్షిణాది నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంటే, ఉత్తరాదికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సెంట్రల్సీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్‌ఎస్)లను రద్దు చేయాలని, ఆ నిధులను రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లల్లో ఇప్పటి వరకూ 65,750 కోట్ల రూపాయల మేర అప్పులు చేశామని వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో 2018-19 సంవత్సర బడ్జెట్‌పై జరిగిన చర్చపై మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ కేంద్ర పన్నుల్లో వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతోందని, ఈ ప్రకారం 33 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. కానీ అది అంతా మాయగా అభివర్ణించారు. కేటాయింపులకు సంబంధించి అనుసరిస్తున్న విధానం దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. పన్నుల్లో వాటా కింద యుపీకి 1.41 లక్షల కోట్ల రూపాయలు, బీహార్‌కు 76,175 కోట్లు, మహారాష్టక్రు 59,400 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన ఐదు రాష్ట్రాలకు కేటాయించే మొత్తం కన్నా యుపీకీ ఎక్కువ కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. ఫెర్ఫార్మింగ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ నిధులు వస్తున్నా, కేటాయింపుల్లో మాత్రం తగ్గిస్తుంటారన్నారు. పన్నుల్లో వాటాల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుండగా, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం కలుగుతోందన్నారు. తాజాగా 2011 జనాభాను కేటాయింపుల్లో ఒక పాయింట్‌గా చేర్చడంతో మరింతగా కేటాయింపులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై తనతో కేరళ ఆర్థిక మంత్రి మాట్లాడారని వెల్లడించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు తప్పకుండా ఖర్చు చేస్తామన్నారు. ఇది ఊహల బడ్జెట్ కాదని, దగా బడ్జెట్ కాదని స్పష్టం చేశారు. రియలస్టిక్ బడ్జెట్ అని, సంక్షేమ బడ్జెట్ అని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ మిగులు ఉంటుందన్నారు. కేంద్రం నుంచి రెవెన్యూ లోటు కింద 12 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, దీనిని కలుపుకుంటే మిగులు వస్తుందని స్పష్టం చేశారు. రెవెన్యూ లోటును 16 వేల కోట్ల రూపాయలుగా కాగ్, 15 వేల కోట్లని ఆర్బీఐ, 24 వేల కోట్ల రూపాయలుగా నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. కాగ్ చెప్పిన దానిని కూడా పట్టించుకోని దారుణ వైఖరిని కేంద్రం అనుసరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని, రెవెన్యూ లోటు కారణంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టవద్దనే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలను సంప్రదించకుండా సీఎస్సెస్‌లను అమలు చేయడం వల్ల రాష్ట్రాలు 40 శాతం మేర నిధులను సమకూర్చాల్సి వస్తోందన్నారు. సీఎస్సెస్‌లకు నిధులు కేటాయించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం తాను అనుకున్న పథకాల అమలుకు నిధుల సమస్య వస్తోందన్నారు. ఆ పథకాలను రద్దు చేసి, ఆ మొత్తాన్ని నేరుగా రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. దీనిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే 1.48 లక్షల కోట్ల రూపాయల మేర అప్పు ఉందని, గత మూడేళ్లలో 65,750 కోట్ల రూపాయల అప్పు చేశామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి మరో 30 వేల కోట్ల రూపాయల మేర అప్పు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.