బిజినెస్

వెయ్యి కోట్ల నష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 30: అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో రొయ్య రైతుల కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటిపాపలా కాపాడుకున్న చెరువుల్లో రొయ్యలు చనిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గతంలో ఎన్నడూలేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే నష్టానికి కారణమని రైతులు వాపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా జరిగిందని అంచనా. మొత్తం మీద 10 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని సమాచారం. రోజులు గడిచేకొద్దీ ఈ నష్టం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఏడాది జనవరి సీజన్ రొయ్య రైతులకు బాగానే కలిసొచ్చింది. మంచి ధరతోపాటు ఎగుమతులు కూడా బాగుండటంతో రైతులు కాస్త లాభాలు కళ్లజూశారు. ఈ ఉత్సాహంతో మార్చి నుంచి మరోసారి సాగుకు ఉపక్రమించారు. ఎకరానికి లక్ష వరకు రొయ్య పిల్లలు వేసిన రైతులు.. ఆ స్థాయిలోనే భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. అయతే మార్చి చివరి నుంచి ప్రచండ భానుడు భగభగలు ప్రారంభమయ్యాయి. దీంతో నిరంతరం ఏరియేటర్లతో రైతులు రక్షణ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. కాని అంతకంతకూ పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు అనూహ్యంగా రొయ్యలను దెబ్బతీశాయి. అయతే చనిపోయన రొయ్యలు.. చేపల తరహాలో చెరువులో తేలవు. చెరువు అడుగుకు చేరుకుని, మట్టిలో కలిసిపోతాయి. అందువల్ల మేత తదితరాలు యథావిథిగా కొనసాగిస్తారు రైతులు. అయతే చివరకు పట్టుబడి సమయంలో ఈ భయంకర నిజం వెలుగులోకి వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రైతులు చెరువులో వలవేసి చూస్తుంటే తమ కష్టమంతా మట్టి పాలయ్యిందనే వాస్తవం అవగతమవుతోంది. మెజారిటీ చెరువుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో రైతులు హతాశులవుతున్నారు. హడావుడిగా పట్టుబడులు జరుపుతున్నా.. మిగిలిన రొయ్యలను కొనుగోలు చేసే నాథుడు కూడా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. అంతర్జాతీయంగా డిమాండు తగ్గిందనే కారణంగా ఎగుమతిదారులు కొనుగోళ్లు జరపకపోవడంతో నష్టం మరింత పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం 30 కౌంట్ రొయ్యలు సైతం కొనుగోలు చేసే నాథుడే లేడని, 350 రూపాయలు ఉండాల్సిన 50 కౌంట్ ధర 230 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు దేశంలోను ఇటు రాష్ట్రంలోను అత్యంత తొందరగా వృద్ధి చెందుతున్న రొయ్యల సాగును ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని రైతు నేతలు పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా నవ్యాంధ్ర రాష్ట్రంలో చెరువుల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ రంగం ఏటా వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతోంది. కాని ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కోల్డ్ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఐస్ ఫ్యాక్టరీలు పెరగలేదు. రాత్రింబవళ్లు కష్టించి సాగుచేసే రొయ్య రైతులకు బ్యాంకు రుణాలిప్పించడానికి సైతం ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని భీమవరం మండలం వెంప గ్రామానికి చెందిన రొయ్య రైతు కృష్ణంరాజు వాపోయారు. మొత్తానికి రొయ్య రైతుకు ప్రస్తుత వేసవి సీజన్ పెను శాపమే అయ్యంది.

వలవేసి రొయ్యలను పడుతున్న దృశ్యం, రెండెకరాల చెరువులో మిగిలిన రొయ్యలివే

మహీంద్ర లాభం రూ. 725 కోట్లు

జనవరి-మార్చిలో 20 శాతం వృద్ధి

ముంబయి, మే 30: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి- మార్చి)లో 725.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 604.63 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం ఈసారి 12,319.64 కోట్ల రూపాయలుగా, పోయినసారి 11,840.47 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంగళవారం సంస్థ తెలియజేసింది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ స్టాండలోన్ నికర లాభం 3,955.65 కోట్ల రూపాయలుగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 3,204.57 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు తెలిపింది. ఆదాయం కూడా 2016-17లో 48,438.53 కోట్ల రూపాయలుగా, 2015-16లో 44,488.83 కోట్ల రూపాయలుగా ఉందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ తెలియజేసింది.

ఆర్‌ఇసి లాభం రూ. 1,319 కోట్లు

జనవరి-మార్చిలో 14 శాతం వృద్ధి

ముంబయి, మే 30: రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,319.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 1,160.03 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం స్టాండలోన్ ఆదాయం ఈసారి 5,978.32 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,084.47 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం సంస్థ తెలియజేసింది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ ఏకీకృత నికర లాభం 6,313.37 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 5,691.42 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే మొత్తం ఏకీకృత ఆదాయం 2016-17లో 24,686 కోట్ల రూపాయలుగా, 2015-16లో 24,129.93 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చెప్పింది.