బిజినెస్

జియో ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలనాత్మక టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 4జి సేవలను ప్రారంభించిన తొలి నెల సెప్టెంబర్‌లో ఏకంగా జియో వినియోగదారులు 16 మిలియన్ల (కోటీ 60 లక్షలు)ను దాటిపోయారు మరి. ప్రపంచంలో ఇంతటి స్థాయిలో వృద్ధిరేటును మరే టెలికామ్ ఆపరేటర్ లేదా స్టార్టప్ అందుకోలేదని ఆదివారం రిలయన్స్ జియో ప్రకటించింది. ఫేస్‌బుక్, వాట్సప్, స్కైప్‌లకూ ఈ స్థాయిలో ఆదరణ ఆరంభంలో లేదంది. ‘జియో వెల్‌కమ్ ఆఫర్‌కు దేశవ్యాప్తంగా లభిస్తున్న విశేషమైన ఆదరణపట్ల మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రతీ భారతీయునికి అంతర్జాల సాధికారతే జియో ముఖ్య ఉద్దేశం.’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ‘మా సేవలను వినియోగదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. వారి అంచనాలకు అనుగుణంగా మేము మా సేవలను నిరంతరం అందిస్తాం.’ అన్నారు. సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వాణిజ్య సేవలు మొదలవగా, డిసెంబర్ 31 వరకు పలు సంస్థల మొబైల్స్ వినియోగదారులకు ఉచిత 4జి సేవలను ప్రకటించింది. తాజాగా విడుదలైన ఐఫోన్ 7, 7 ప్లస్‌తోపాటు 6, 6 ప్లస్, ఎస్‌ఇ వినియోగదారులకైతే వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఉచిత 4జి సేవలను అందిస్తామని జియో స్పష్టం చేసింది. ఇక పేపర్ ద్వారా కాకుండా ఆధార్ సంఖ్య ఆధారిత సిమ్ యాక్టివేషన్‌కు జియో శ్రీకారం చుట్టగా, కేవలం నిమిషాల వ్యవధిలో సిమ్ పనిచేయడం ప్రారంభిస్తోంది. దేశవ్యాప్తంగా 3,100 నగరాలు, పట్టణాలు కేంద్రంగా ఈ సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఇటీవలి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 42వ వార్షిక సాధారణ సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ 100 మిలియన్ల కస్టమర్లు మా లక్ష్యమని, నెలకు 250 కోట్ల గిగాబైట్ డేటా వినియోగం ధ్యేయమని ప్రకటించారు. ఈ క్రమంలో ఆ దిశగా జియో దూసుకెళ్తోందనడానికి తాజా ప్రపంచ రికార్డే నిదర్శనం. ఇక మిగతా టెలికామ్ సంస్థల విషయానికొస్తే సిఒఎఐ ప్రకారం ఈ ఆగస్టు 31 నాటికి 257.5 మిలియన్ల కస్టమర్లతో భారతీ ఎయిర్‌టెల్ ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో వొడాఫోన్ (200 మిలియన్లు), ఐడియా (177 మిలియన్లు), ఎయిర్‌సెల్ (89.7 మిలియన్లు), టెలినార్ (53.2 మిలియన్లు), ఎమ్‌టిఎన్‌ఎల్ (3.6 మిలియన్లు) ఉన్నాయి. బ్రాడ్‌బాండ్ విభాగంలో భారతీ ఎయిర్‌టెల్‌కు (3జి, 4జి) 35 మిలియన్ల కస్టమర్లున్నారు. వొడాఫోన్, ఐడియా కస్టమర్లు 25 మిలియన్లుగా ఉండగా, ఈ స్థాయి కస్టమర్లను అందిపుచ్చుకోవడానికి ఈ సంస్థలకు దాదాపు పదిహేనేళ్లు పట్టడం గమనార్హం. అదే జియో అయితే కేవలం నెల రోజుల్లోనే 16 మిలియన్ల కస్టమర్లను సొంతం చేసుకుంది. ఈ నెలాఖరుకు ఈ సంఖ్య 35 మిలియన్లను తాకుతుందని అంచనా. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం ఎయిర్‌టెల్‌ను జియో అధిగమించినట్లవుతుంది. కాగా, ‘జియో ప్రదర్శన అద్భుతం. చాలా మందికి ఇంటర్నెట్ చేరువైంది. మున్ముందు మరింతగా అంతర్జాల సేవలు విస్తృతం కావడం ఖాయమనిపిస్తోంది.’ అని సిఒఎఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ పిటిఐతో అన్నారు. సెప్టెంబర్ వినియోగదారుల జాబితా ఈ నెల 15 వరకు రావచ్చన్నారు. కేవలం 4జి సేవలనే అందిస్తున్న జియో రాకతో దేశీయ టెలికామ్ రంగంలో పెను ప్రకంపనలే చోటుచేసుకున్నా యి. అప్పటిదాకా కొందరికే పరిమితమైన మొబైల్ ఇంటర్నెట్.. అందరికీ చేరువైంది. అంతేగాక ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి దిగ్గజాలు తమ టారీఫ్ రేట్లను భారీగా తగ్గించడానికి కూడా జియో కారణమైంది. దీనివల్ల ఆయా సంస్థల ఆదాయం గణనీయంగా పడిపోగా, వినియోగదారులకు భారీగా లాభం వచ్చినట్లైంది. అయతే ఎయర్‌టెల్, వొడాఫోన్, ఐడియా నెట్‌వర్క్‌లకు జియో నుంచి చేసిన కాల్స్ 12 కోట్లకుపైగా విఫల మయ్యాయని సెప్టెంబర్ 23న జియో ఆరోపించింది. ఏదిఏమైనా ఇప్పుడు భారతీయ టెలికామ్ రంగంలో జియో జోష్ నడుస్తోంది.