బిజినెస్

పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇందూరు ధాన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 24: పరిస్థితులు అనుకూలించి రబీ సీజన్‌లో నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉత్పత్తి అయిన ధాన్యం.. ప్రస్తుతం సరిహద్దులు దాటుతూ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ఈ పరిణామం స్థానిక రైస్‌మిల్లర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో ఉత్పత్తి అయిన పంటకు అనుగుణంగా ప్రభుత్వం విధించే లెవీ లక్ష్యానికి ఎక్కడ విఘాతం ఏర్పడుతుందోనని మదనపడుతున్నారు. ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి ప్రధాన జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నీటి నిల్వలను సంతరించుకోవడంతో రబీలో రైతులు ఖరీఫ్‌తో పోలిస్తే మూడింతలు ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. దీంతో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు చేతికందుతాయని ఆశిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో మరో 2 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇప్పటికే యాభై శాతానికిపైగా కోతలు పూర్తయి, ధాన్యం నిల్వలు క్రమేణా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే దాదాపు 6 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవనుండగా, అందులో 75 శాతం లెక్కిస్తూ స్థానిక మిల్లర్లకు 4 లక్షల టన్నుల బియ్యం లెవీగా అందించాలని లక్ష్యంగా కేటాయించారు. అయితే ప్రస్తుతం మిల్లింగ్ జరపకముందే ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ధాన్యం ఉత్పత్తులు పెద్దఎత్తున తరలిపోతుండడం రైస్‌మిల్లర్ల ఆందోళనకు కారణమవుతోంది. ప్రతీసారి ఖరీఫ్, రబీ సీజన్‌లలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ వంటి పొరుగు జిల్లాల నుండి వ్యాపారులు నిజామాబాద్‌కు తరలివచ్చి క్రయవిక్రయాలు జరపడం షరామామూలే అయినప్పటికీ, ఈసారి ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుండి కూడా వ్యాపారులు ఇందూరుకు చేరుకుని ధాన్యం సేకరణలో నిమగ్నమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలోనే ఖరీఫ్ పంట చేతికందుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇతర ప్రాంతాల వ్యాపారులు ఇందూర్‌పై కనే్నశారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ధాన్యం తరలించుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడం.. వారికి మరింత వెసులుబాటు కల్పిస్తోంది. గ్రామాల్లో మోతుబరి రైతులు, చిన్నాచితక వ్యాపారులను ఏజెంట్లుగా పెట్టుకుని రైతుల వద్ద నుండి పెద్దఎత్తున ధాన్యం సేకరిస్తున్నారు. యంత్రాల ద్వారా కోసిన పచ్చి ధాన్యానికే క్వింటాలుకు 1,300 రూపాయల వరకు ధర చెల్లిస్తూ లారీలలో తమ ప్రాంతాలకు ధాన్యం నిల్వలను చేరవేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి అనునిత్యం సుమారు 100 లారీలలో ధాన్యం పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇతర జిల్లాల వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లిస్తుండడం, ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా పంట కళ్లాల్లోనే విక్రయాల పర్వం పూర్తవుతుండడంతో గ్రామీణ ప్రాంత రైతులు కూడా మద్దతు ధర రాకపోయినా, తక్కువ ధరకే వ్యాపారులకు తమ పంటను కట్టబెడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు 1,510 రూపాయలు, సాధారణ రకానికి 1,470 రూపాయల ధర అందించాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 240 వరకు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే దాదాపు 120 కేంద్రాలను నెలకొల్పారు. మరోవైపు రైస్‌మిల్లర్లు, వ్యాపారులు సైతం కనీస మద్దతు ధర ప్రకారమే కొనుగోళ్లు జరపాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామంటూ ఆంక్షలు విధించారు. దీంతో పూర్తిస్థాయి మద్దతు ధర అందించేందుకు రైస్‌మిల్లర్లు సైతం సంసిద్ధత చూపుతున్నప్పటికీ, నాణ్యతా ప్రమాణాల పేరిట సవాలక్ష నిబంధనలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనతో గ్రామీణ ప్రాంత రైతులు నేరుగా తమ వద్దకే వస్తున్న ఇతర ప్రాంతాల ఏజెంట్లకు పంట విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.