సబ్ ఫీచర్

ఆడపిల్ల పట్ల ఇంకా అదే ఆలోచనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గుండెలమీద కుంపటి’లా భారంగా అనిపించే ఆడపిల్లను త్వరగా పెళ్ళిచేసి వదిలించుకునే ప్రయత్నాలు చేయటమేగాక... ముందుజాగ్రత్తగా అత్తారింటికి పంపే సందర్భంలో తల్లి ఎన్ని నీతులు చెబుతుందో లెక్కే లేదు. ‘ఒకసారి మెళ్లో పుస్తె పడిందంటే... ఇక మంచైనా, చెడైనా నీకు అత్తారిల్లే గతి-! మొగుడు ఎలాంటి వాడైనా భరించక తప్పదు.’అంటూ ముందరి కాళ్లకు బంధంవేసి పుట్టింటి పరువుప్రతిష్ఠలను కాపాడమని ఇన్‌డైరెక్ట్‌గా ఆదేశాలు జారీచేస్తుంది. సంప్రదాయపు సంకెళ్ళలో కనె్నప్రాయమంతా గడిపి పెరిగిన ఆ ఆడపిల్ల బుర్ర ఊపి పుట్టింటి గడపదాటి అత్తింట అడుగుపెట్టి ఒక జైలునుంచి మరో జైలుకు మారినట్టుగా భావించుకుంటుంది. ఆ విధంగా ఆమె జీవితమంతా ఎదుగూబొదుగూ లేని తనంతో, అసంతృప్తితో, సర్దుబాట్లతో నీరసంగా, రసహీనంగా గడిచిపోతూ ఉంటుంది.

దేశం ఎంత ముందుకు దూసుకెళ్తున్నా, మహిళలు ఎంతగానో ఎదిగి తమ శక్తిసామర్థ్యాలు ఎంతటివో నిరూపించుకుంటున్నా కొంతమంది ఆలోచనా విధానం, మాటలు, చేతలు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే-’!అన్న సామెతగా ఏ మార్పుచేర్పులు లేకుండా అలానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి సాటి ఆడవాళ్ల వెలిబుచ్చే అభిప్రాయాలు, ఇచ్చే సలహాలు ‘వీళ్ళింకా ఎన్నో దశాబ్దాల వెనక ఉన్నారు.’ అనిపించేలా ఉంటున్నాయి. ఆడపిల్లకు ఊహ తెలిసినప్పటినుంచీ, తనను రోజుకు పదిసార్లయినా ‘నువ్వు ఆడపిల్లవు’ ‘నువ్వు ఆడపిల్లవు’అని హెచ్చరిస్తూ, భయపెడుతూ, కించపరుస్తూ ‘అలా ఉండాలి..ఇలా ఉండాలి’అని ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఆడపిల్లలు ఇంటిపట్టునే ఉండాలని’.. పెద్దగా మాట్లాడకూడదని’.. ‘నవ్వకూడదని..’ ‘ఇంటిపని, వంట పని నేర్చుకోవాలని’ హితబోధ చేస్తూ వాళ్ల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తుంటారు. అదే ఇంట్లో మగపిల్లాడు ఉంటే ‘నీకేంరా మగ పిల్లాడివి...!’అని బహిరంగంగానే అంటూ వాడు ఎక్కడికి వెళ్ళినా- ఎంత రాత్రి ఇంటికి వచ్చినా ‘ఇదేంటి?’అని అడగకపోగా ‘అది అతని జన్మహక్కు’ అన్నట్లు గర్వపడతారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే తండ్రి కన్నా తల్లి చెప్పే దైనందిన సూక్తులు, సుభాషితాలు, సామెతలు ఆ అమ్మాయి చెవులు చిల్లులు పడేలా చేస్తాయి. ‘మగపిల్లలతో మాట్లాడకు...!’ బయటికి వెళ్ళినప్పుడు వంచిన తల ఎత్తొద్దు...! ‘ప్రేమలు, గీమలు అంటూ పిచ్చివేషాలు వేసావంటే ఊరుకోను’.. ‘ఆడపిల్ల అనగానే లోకం గుడ్డకాల్చి మీద వేస్తుంది-’ ఒకసారి జీవితం మీద మచ్చ పడిందంటే అది చచ్చినా పోదు...!’ ‘అరిటాకు మీద ముల్లు పడినా- ముల్లుమీద అరిటాకు పడినా చినిగేది ఆకే...!’వంటి మాటలతో ఊదరగొడుతూ ఉంటారు. దాంతో ఆ అమ్మాయి కాస్తంత అమాయకురాలయితే హడలిపోవటం కొంచెం స్వతంత్ర భావాలు కలదైతే విసిగివేసారి పోవటం జరుగుతుంది.
కూతురికి పెళ్లీడు వచ్చీరాగానే పెత్తనమంతా ‘కన్నవాళ్లమైన తమదే’ అన్న భావనతో వరానే్వషణ, వర నిశ్చయం అన్నీ తామే చేసేస్తారు తల్లిదండ్రులు. అమ్మాయి ‘ఎలాంటి భాగస్వామిని కోరుకుంటోందో అడగాలన్న ఆలోచన గానీ.. వరుని ఎంపిక వధువుకు నచ్చిందో లేదో తెలుసుకోవాలన్న స్పృహ గానీ వాళ్ల మనసులో ఏ కోశానా రావు. దాంతో ఈడూ, జోడూ కుదరకపోయినా.. పిల్లవాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు, పెద్దగా చదువుకున్నవాడు కాకపోయినా ‘మగవాడికి అందం ఏంటి?’ ‘మగవాడిగా పుట్టడమే వాడి యోగ్యత’ అన్నట్టు వాని చేత పిల్ల మెడలో మూడుముళ్లూ వేయించేస్తారు. ఇప్పటికీ మేనరికాలు, కుల గోత్రాలు, ఆస్తిపాస్తులు, వంశ వైభోగాలు చూసి ఆడ పిల్లల పెళ్ళిళ్లు జరిపిస్తున్న తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. కన్న తల్లి సంప్రదాయపు ఆంక్షలనుంచి కట్టుకున్నవాడి పురుషాధిక్యతా భావజాలానికి మారిన ఆ ఆడపిల్ల జీవితం ఇంకో బానిస బ్రతుకుకు అలవాటుపడాల్సి ఉంటుంది. భర్త పర్మిషన్ ఇవ్వకపోతే మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించకూడదు.. ఏదో ఒక డిగ్రీ ఉన్నా అత్తమామలు వద్దంటే ఉద్యోగంసద్యోగం లేకుండా ఇంట్లో అంట్లుతోముకుంటూ, పాచి పనులు చేసుకుంటూ కాలం గడపాల్సిందే..! ఆమెకంటూ ఒక జీవితం ఉంటుందనీ.. ఆమెకూ ఇష్టాయిష్టాలు, ఆశలు, ఆశయాలు, తన తెలివితేటలను తాను నిరూపించుకోవాలన్న కాంక్ష ఉంటాయన్న స్పృహే అసలు ఎవరికీ ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తాము బానిస బ్రతుకు బ్రతికి వచ్చిన సాటి ఆడవాళ్లు అయిన అమ్మ, అత్త కూడా ఆమెను బానిసగా బ్రతకమని శాసించటం..! ‘స్ర్తిలు ఎంతగానో ఎదిగారనుకుంటున్న ఈ రోజుల్లోకూడా ఆడవాళ్ల విషయంలో ఇలా జరుగుతోందా-?!’అని అలా ఆశ్చర్యపోకండి. పరిశీలించి చూస్తే మీచుట్టూనే ఇలాంటి కుటుంబాలు.. ఆ కుటుంబాలలో కూపస్థ మండూకాల్లా బతుకుతున్న ఆడవాళ్లు ఎంతోమంది ఇంకా కనిపిస్తారు. స్ర్తిల పట్ల మన పాతకాలపు ఆలోచనా విధానంలో మార్పు మనం ఆశించినంతగా ఏమీ రాలేదనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి-?

- శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు