బిజినెస్

పెన్షన్ పథకాన్ని విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పింఛను రంగానికి పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటుగా అవ్యవస్థీకృత రంగానికి సైతం పెన్షన్ రంగాన్ని విస్తరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, అభివృద్ధి అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఏ) చైర్మన్ హేమంత్ జి కాంట్రాక్టర్ అన్నారు. ‘జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పిఎస్)కు సంబంధించి ఏ పన్నుల విధానమైనా సరే ప్రభుత్వం వైపునుంచి ఒకే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం యాన్యుటీల కొనుగోలుపై ఒక శాతం సేవా పన్ను విధిస్తున్నారు. దాన్ని కూడా రద్దు చేయాలని మేము కోరుతున్నాం. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ రెండు అంశాలను పరిశీలించాలని మేము ప్రభుత్వాన్ని కోరాం’ అని బుధవారం ఇక్కడ పెన్షన్ విధానంపై ఫిక్కీ, కెపిఎంజిలు కలిసి రూపొందించిన నివేదిక విడుదల సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ అన్నారు. అవ్యవస్థీకృత రంగంలోని వారికి పెన్షన్ స్కీము పెద్దగా కవర్ కావడం లేదని, ఈ తరగతి కస్టమర్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ‘ఇది నిజంగా ఒక సమస్యే. దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒక్కటే ఆ పని చేయలేదు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తమ పెన్షన్ అవసరాలకోసం చెల్లించే స్థోమత ఉండదు. అందువల్ల వాళ్లకు ప్రభుత్వ నిధులు సమకూర్చిన పథకాలు తప్పనిసరి. ఈ అంశాలను పరిష్కరించడానికి మేము ప్రభుత్వంతో చర్చిస్తున్నాం’ అని కార్యక్రమంలో ప్రారంభోత్సవం చేస్తూ కాంట్రాక్టర్ అన్నారు. దేశంలో పని చేసే వారిలో కేవలం 11-12 శాతం మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో ఉన్నారని, వీరిలో చాలామంది ప్రభుత్వ పెన్షన్ పథకాల పరిధిలోకి వస్తారని, అయితే మిగతా 88 శాతం మంది అవ్యవస్థీకృత రంగానికి చెందిన వారని, వీరికి పెన్షన్ పథకాల ద్వారా పెద్దగా భద్రత లేదని ఆయన చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా అందరికీ వర్తించే సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈ సమస్య అని కాంట్రాక్టర్ అన్నారు. కాగా, సంపన్నులపై ఎక్కువ పన్నులు విధించి, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు మరిన్ని పన్ను రాయితీలు ఇచ్చే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఫిక్కీ- కెపిఎంజి నివేదిక సూచించింది.

పిఎఫ్‌ఆర్‌డిఏ చైర్మన్ హేమంత్ జి కాంట్రాక్టర్