బిజినెస్

నూతన శిఖరాలకు..నూతన శిఖరాలకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాత్కాలిక మెరుపులు చూసి ఏ సంస్థలోపడితే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా, నమ్మదగినవి అనిపించిన సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలి.
- బిఎస్‌ఇ సిఇఒ ఆశిష్ చౌహాన్

ఆల్‌టైమ్ హైకి చేరిన స్టాక్ మార్కెట్లు
గత రికార్డులను చెరిపేసిన సెనె్సక్స్
తొలిసారిగా 30 వేలపైన ముగింపు
నిఫ్టీ సైతం సరికొత్త స్థాయికి చేరిక
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మాక్రాన్ ముందంజతో జోష్
21 నెలల గరిష్ఠానికి రూపాయి విలువ

ముంబయి, ఏప్రిల్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నూతన శిఖరాలను అధిరోహించాయి. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను ఆవిష్కరించాయి. మదుపరుల పెట్టుబడుల జోరుకు బుల్ పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ రెండూ కూడా ఆల్‌టైమ్ హైలను తాకాయి. సెనె్సక్స్ తొలిసారిగా 30,000 మార్కును దాటింది.
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో సెంట్రిస్ట్ ఇమ్యాన్యుయెల్ మాక్రాన్ తొలి రౌండ్‌లో విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా మదుపరులను ఉత్సాహపరిచింది. మార్కెట్ ఫ్రెండ్లీగా ముద్రపడిన మాక్రాన్ గెలుపుతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లూ అదే బాటలో నడిచాయి. ఫలితంగా సెనె్సక్స్ 190.11 పాయింట్లు పుంజుకోగా, మొదటిసారిగా 30,133.35 వద్ద స్థిరపడింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 29,974.24 పాయింట్ల అత్యధిక రికార్డు కనుమరుగైపోయింది. ఒక దశలోనైతే 30,167.09 పాయింట్లను తాకింది.
అంతకుముందు ఇంట్రా-డే హై 30,024.74 పాయింట్లు కావడంతో ఇప్పుడు సరికొత్త ఇంట్రా-డే హై నెలకొన్నట్లైంది. అలాగే నిఫ్టీ కూడా 45.25 పాయింట్లు అందుకుని 9,351.85 వద్ద నిలిచింది. ఈ క్రమంలో అప్పటిదాకా ఉన్న 9,306.60 పాయింట్ల ఆల్‌టైమ్ హై రికార్డు చెరిగిపోయింది. మంగళవారమే ఈ రికార్డు నమోదవగా, మదుపరుల కొనుగోళ్ల జోష్‌తో 24 గంటల్లోనే అది తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఒక దశలో 9,367 పాయింట్లను చేరగా, గత ఇంట్రా-డే రికార్డు 9,309.20 పాయింట్ల రికార్డూ కనిపించకుండాపోయింది.
నిజానికి ఉదయం ఆరంభం నుంచే సూచీలు దూకుడు మీదున్నాయి. ట్రేడింగ్ ముగిసేదాకా అదే తీరును ప్రదర్శించాయి. ఇక ఈ వారంలో గడచిన మూడు రోజుల్లో సెనె్సక్స్ 768.05 పాయింట్లు ఎగబాకితే, నిఫ్టీ 232.45 పాయింట్లు ఎగిసింది. డాలర్‌తో పోల్చితే బలపడుతున్న రూపాయి మారకం విలువ కూడా మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి దోహదపడుతోంది. బుధవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో మరో 15 పైసలు పెరిగి 21 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 64.11 వద్ద నిలిచింది.
2015 ఆగస్టు 10 తర్వాత రూపాయికిదే అత్యంత గరిష్ఠ స్థాయి. నాడు 63.87 వద్ద ఉంది. ఇక గత మూడు రోజుల్లో రూపాయి విలువ 50 పైసలు పుంజుకుంది. ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ రంగాల షేర్లు 2.04 శాతం నుంచి 0.47 శాతం వరకు పెరిగాయి. అయితే రియల్టీ, ఎనర్జీ, ఐటి, చమురు, గ్యాస్, టెక్నాలజీ, పవర్, యుటిలిటిస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 2.95 శాతం నుంచి 0.58 శాతం మేర పడిపోయింది.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో కీలకమైన జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలో మాత్రం ప్రధాన సూచీల్లో ఫ్రాన్స్ లాభపడగా, బ్రిటన్, జర్మనీలు నష్టపోయాయి.
ఆచితూచి వ్యవహరించండి
మరోవైపు స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హైకి చేరిన నేపథ్యంలో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, తాత్కాలిక మెరుపులు చూసి ఏ సంస్థలోపడితే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా, నమ్మదగినవి అనిపించిన సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సిఇఒ ఆశిష్ చౌహాన్ సూచించారు.
గత మూడు రోజులుగా సూచీలు భారీ లాభాలను అందుకుంటున్నది తెలిసిందే. దీంతో ఈ సమయంలో ఆకర్షణీయ లాభాలను పొందుతున్న సంస్థలను చూసి మోసపోకూడదని, వాటి సామర్థ్యాలను అంచనావేసి పెట్టుబడులు పెట్టాలని హితవు పలికారు. చారిత్రాత్మక స్థాయకి సూచీ చేరుకున్న తర్వాత చౌహాన్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. గతకొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్నా యన్నారు. నూతన మదుపరుల రాకకు ఇది దోహదపడగలదన్నారు.

తెలంగాణ రియల్ ఎస్టేట్
రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాపై కసరత్తు

హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు రూపొందించాల్సిందిగా తెలంగాణ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌తోపాటు సంబంధిత అధికారులతో బుధవారం మంత్రి కెటిఆర్ సమావేశమై రియల్ ఎస్టేట్ బిల్లుపై చర్చించారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నియామావళిపై అధ్యయనం చేసి రాష్ట్ర బిల్లు రూపొందించాలని మంత్రి సూచించారు. నిర్మాణ రంగంలో ప్రభుత్వం.. కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే విధంగా నియామావళి ఉండాలన్నారు. ఈ రంగం ద్వారా అత్యధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే మంచి పురోగతిలో ఉన్న నగరమని మంత్రి అన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో హైదరాబాద్ నగరంలో 8,704 భవనాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి రూ. 526.64 కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి వివరించారు. అనుమతి పొందిన వాటిలో 26 నివాస భవనాలు, 21 వాణిజ్య సముదాయాలు, 5 ఐటీ కార్యాలయాలు, 3 మల్టిఫ్లెక్స్ కమ్ మాల్స్ ఉన్నాయన్నారు. మొత్తంగా 23 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ బిల్లు అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు మ్యాండెట్ కాబోతుందన్నారు. బిల్డర్లు తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి రెగ్యులేషన్ అథారిటీలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న
హైదరాబాద్ ఐటి కారిడార్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపనలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 26: దేశంలోనే అతివేగంగా హైదరాబాద్ నగరంలో ఐటి కారిడార్ అభివృద్ధి చెందుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. సుమారు రూ. 187.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి పరంగానేగాక, ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ నగరం అనుకూలమని నేడు ప్రపంచం మొత్తం భావిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో ఐటి ఆధారిత సంస్థలు మరిన్ని వచ్చే అవకాశమున్నందున హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్, దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీకి అనుకూలంగా వౌలిక వసతులను మెరుగుపర్చుకుంటూ, నగరం ఎదగాలన్నారు. అందుకే ఎస్‌ఆర్‌డిపి వ్యూహాత్మక కార్యచరణను సిఎం ఆదేశాల మేరకు సిద్దం చేసినట్లు తెలిపారు. ఎల్బీనగర్, పాతబస్తీ, మాదాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొదటి దశగా రూ. 2,600 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కెబిఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన ఎస్‌ఆర్‌డిపి పనులు ఎన్‌జిటి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయన్నారు. కొండలు, కోనలు, పచ్చటి వాతావరణం మధ్యనున్న ఈ దుర్గం చెరువుపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఐటి ఆధారిత సంస్థల అభివృద్ధికి ఈ వంతెన దోహదపడుతుందని మంత్రి ఆకాంక్షించారు. సుమారు రూ. 184 కోట్ల వ్యయంతో 365 మీటర్ల పొడువున నిర్మించనున్న ఈ బ్రిడ్జిని నిర్ణీత 18 నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి చెరువు వైపు వస్తున్న వాహనదారులు నిరంతరం ఎదుర్కొనే ట్రాఫిక్ జాం సమస్యకు ఈ బ్రిడ్జితో శాశ్వతంగా పరిష్కారం సమకూరుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వైపు వచ్చే వాహనాలు రద్దీని తట్టుకోవాలంటే 12 లేన్ల రహదారి అవసరమంటూ ట్రాఫిక్ స్టడీలు తేల్చాయని, ప్రస్తుతం మనకు 8 లేన్ల రహదారి మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 12 లేన్లకు పెంచుకోవల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

దుర్గం చెరువుపై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేస్తున్న
మంత్రి కెటిఆర్ తదితరులు