బిజినెస్

ప్రపంచ భవిష్యత్తునే మార్చేయగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, మే 22: భారత్-ఆఫ్రికా భాగస్వామ్య విధానం.. ప్రపంచ భవిష్యత్తునే మార్చేయగలదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. సోమవారం ఇక్కడ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ (ఎఎఫ్‌డిబి) వార్షిక సమావేశం ప్రారంభ సెషన్‌లో జైట్లీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగుతోందన్నారు. ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ పెట్టుకున్న ‘హై 5’ అజెండా.. భారత విధానం వంటిదేనన్నారు.
భారత్ అభివృద్ధిపథంలో వెళ్తే.. ఆఫ్రికా కూడా అదే దారిలో పయనిస్తుందన్నారు. కాగా, నిర్దేశిత ‘హై 5’లో భాగంగా వ్యవసాయం, ఇంధనం, పారిశ్రామికీకరణ, ప్రాంతీయ అనుసంధానం, మెరుగైన జీవన ప్రమాణాలపై ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దృష్టి పెట్టనుంది. తద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధి అవకాశాలను పెంపొందించాలని భావిస్తోంది. ఇదిలావుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ గ్రూప్ ఐదు రోజుల వార్షిక సమావేశాన్ని ప్రారంభించనున్నారు. తొలిసారిగా ఈ సమావేశాలు భారత్‌లో జరుగుతున్నాయి. ఆఫ్రికా దేశాలతో మరింత నిర్మాణాత్మక ధోరణిలో భాగంగా భారత్‌కు 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు-2015లో ప్రకటించారు. ఇరు దేశాల మైత్రికి ఇది అద్దం పడుతుండగా, తాజా సమావేశాలు మరింత స్నేహపూరిత వాతావరణానికి దోహదపడుతున్నాయి. ఇకపోతే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఆఫ్రికా ఖండం.. అవకాశాల గనిగా పేర్కొన్నారు. ప్రపంచ వృద్ధికి భారత్-ఆఫ్రికా దేశాలు తప్పక కృషి చేస్తాయన్నారు. పారిశ్రామిక సంఘం సిఐఐ తాత్కాలిక, గౌరవాధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ ఆఫ్రికా టెలికామ్, ఐటి, ఆటోమోటివ్, వౌలిక, నిర్మాణ, రవాణా రంగాల్లో భారత్ పెట్టుబడులున్నాయని చెప్పారు. ఇవి ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయన్నారు.

చిత్రం... ఆఫ్రికన్
డెవలప్‌మెంట్ బ్యాంక్స్ వార్షిక సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులతో అరుణ్ జైట్లీ

త్వరలో ఎన్‌పిఎ ఆర్డినెన్స్ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, మే 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే 15 రోజుల్లో మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) ఆర్డినెన్స్ క్రింద మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలున్నాయి. బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని మొండి బకాయిలు ప్రశ్నార్థకం చేస్తున్నది తెలిసిందే. ఇప్పటికే ఇవి 8 లక్షల కోట్ల రూపాయలకుపైగా పేరుకుపోయాయి. దీంతో ఈ మొండి బకాయిలను వేగంగా వసూలు చేయడానికి ఎన్‌పిఎ ఆర్డినెన్స్‌లోని మార్గదర్శకాలను ఆర్‌బిఐ విడుదల చేయనుంది. విజయ్ మాల్యా వంటి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకులు న్యాయపోరాటం కూడా చేస్తున్నది తెలిసిందే.

త్రైమాసిక
ఆర్థిక ఫలితాలు

దాల్మియా భారత్
న్యూఢిల్లీ, మే 22: దాల్మియా సిమెంట్ తయారీదారు దాల్మియా భారత్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 184.05 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 94.79 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,504.68 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,172.37 కోట్ల రూపాయలుగా ఉంది.
వర్ద్‌మాన్ టెక్స్‌టైల్స్
వర్ద్‌మాన్ టెక్స్‌టైల్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 158.56 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 176.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈసారి 1,657.39 కోట్ల రూపాయలుగా, పోయనసారి 1,515.27 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
కల్పతరు పవర్
ఇంజినీరింగ్ సంస్థ కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (కెపిటిఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 89.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 65.62 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,522.54 కోట్ల రూపాయలుగా, నిరుడు 1,357.15 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.
క్యాపిటల్ ఫస్ట్
చిన్నతరహా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ క్యాపిటల్ ఫస్ట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 70.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 49 శాతం అధికం. రుణాల మంజూరు ఈసారి 18,353 కోట్ల రూపాయలుగా, పోయినసారి 13,756 కోట్ల రూపాయలుగా ఉంది.
8కె మైల్స్ సాఫ్ట్‌వేర్
క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ 8కె మైల్స్ సాఫ్ట్‌వేర్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 40.18 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే 145 శాతం పెరిగింది. ఆదాయం ఈసారి 166.66 కోట్ల రూపాయలుగా, నిరుడు 86.35 కోట్ల రూపాయలుగా నమోదైందని సంస్థ వెల్లడించింది.
జస్డ్ డయల్
లోకల్ సెర్చ్ ఇంజిన్ జస్ట్ డయల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 25.35 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 40.29 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. ఆదాయం ఈసారి 194.34 కోట్ల రూపాయలుగా, నిరుడు 198.48 కోట్ల రూపాయలుగా నమోదైందని సంస్థ వెల్లడించింది.
జెకె లక్ష్మీ సిమెంట్
జెకె లక్ష్మీ సిమెంట్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 20.85 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 25.87 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఆదాయం ఈసారి 930.57 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు 837.21 కోట్ల రూపాయలుగా నమోదైందని సంస్థ వెల్లడించింది.