బిజినెస్

ఫోర్బ్స్ గ్లోబల్ గేమ్ చేంజర్స్ జాబితాలో ముకేశ్ అంబానీకి అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మే 17: ఫోర్బ్స్ ‘గ్లోబల్ గేమ్ చేంజర్స్’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. తమ పరిశ్రమల విస్తరణతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తున్న, ప్రభావితం చేసిన వ్యాపార, పారిశ్రామికవేత్తలతో ఈ జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇది ఫోర్బ్స్ తయారుచేసిన రెండో వార్షిక జాబితా అవగా, ఈసారి 25 మందితో దీన్ని తీర్చిదిద్దారు. కాగా, బహుళ వ్యాపార, పారిశ్రామికవేత్త అయిన ముకేశ్ అంబానీకి చమురు, గ్యాస్ రంగాలే అత్యంత కీలకం. అయితే టెలికామ్ రంగంలోకి అడుగిడి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరిట నిరుడు సెప్టెంబర్‌లో 4జి సేవలను ఆరంభించగా, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తదితర అగ్రశ్రేణి దేశీయ టెలికామ్ సంస్థలకు గట్టిపోటీనిచ్చారు. అనతికాలంలోనే అశేష సంఖ్యలో కస్టమర్లను అందుకున్న జియో.. ఇంటర్నెట్ సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. తొలుత ఉచితంగా అందించిన జియో.. ఆ తర్వాత పలు ఆఫర్లతోనూ అత్యంత చౌకగా 4జి సేవలను మార్చేసింది. ఈ క్రమంలోనే ఆరు నెలల్లో 100 మిలియన్ల కస్టమర్లను జియో పొందిందంటూ ఉచిత సేవలు, చౌక ధరలను ఫోర్బ్స్ కొనియాడింది.

ఫోర్బ్స్
టాప్-10
గ్లోబల్ గేమ్ చేంజర్స్

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, మే 17: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం కూడా బుల్ రన్ కొనసాగింది. వరుసగా మూడు రోజులపాటు సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ క్రమంలో రోజుకో రికార్డు స్థాయిని అందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లోనూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 76.17 పాయింట్లు పుంజుకుని 30,658.77 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.50 పాయింట్లు ఎగిసి 9,525.75 వద్ద నిలిచింది. తద్వారా మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త స్థాయిలను నెలకొల్పాయి. ఎఫ్‌బిఐ చీఫ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసినప్పటికీ, విదేశీ పెట్టుబడుల మధ్య అది భారతీయ మార్కెట్లను మాత్రం తాకలేకపోయింది. ఇక బుధవారం ఒకానొక దశలో సెనె్సక్స్ 30,692.45 పాయింట్లను, నిఫ్టీ 9,532.60 పాయింట్లను తాకాయి. దీంతో ఆల్‌టైమ్ ఇంట్రా-డే రికార్డులు నమోదయ్యాయి. మెటల్, టెలికామ్, ఆటో, ఇండస్ట్రీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు లాభపడ్డాయి. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, ఎనర్జీ, ఐటి రంగాల షేర్లు నష్టపోయాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, చైనా సూచీలు పడిపోగా, ఐరోపా మార్కెట్లలోనూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు క్షీణించాయి.

23 నుంచి పేటిఎమ్
పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ, మే 17: ఈ నెల 23 నుంచి పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది పేటిఎమ్. నిజానికి నిరుడే ఈ సేవలు మొదలు కావాల్సి ఉంది. అయితే 2015లో సూత్రప్రాయ ఆమోదం తెలిపిన ఆర్‌బిఐ.. తాజాగా తుది ఆమోదం తెలియజేసింది. దీంతో ఈ నెల 23 నుంచి పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తామని ఓ ప్రకటనలో పేటిఎమ్ స్పష్టం చేసింది. కాగా, పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లో పేటిఎమ్ ప్రధాన వాటాదారైన వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మెజారిటీ వాటా ఉంటుంది.
రోజూ రెండు లక్షల టన్నుల
బొగ్గు ఉత్పత్తి కావాల్సిందే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 17: ప్రతి రోజు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సిందేనని సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు దిశా నిర్దేశం చేశారు. నెలవారీ, రోజువారీ లక్ష్యాలను విధిగా సాధించాలని తెలిపారు. బుధవారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో జనరల్ మేనేజర్లతో సిఎండి సమీక్షించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించారని, 2017-18లో కూడా 66.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. డైరక్టర్లు నిరంతరాయంగా ఉత్పత్తి-ఉత్పాదకతలను స్వయం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
భారీ యంత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ పని గంటలు పెంచుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు. వర్షాకాలంలో కూడా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. విద్యుదుత్పత్తి సంస్థలకు అవసరమైన బొగ్గును నిరంతరాయంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే ఏ నెల లక్ష్యాన్ని ఆ నెలలోనే సాధిస్తే చివరి నాటికి సునాయాసంగా వార్షిక లక్ష్యాలను సాధించగలుగుతామని వివరించారు. లక్ష్య సాధనతోపాటు రక్షణకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

నిమ్మ రైతుకూ కష్టకాలమే
గిట్టుబాటు ధరలేక రోడ్లపై పారబోస్తున్న వైనం

ఏలూరు, మే 17: పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మ రైతులకు కష్టకాలం ఎదురయ్యింది. ఏలూరు పరిసర ప్రాంతాల్లోని రైతులు నిమ్మకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వాటిని అమ్ముకునేకంటే పారవేయడమే మెరుగని రోడ్లపక్కన గుట్టలు గుట్టలుగా పోస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. కోత కూలీ, కిరాయి కూడా రాకపోవడంతో నిమ్మకాయలను యార్డుకు తీసుకువెళ్లినా ఫలితం లేదంటూ రోడ్డుపక్కన కాల్వల్లో పారబోసేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక తాము అల్లాడుతుంటే ఆదుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు. నిమ్మకు కూడా మద్దతు ధర వర్తింపచేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగులు, రైతుల కృషితోనే
హెరిటేజ్ అభివృద్ధి: బ్రాహ్మణి
నార్కట్‌పల్లి, మే 17: రానున్న ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధించేందుకు నూతన ప్రణాళికలను రూపొందిస్తున్నామని హెరిటేజ్ సంస్థ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. 2020 నాటికి 6 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని హెరిటేజ్ సంస్థ 25 వసంతాల వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ధనార్జనే ధ్యేయంగా కాకుండా నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంతోపాటు రైతాంగాన్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో హెరిటేజ్ సంస్థ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. సంస్థకు రైతులు, ఉద్యోగులే ప్రధాన వనరులన్నారు. నార్కట్‌పల్లి హెరిటేజ్.. హైదరాబాద్-విజయవాడ కేంద్రాలకు చక్కటి సహకారాన్ని అందిస్తూ ప్రగతి సాధిస్తోందన్నారు.