బిజినెస్

వృద్ధిపథంలో పౌల్ట్రీ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: పౌల్ట్రీ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. గుడ్ల ఉత్పత్తిలో పౌల్ట్రీ పరిశ్రమలు అద్భుతమైన గణాంకాలు నమోదు చేస్తున్నాయి. గిట్టుబాటు ధర విషయంలో అప్పుడప్పుడూ హెచ్చు తగ్గులున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా గుడ్ల ఉత్పత్తిలో మనవాళ్లు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటున్నారు. కొనే్నళ్లుగా గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంటే తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ తరువాతి స్థానాల్లో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఏపి స్థానం చెక్కు చెదరకపోయినా రెండో స్థానానికి మాత్రం పోటీ ఎక్కువైంది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తిలో నువ్వా, నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. దేశీయ అవసరాలకే కాకుండా ఎగుమతుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో 70 శాతానికిపైగా వృద్ధి నమోదవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2014లో 1,300 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగితే 2015లో 1,400 కోట్ల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 1,700 కోట్ల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా గుడ్లు ఉత్పత్తి చేస్తున్న జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలు అగ్ర స్థానంలో ఉంటే కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమలే 80 శాతానికిపైగా గుడ్ల ఉత్పత్తి సాధిస్తున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గుడ్ల విలువ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలుగా ఉంది. వచ్చే మూడేళ్లలో దీని విలువ 10 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదురైనా కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులతో లబ్ధి పొందుతున్నారు రైతులు. అలాగే కోళ్లు, పాడి పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రెండంకెల వృద్ధిని సాకారం చేసుకోవాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రం ఇస్తున్న నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా పౌల్ట్రీ పరిశ్రమపై భారీగానే నిధులు ఖర్చు చేస్తోంది. ఏడాదికి వంద కోట్ల రూపాయల మేరకు పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం వినియోగిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ నిధులను మరింత పెంచబోతోంది. కోళ్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే దాణాకు పన్ను రాయితీ ఇవ్వడం, వ్యవసాయ రంగం మాదిరిగానే పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలోనే ఈ అంశాలపై సానుకూల నిర్ణయం ప్రకటించబోతోంది.
గుడ్డు శాకాహారమా లేక మాంసాహారమా అన్న చర్చను పక్కన పెడితే చక్కటి పోషకాలున్న గుడ్డును అందరూ తినడం మంచిదేనన్న అభిప్రాయమైతే ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ గుడ్డు తినడం వల్ల మేలే ఎక్కువగా జరుగుతుందని, చాలావరకు జబ్బుల బారిన పడకుండా ఉంటామని డాక్టర్ల అభిప్రాయం. ప్రతి మనిషి ఏడాదికి 180 గుడ్లు తినాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచిస్తోంది. అంటే రెండు రోజులకో గుడ్డు తినాలన్నమాట. వాస్తవానికి మన రాష్ట్రంలో సగటు వినియోగం 60 గుడ్లు మాత్రమే. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. వారానికి ఒక గుడ్డు కూడా తినని పరిస్థితి కన్పిస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని, రోజుకో గుడ్డు తినేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.