బిజినెస్

‘ఫ్రీడమ్ 251’కు ఫుల్ క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రింగింగ్ బెల్స్ ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్‌పై ఇప్పటికే భారీ స్థాయిలో అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ఫోన్ మరో సంస్థ స్మార్ట్ఫోన్‌ను కాపీ కొట్టి రీబ్రాండ్‌తో మార్కెట్‌లోకి వస్తోందా? అన్న కోణంలో అనుమానాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తాజాగా విడుదలైన ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్.. యాడ్‌కామ్ అనే సంస్థ రూపొందించిన ఐకాన్ 4ను పోలీ ఉందని, దానే్న ఇలా తిరిగి తయారు చేసేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇప్పటికే ఐకాన్ 4.. 3,999 రూపాయలకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై యాడ్‌కామ్ వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియాను పిటిఐ సంప్రదించగా, కొన్ని డివైజ్‌లను తమ నుంచి రింగింగ్ బెల్స్ తీసుకుందని అన్నారు. ఇంతకుమించి దీనిపై తాను ఏమీ మాట్లాడలేనన్నారు. మరోవైపు ఫ్రీడమ్ 251లో ఉన్న యాప్స్‌లో చాలావరకు యాపిల్ ఐఫోన్‌లో ఉన్నవే కనిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో రింగింగ్ బెల్స్ ప్రతినిధిని కూడా సంప్రదించగా, ఫోన్ ప్రారంభోత్సవంలో శాంపిల్ మోడల్స్‌ను చూపించామని, మార్కెట్‌లో విక్రయించేటప్పుడు అసలు బ్రాండ్ ఉంటుందని అన్నారు.

న్యూఢిల్లీ: రింగింగ్ బెల్స్.. ఇప్పుడిదో సంచలన సంస్థ. అవును మరి.. కేవలం 251 రూపాయలకు స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసి మార్కెట్‌లో ప్రత్యర్థి సంస్థల గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగించిందీ సంస్థ. భారత సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) కూడా ఈ నయా స్మార్ట్ఫోన్‌పట్ల ఆందోళన వ్యక్తం చేయగా, వినియోగదారుల్లో మాత్రం దీనికి విశేష ఆదరణ కనిపిస్తోంది. ప్రపంచంలోనే అంత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను ‘ఫ్రీడమ్ 251’ పేరిట బుధవారం రింగింగ్ బెల్స్ ఆవిష్కరించినది తెలిసిందే. ఈ ఫోన్ బుకింగ్స్ గురువారం ఉదయం 6 గంటల నుంచి మొదలవగా, సెకనుకు 6 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. వినియోగదారుల నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్‌కు సర్వర్లు ఒక్కసారిగా కూప్పకూలడంతో బుకింగ్స్‌ను నిలిపివేసింది రింగింగ్ బెల్స్. అయితే 24 గంటల్లోగా తిరిగి పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ‘ప్రియమైన మిత్రులారా, మీ విశేష ఆదరణ, స్పందన మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. మా స్మార్ట్ఫోన్ కోసం ఇంతగా పోటీ పడుతున్నందుకు మేము కృతజ్ఞులం. అయితే విపరీతమైన డిమాండ్‌తో సర్వర్లు డౌన్ అయిపోవడం బాధాకరం. ఇప్పటికైతే బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నాం. కానీ 24 గంటల్లోగా మళ్లీ పునరుద్ధరిస్తాం.’ అని నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, అమితి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మోహిత్ కుమార్ గోయెల్ ఈ సంస్థను ఐదు నెలల క్రితం నెలకొల్పగా, ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను 2,999 రూపాయలకే రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇక్కడ ‘ఫ్రీడమ్ 251’ పేరుతో 3జి స్మార్ట్ఫోన్‌ను 251 రూపాయలకే అందుబాటులోకి తీసుకురాగా, దీన్ని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆవిష్కరించారు. నిజానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ విడుదల చేయాల్సి ఉండగా, కేబినెట్ సమావేశం కారణంగా ఆయన హాజరు కాలేకపోయారన సంస్థ వర్గాలు తెలిపాయి. దీన్ని 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి.
మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ ఇంత చౌక ధరకు ఇస్తున్న నేపథ్యంలో దీని పనితీరుపట్ల వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ అధ్యక్షుడు అశోక్ చద్దా స్పందించారు. దీన్ని తయారు చేయడానికి తమకు 2,500 రూపాయలు ఖర్చవుతోందని, అయితే ఎకనామీస్ ఆఫ్ స్కేల్, నూతన మార్కెటింగ్ విధానాలు, పన్నుల తగ్గింపు, కొత్త ఈ-మార్కెట్ సృష్టితో 251 రూపాయలకే అందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతోందన్న ఊహాగానాలనూ ఆయన కొట్టిపారేశారు. కాగా, నోయిడా, ఉత్తరాంచల్ ప్లాంట్లలో ఈ ఫోన్ తయారీ కానుండగా, ఈ రెండు ప్లాంట్లను 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. 5 లక్షల ఫోన్ల తయారీ సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నామని చద్దా చెప్పారు. మరోవైపు ఈ స్మార్ట్ఫోన్ రాకతో మార్కెట్‌లో మిగతా సంస్థల ఉనికి ప్రమాదంలో పడుతుందని భారత సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖను కూడా బుధవారం ఐసిఎ రాసినది తెలిసిందే. రాయితీ ధరలోనైనా 3,500 రూపాయల కంటే తక్కువకు స్మార్ట్ఫోన్‌ను విక్రయించడం సాధ్యం కాదని ఐసిఎ తెలిపింది. అలాంటిది 251 రూపాయలకు ఎలా ఇస్తున్నారని, దాని పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరముందని లేఖలో పేర్కొంది.
‘ఇలాంటి ఓ స్మార్ట్ఫోన్‌ను తయారు చేయడానికి ఉత్పాదక వ్యయం ఎంత లేదన్నా ప్రస్తుతం 2,700 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత దీని మార్కెటింగ్, పన్నుల చెల్లింపులు, పంపిణీ, ప్రచారం తదితర ఖర్చులతో కలుపుకుంటే ధర 4,100 రూపాయలకు చేరుతుంది. అలాంటిది 251 రూపాయలకే ఎలా ఇస్తారు?.’ అని ఐసిఎ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహింద్రూ లేఖలో ప్రశ్నించారు. కాగా, గతంలో అనీల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)తో కలిసి డేటావిండ్ సంస్థ కూడా 999 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను తెస్తామని ప్రకటించింది. అయితే అది ఇంకా రాలేదు. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా రింగింగ్ బెల్స్ 251 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను తెచ్చేసింది. ఏదిఏమైనా ఈ ఫోన్ సక్సెస్ అయితే మిగతా సంస్థలన్నీ దివాళా తీయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వినియోగదారులందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్ రావడం కూడా తథ్యమనిపిస్తోంది.

చిత్రం... ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్‌తో రింగింగ్ బెల్స్ అధ్యక్షుడు అశోక్ చద్దా, డైరెక్టర్ మోహిత్ గోయెల్, సిఇఒ ధార్ణ గోయెల్