ఆంధ్రప్రదేశ్‌

భగ్గుమన్న కొల్లేరు గ్రామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 22 : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలంలోని కొల్లేరులంక గ్రామం ప్రత్తికోళ్లలంక గురువారం అర్ధరాత్రి భగ్గుమంది. వర్గాల మధ్య విభేదాలతో గత కొంతకాలంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఒక వర్గం మరొక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. కత్తులు, కర్రలతో గ్రామంలో అర్ధరాత్రి సమయంలో వీరంగం సృష్టించారు. ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారిని వెంటాడి మరీ దాడులు చేశారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ముంగర కొండలు (58) మృత్యువాత పడ్డాడు. మరో అయిదుగురు గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా మారడంతో ఘంటసాల హరికృష్ణను మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి పంపించారు. మరో నలుగురు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మత్సకార లంక గ్రామమైన పత్తికోళ్లలంకలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వివాదాలు రేగుతూ వచ్చాయి. చేపల చెరువుల ఆదాయం విషయంలో వివాదం తలెత్తడంతో గ్రామం అంతా రెండు వర్గాలుగా విడిపోయింది. గ్రామానికి చెందిన నిధుల గోల్‌మాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ ఉపసర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మిరాజు ఆయన భార్య, గ్రామ సర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మి, వారి అనుచరులు ఒక వర్గంగాను, మిగిలిన గ్రామమంతా మరో వర్గంగాను చీలిపోయారు. దాదాపు సంవత్సరంన్నర కాలంగా గ్రామంలో పోలీసు పికెట్ కూడా కొనసాగుతోంది. పరిస్థితులు ఇలా ఉండగా గురువారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మహాలక్ష్మిరాజు వర్గంపై మరో వర్గం దాడులకు తెగబడింది. దాదాపు 50 మందికి పైగా కర్రలు, కత్తులతో గ్రామంలో కలియతిరుగుతూ దాడులకు దిగారు. దీనిలో భాగంగానే ముంగర కొండలు ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆ తరువాత మిగిలిన వారిపై కూడా ఇళ్లకు వెళ్లి మరీ దాడులు చేశారు. ఇళ్లలో విధ్వంసం సృష్టించారు. చివరకు మహాలక్ష్మిరాజు సోదరుడు హరికృష్ణ లక్ష్యంగా దాడులు మలుపు తిరిగాయి. హరికృష్ణ పక్కనేవున్న ఎస్సీ కాలనీలోకి పరారయ్యారు. దీంతో వీరంతా కాలనీలోకి ప్రవేశించి అక్కడ కూడా వీరంగం సృష్టించారు. ఈ దాడుల్లో ప్రత్యర్ధి వర్గానికి చెందిన వాహనాలను, ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. చివరకు ఈ దాడి ఘటనలో మరో అయిదుగురు గాయపడ్డారు. పరిస్థితి శృతిమించడంతో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. శుక్రవారం ఉదయం గ్రామాన్ని జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్ పరిశీలించారు. ఏలూరు ఆర్డీవో తేజ్ భరత్, ఇతర రెవిన్యూ అధికారులు కూడా గ్రామాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. మరోవైపు ఈ దాడి ఘటన నేపధ్యంలో ఏలూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో ఒక వర్గానికి చెందిన వారిపై హత్య కేసు నమోదైంది.