ఆంధ్రప్రదేశ్‌

బాబోయ్.. బీటీ-3!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, మార్చి 21: కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో బీటీ-3 విత్తన పత్తి వ్యాపారంలో బడాబాబుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ అండదండలతో బీటీ-3 విత్తన మాఫియాను నేతలు శాసిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల వైపు కనె్నత్తి చూసేందుకు కూడా వ్యవసాయాధికారులు సాహసించక పోవడానికి కారణం ఇదేనని అంటున్నారు. సుమారు 5 వేల హెక్టార్లలో సాగుచేస్తూ టన్నుల కొద్దీ బీటీ-3 విత్తనాలను సరిహద్దులు దాటిస్తూ కోట్లు గడిస్తున్న విత్తన మాఫియా గుట్టు రట్టు చేయకపోతే ఇది మరింత విజృంభించి అమాయక రైతుల ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయస్థాయి సామాజిక సేవాసంస్థలో అత్యున్నత పదవి అలంకరించి నంద్యాలలో బడా విత్తన వ్యాపారిగా చెలామణి అవుతున్న ఓ నేత, రాజకీయ పార్టీ అండదండలతో తెరచాటు వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగిన, గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఓ నేత కూడా నంద్యాలలో పేరు మోసిన విత్తనోత్పత్తి సంస్థకు అధినేత. ఈయన వైపూ వ్యవసాయాధికారులు కనె్నత్తి చూడలేకపోతున్నారు. అలాగే స్వల్పకాలంలో నకిలీ విత్తన వ్యాపారంలో కోట్లకు పడగలెత్తిన దొర్నిపాడు మండలానికి చెందిన సోదరులు నంద్యాల కేంద్రంగా నిషేధిత బీటీ-3 విత్తన ప్రాసెసింగ్, అక్రమ రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. వీరిలో ఒకరు గతంలో సీడ్ కంపెనీని మోసం చేసిన నేరంపై 20 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న విషయం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు నకిలీ విత్తన వ్యాపారంలో కోట్లకు పడగలెత్తారు. అధికార పార్టీకి చెందిన నేత ముఖ్య అనుచరుడు వ్యవసాయాధికారులను శాసిస్తూ వ్యాపారాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట నుండి నూనెపల్లె, బొగ్గులైన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 10 కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో నిషేధిత బీటీ-3 విత్తనాలు ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆర్గనైజర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారు. సరిహద్దులు దాటిన బీటీ-3 పత్తి విత్తనాలు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లతో బ్రాండెడ్ కంపెనీల ముద్రతో మళ్లీ నంద్యాలలోని విత్తన దుకాణాలకు చేరుకుంటున్నాయి. ఆర్గనైజర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వాటిని బీటీ-2 పేర రైతులకు అంటగడుతున్నారు. బీటీ-3 విత్తన రాకెట్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే వీరి ఆగడాలు మరింత పెరిగిపోయి, పత్తిసాగులో నష్టాలు ఎదుర్కొని రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
నంద్యాల ప్రాంతాన్ని సీడ్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అమెరికాలోని అయోవా విత్తనోత్పత్తి యూనివర్శిటితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంఓయు కుదుర్చుకుని తంగెడంచలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విత్తనోత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కంటున్న కలలకు నకిలీ విత్తన రాకెట్ మచ్చ తెచ్చే ప్రమాదం లేకపోలేదు. గతంలో పలు విత్తనోత్పత్తి సంస్థలు భారతదేశం నలుమూలల నుంచీ ఇక్కడికి వచ్చి విత్తనోత్పత్తి చేస్తూ అటు ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఆదాయం చేకూర్చాయి. నకిలీ విత్తన మాఫియా కార్యకలాపాల కారణంగా నంద్యాలలో నకిలీ విత్తనాలు సరఫరా, మార్కెటింగ్ ఊపందుకోవడంతో కాలక్రమంలో జాతీయ స్థాయి విత్తనోత్పత్తి సంస్థలు వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పటికైనా నంద్యాలలో నకిలీ విత్తన మాఫియాను కూకలివేళ్లతో పెకళిస్తే తప్ప నంద్యాలకు విత్తనోత్పత్తిలో పూర్వ వైభవం రాదనేది కాదనలేని సత్యం.