బిజినెస్

27 లక్షల రూపే కార్డుల జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 21: రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే పాత పెద్దనోట్ల రద్దు, కొత్తనోట్ల కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వేలల్లో ఈ-పోస్ మిషన్లు సరఫరా చేస్తుండటం సత్ఫలితాలిస్తోంది. దీంతో లక్షల్లో రూపే కార్డులు పంపిణీ చేస్తున్నారు. రూపే కార్డుల జారీ కోసం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలిస్తోంది. 1,000, 500 నోట్ల రద్దు నాటి నుంచి అన్ని ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగిపోయాయి. నోట్ల డిమాండ్‌తోపాటు ప్రజల ఇబ్బందులు, విపక్షాల ఆరోపణలు దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ వ్యవహాలన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిజర్వు బ్యాంక్ అధికారులతో స్వయంగా మాట్లాడి కొత్త నోట్లు రాష్ట్రానికి తెప్పించారు. అలాగే ఈ-పోస్ మిషన్లు, రూపే కార్డుల పంపిణీ గురించి తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రజలు, ముఖ్యంగా గ్రామీణులు ఇబ్బందులు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 27,41,244 రూపే కార్డులు జారీ చేశారు. ఇవి ఎటిఎం కార్డులు లాంటివే. అయితే ఇవి వాటికంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఇటు ఎటిఎంలలోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోని సిఎస్సీ (కస్టమర్ సర్వీస్ పాయింట్), బ్యాంకు మిత్రల వద్ద ఉండే మైక్రో మిషన్లలో కూడా ఉపయోగించవచ్చు. ప్రధాన మంత్రి జన్‌ధన్ ఖాతా ప్రారంభించిన వారందరికీ రూపే కార్డులు ఇస్తున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 4,49,587 కార్డులు జారీ చేశారు. 4,01,309 కార్డుల జారీతో కృష్ణాజిల్లా ఆ తరువాత స్థానంలో ఉంది. అనంతపురం జిల్లాలో 2,17,882 కార్డులు, చిత్తూరు జిల్లాలో 1,34,987, తూర్పు గోదావరి జిల్లాలో 1,82,511, గుంటూరు జిల్లాలో 1,87,298, కడప జిల్లాలో 1,85,500, కర్నూలు జిల్లాలో 1,78,877, ప్రకాశంలో 2,05,688, నెల్లూరు జిల్లాలో 1,41,475, శ్రీకాకుళం జిల్లాలో 1,60,964, విశాఖపట్నం జిల్లాలో 1,45,150, పశ్చిమగోదావరి జిల్లాలో 1,50,016 కార్డులు జారీ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వస్తున్న విమర్శలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని గ్రామీణులకు క్యాష్‌లెస్ లావాదేవీల్లో శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజీఏ) సిబ్బంది, విద్యార్థులు వారికి ఆ విధానం నేర్పిస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 84,47,960 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేశారు. అయతే 80,10,722 మంది మాత్రమే చురుకుగా పనుల్లో పాల్గొంటున్నారు. వారిలో 33,98,046 మందికి క్యాష్‌లెస్ లావాదేవీల్లో శిక్షణ ఇచ్చినట్లు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు మేనేజర్ వెల్లడించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 6,40,000 మందికి శిక్షణ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,75,923 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 3,47,921 మందికి, విజయనగరం జిల్లాలో 3,46,470 మందికి శిక్షణ ఇచ్చారు. మిగిలిన వాటిలో అనంతపురం జిల్లాలో 2,57,864 మందికి, చిత్తూరు జిల్లాలో 2,62,230 మందికి, గుంటూరు జిల్లాలో 74,560మందికి, కడప జిల్లాలో 1,80,982 మందికి, కృష్ణా జిల్లాలో 2,87,820 మందికి, కర్నూలు జిల్లాలో 1,78,877 మందికి, ప్రకాశం జిల్లాలో 4,753 మందికి, నెల్లూరు జిల్లాలో 2,18,341 మందికి, శ్రీకాకుళం జిల్లాలో 2,22,305 మందికిచ్చారు. కాగా, నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని గ్రామాల్లో ఈ-పోస్ మిషన్లు, సిఎస్సీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల రూపే కార్డులను ఉపయోగించేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 13,104 గ్రామాలున్నాయి. వీటిలో ఆరు వందల గ్రామాల్లో మాత్రమే నెట్ కనెక్టివిటీ లేదు. అటువంటి గ్రామాల్లో సిఎస్సీ, బ్యాంకు మిత్ర సెంటర్ల ద్వారా ఆధార్ బయోమీటర్, ఐరిస్‌లు సరిచూసుకుని క్యాష్‌లెస్ లావాదేవీలు జరుపుతున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో బ్యాంకు సేవలు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ బ్రాంచ్‌లు లేని 5,291 గ్రామ పంచాయతీల్లో బ్యాంక్ మిత్రలు సేవలందిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా బ్యాంక్ మిత్ర సేవలు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఖాతాలను తెరుస్తున్నారు.

అమ్మకాల ఒత్తిడిలో
మదుపరులు
కొనసాగిన వరుస నష్టాలు
సెనె్సక్స్ 66, నిఫ్టీ 21 పాయింట్లు పతనం
ముంబయి, డిసెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. గత ఐదు రోజులుగా లాభాలను ఎరుగని సూచీలు.. ఆరో రోజూ అదే బాటలో నడిచాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 65.60 పాయింట్లు క్షీణించి 26,242.38 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 21.10 పాయింట్లు కోల్పోయి 8,061.30 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు 0.95 శాతం నుంచి 0.40 శాతం మేర నష్టపోయాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలక సూచీల విషయానికొస్తే జపాన్ సూచీ పతనమైంది. 0.26 శాతం క్షీణించింది. మరోవైపు హాంకాంగ్, చైనా సూచీలు మాత్రం లాభపడ్డాయి. అయతే ఐరోపా మార్కెట్లలో మాత్రం ప్రధాన సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.

ఐదు విదేశీ బ్యాంకులపై
ఆర్‌బిఐ జరిమానా
ముంబయి, డిసెంబర్ 21: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. బుధవారం ఐదు విదేశీ బ్యాంకులపై జరిమానా విధించింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం 1999 (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకుగాను జర్మనీకి చెందిన డ్యూషే బ్యాంక్, అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్, జపాన్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ టోక్యో మిట్సుబిషి, బ్రిటన్‌కు చెందిన రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్‌లాండ్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లకు స్వల్ప మొత్తంలో జరిమానాలు వేసింది. వీటిలో డ్యూషే బ్యాంక్‌పై 20,000 రూపాయల జరిమానా పడగా, మిగతా నాలుగు బ్యాంకులపై 10,000 రూపాయల చొప్పున జరిమానా పడింది.
ధరలు పెంచుతున్న బజాజ్ ఆటో
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. తమ వాహనాల ధరలను పెంచుతోంది. జనవరి నుంచి బైక్ ధరలు 700 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు పెరుగుతాయని బుధవారం తెలిపింది. భారమైన ఉత్పాదక వ్యయంతో ధరలు పెంచాల్సి వస్తోందని వివరించింది. కాగా, ఇప్పటికే పలు దేశ, విదేశీ కార్ల తయారీ సంస్థలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించినది తెలిసిందే.