బిజినెస్

తొలి 9 నెలల్లో రూ. 55 వేల కోట్ల ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/బెంగళూరు, మే 29: తొలి తొమ్మిది నెలల్లో 55 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రానున్న క్రమంలో సెస్ లెవీ ద్వారా ఎంతలేదన్నా ఈ మొత్తం అందవచ్చని మోదీ సర్కారు భావిస్తోంది. బొగ్గు, లగ్జరీ ఉత్పత్తులపై జిఎస్‌టితో పెద్ద ఎత్తున రాబడి వస్తుందని చెబుతున్నారు. అయితే జిఎస్‌టి అమలుతో నష్టపోతున్న రాష్ట్రాలకు ఈ ఆదాయంతో నష్టపరిహారం చెల్లించనుంది కేంద్రం.
ఒకే దేశం.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న ఈ నూతన పరోక్ష పన్నుల విధానంతో రాష్ట్రాలకు స్థానిక పన్నుల ఆదాయం దూరం కానున్నది తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో జూలై-మార్చి మధ్య బొగ్గు, లిగ్నైట్, పీట్‌పై సెస్‌ల నుంచి 22,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రెవిన్యూ శాఖ అంచనా వేస్తోంది. పొగాకుపై మరో 16,000 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని పిటిఐతో ఓ రెవిన్యూ అధికారి అన్నారు. 5, 12, 18, 28 శ్లాబుల్లో నాలుగు రకాల పన్నులతో జిఎస్‌టి విధానం రూపొందింది. దాదాపు అన్ని వస్తువులకు జిఎస్‌టి వర్తించనుండగా, కొన్ని రంగాలకు మాత్రం కేంద్రం మినహాయింపునిచ్చింది.
సోలార్ ప్యానెల్ ఎక్విప్‌మెంట్‌పై 5 శాతం పన్ను
పర్యావరణ హిత సౌర విద్యుదుత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానెల్ ఎక్విప్‌మెంట్‌పై జిఎస్‌టిలో అతి తక్కువగా 5 శాతం పన్నును విధించనున్నట్లు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. తొలుత 18 శాతం పన్నును ప్రతిపాదించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటైన జిఎస్‌టి కౌన్సిల్.. సోలార్ ఎక్విప్‌మెంట్‌పై విధించిన 18 శాతం పన్నును పునఃపరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అంతకుముందు సీనియర్ ప్రభుత్వ అధికార వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలో దాన్ని 5 శాతానికి తగ్గిస్తారన్న సంకేతాలను ట్విట్టర్‌లో అధియా.. పరిశ్రమ వర్గాలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.
పన్ను రేట్లలో మార్పు అధికారం జిఎస్‌టి కౌన్సిల్‌కే
జిఎస్‌టి విధానంలో భాగంగా ఆయా రంగాలు, ఉత్పత్తులపై నిర్ణయించిన పన్ను రేట్లలో మార్పు అధికారం జిఎస్‌టి కౌన్సిల్‌కే ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) చైర్‌పర్సన్ వనజా సర్న సోమవారం స్పష్టం చేశారు. ఈ అంశాన్ని జిఎస్‌టి కౌన్సిల్‌కే విడిచిపెట్టినట్లు ఆమె చెప్పారు. పన్ను రేట్లు అధికంగా ఉన్నాయని భావిస్తున్న రంగాలకు చెందిన పరిశ్రమలు ఆ రేట్లను తగ్గించాలని తమను సంప్రదిస్తున్నట్లు తెలిపిన ఆమె ఈ అధికారం తమకు లేదని జిఎస్‌టి కౌన్సిల్‌కు మాత్రమే ఉందని చెబుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 3న కౌన్సిల్ సమావేశం అవుతుందని, ఈ సందర్భంగా వివిధ రేట్లను సవరించే వీలుందన్నారు.
పన్ను ఎగవేతలను జిఎస్‌టి అరికడుతుంది
మరో నెల రోజుల్లో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే జిఎస్‌టి విధానం.. పన్ను ఎగవేతలను అరికడుతుందని, అంతేగాక మరింత ట్యాక్స్-కంప్లియెంట్ సొసైటీగా భారత్‌ను నిలబెడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు. బెంగళూరులో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం అనంతరం జైట్లీ మాట్లాడారు. సిబిఇసి అధికారులతోపాటు జిఎస్‌టి విధానంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) శాఖ అధికారులకు ఈ క్యాంపస్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. జిఎస్‌టి అమలులో రాష్ట్రాలకు, కేంద్ర పన్నుల శాఖలకు మధ్య సహకారాన్ని పెంచడంలో.. శిక్షణ పొందే ఈ అధికారులు కీలకపాత్ర పోషించగలరన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.