బిజినెస్

ఇ-ప్రగతితో.. ఇంటింటికీ రవాణా శాఖ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 17: రాష్ట్రంలో వాహనదారులు ఇంటి వద్ద నుంచే రవాణా శాఖ సేవలు పొందేలా ఇ-ప్రగతిని అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. సోమవారం ఒంగోలులోని ఉడ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న తిరుమల ఆటోమోటివ్ షోరూంలో ఇ-ప్రగతి, ప్రజల ముంగిట రవాణా శాఖ ఆన్‌లైన్ సేవలు, డీలర్ల వద్ద వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రవాణా శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టామన్నారు. దేశంలోని రవాణా శాఖపై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ, బెంగళూరు, హిమాచల్‌ప్రదేశ్ ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాంకేతికను వినియోగించి రవాణా శాఖలో పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు సులభతరంగా ఇంటి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ లైసెన్స్‌లు పొందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారన్నారు. కాగా, రాష్ట్రంలో వాహనాలను, డ్రైవర్లను ఆధార్‌తో అనుసంధానం చేయటం 90 శాతం పూర్తయినట్లు తెలిపారు. దీనివల్ల వాహన ప్రమాదాలు గుర్తించడం, దొంగతనాలకు గురైన వాహనాలను కనుగొనడం సులభతరం అవుతుందన్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు, దళారి వ్యవస్థను తగ్గించేందుకు ప్రభుత్వం ఇ-ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రవాణా శాఖలో 83 రకాల సేవలు ఆన్‌లైన్ ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. మొదటగా ముఖ్యమంత్రి ఇ-ప్రగతి సేవలను విశాఖపట్నంలో ప్రారంభించారని గుర్తుచేశారు. రెండవ విడతగా విజయవాడలో తాను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఇ-ప్రగతి రవాణా సేవలను అన్‌లైన్‌లో ఒంగోలులో ప్రారంభించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ 29 రాష్ట్రాల్లోనే అగ్రగామిగా ఉందని, రాబోయే రోజుల్లో రవాణా శాఖను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇ-ప్రగతి సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసి మంత్రి చేతుల మీదుగా పత్రాలను అందజేశారు.

ఆన్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని
సోమవారం ఒంగోలులో ప్రారంభిస్తున్న మంత్రి శిద్దా