బిజినెస్

మామిడి తాండ్రపై సమగ్ర అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 15: మామిడి తాండ్ర తయారీదారులను ప్రోత్సహించి, పెద్ద ఎత్తున మామిడి తాండ్రను ఉత్పత్తి చేసి, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మామిడి తాండ్ర తయారీలో ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో అగ్ర స్థానంలో ఉంది. జిల్లాలో పలు గ్రామాల్లో మామిడి తాండ్ర కుటీర పరిశ్రమలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు ఏటా పెద్ద ఎత్తున మామిడి తాండ్ర తరలిపోతోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులకు (తయారీదారులు) అవసరమైన మెళకువలను నేర్పించడం, సాంకేతిక సహకారం అందించడంతోపాటు మార్కెటింగ్ సౌకర్యాలను పెద్ద ఎత్తున విస్తరించి, నాణ్యమైన మామిడి తాండ్ర ఉత్పత్తి జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సమగ్ర అధ్యయనానికి కన్సల్టెన్సీ ఏజన్సీని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో సుమారు 14 గ్రామాల్లో సాధారణంగా వేసవి సీజన్‌లో మామిడి తాండ్ర తయారవుతోంది. ఏటా 4,200 టన్నుల మేర తాండ్ర ఉత్పత్తి జరుగుతోంది. ముఖ్యంగా కాకినాడ సమీపంలో సర్పవరం, పండూరు, తొండం గి, కోరుకొండ, ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా మామిడి తాండ్ర ఉత్పత్తి అవుతోంది. అయితే సాంకేతికపరమైన అంశాలను జత చేయడం ద్వారా వీరికి మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది. నాణ్యతా ప్రమాణాల పెంపునకు సమగ్ర అధ్యయనం అవసరమని భావించిన అధికారులు.. ఇందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఓ ఏజన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఉత్పత్తిదారులకు అవసరమైన మెళకువలను నేర్పించడంతోపాటు సోలార్ డ్రైయర్లను వినియోగించడం ద్వారా మామిడి తాండ్ర ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు. తాండ్ర తయారీపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మెరుగైన ఉపాధి కల్పనకు అవసరమైన సలహా, సూచనలను కన్సల్టెన్సీ ఏజన్సీ అందిస్తుందని పేర్కొంటున్నారు. ఈ జిల్లాలో వినూత్న కార్యక్రమాల అమలుకోసం విడుదల చేసిన నిధుల నుండి సదరు ఏజన్సీకి ఫీజు చెల్లించి, మామిడి తాండ్ర ఉత్పత్తిపై సమగ్ర అధ్యయనం చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పారు. మామిడి తాండ్రపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మామిడి తాండ్ర తయారీ దృశ్యం