బిజినెస్

ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జి స్పెక్ట్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలోగల ఎయిర్‌సెల్ 4జి స్పెక్ట్రమ్‌ను భారతీ ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు 3,500 కోట్ల రూపాయలను ఎయిర్‌సెల్‌కు ఎయిర్‌టెల్ చెల్లించనుంది. ఎయిర్‌సెల్ లిమిటెడ్, దీని అనుబంధ సంస్థలు డిష్‌నెట్ వైర్‌లెస్ లిమిటెడ్, ఎయిర్‌సెల్ సెల్యులార్ లిమిటెడ్‌తో దీనికి సంబంధించి ఓ ఒప్పందాన్ని ఎయిర్‌టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ లిమిటెడ్ చేసుకున్నాయి కూడా. దీంతో ఎనిమిది సర్కిళ్లలోని 2300 బ్యాండ్ 4జి టిడి స్పెక్ట్రమ్‌లోగల 20 మెగాహెట్జ్ వినియోగానికి ఎయిర్‌టెల్‌కు లైన్ క్లియరైనట్లైంది. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ తెలిపింది. కాగా, తమిళనాడు (చెన్నై సహా), బీహార్, జమ్ముకాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సోం, ఆంధ్రప్రదేశ్, ఒడిషాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల సర్కిళ్లలో ఎయిర్‌సెల్ 4జి సేవల హక్కులను ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిషా సర్కిళ్ల స్పెక్ట్రమ్ వినియోగంలో హక్కుల బదిలీ.. టెలికామ్ శాఖ నిర్వహించే రాబోయే వేలం నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఎయిర్‌టెల్ చెప్పింది. ఇదిలావుంటే వీడియోకాన్ టెలీకమ్యూనికేషన్స్ నుంచి ఆరు సర్కిళ్లలో రేడియో తరంగాలను ఎయిర్‌టెల్ కొనుగోలు చేసి నెల రోజులు కూడా గడవకముందే ఇప్పుడు ఎయిర్‌సెల్ నుంచి 8 సర్కిళ్లలో 4జి స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. వీడియోకాన్ రేడియో తరంగాలను ఎయిర్‌టెల్ 4,428 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినది తెలిసిందే. దీంతో బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో 1,800 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునేందుకు ఎయిర్‌టెల్‌కు హక్కు లభించింది. 2032 వరకు ఈ స్పెక్ట్రమ్ వినియోగానికి గడువుంది. ఇక 2030 సెప్టెంబర్ 20 వరకు 4జి స్పెక్ట్రమ్ వినియోగానికి ఎయిర్‌సెల్, డిష్‌నెట్‌లకు గడువుండగా, దీన్నిప్పుడు ఎయిర్‌టెల్ 3,438 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 4జి సేవలను అందుబాటులోకి తెచ్చే వీలుండటంతో దేశీయ టెలికామ్ రంగ దిగ్గజమైన భారతీ ఎయిర్‌టెల్ అంతకంటే ముందే దేశవ్యాప్తంగా 4జి సేవలను పరిచయం చేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థి సంస్థల నుంచి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు గత ఏడాది అక్టోబర్‌లో రేడియో తరంగాల ట్రేడింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దగ్గర్నుంచి తాజా ఎయిర్‌టెల్-ఎయిర్‌సెల్ డీల్ మూడవది. ఈ ఏడాది జనవరిలో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో రిలయన్స్ జియో.. 800 మెగాహెట్జ్ బ్యాండ్‌లోని 17 వైర్‌లెస్ ఏరియాలలో స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ ఒప్పందాలను చేసుకుంది. ఆ తర్వాత వీడియోకాన్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం, ఇప్పుడు ఎయిర్‌సెల్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందాలు జరిగాయి. ఇదిలావుంటే తాజా ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4జి సేవలను అందిస్తున్న ఏకైక టెలికామ్ సంస్థగా భారతీ ఎయిర్‌టెల్ నిలవబోతోందని స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఆ సంస్థ తెలిపింది.

వృద్ధిపథంలో
టాటా స్టీల్ అమ్మకాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో టాటా స్టీల్ అమ్మకాలు 13 శాతం పెరిగి 2.72 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 2.41 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. బ్రిటన్ ఉక్కు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న టాటా స్టీల్.. గత ఆర్థిక సంవత్సరం (2015-16) మొత్తంగా రికార్డు స్థాయిలో 9.54 మిలియన్ టన్నుల ఉక్కును విక్రయించడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో 8.75 మిలియన్ టన్నుల అమ్మకాలకే పరిమితమైంది.
టెక్నాలజీ.. అద్భుతాలు చేస్తోంది
ఐసిఐసిఐ సిఇఒ చందా కొచ్చర్
హైదరాబాద్, ఏప్రిల్ 8: భారత్‌లో సాంకేతికత దూసుకెళ్తోందని, పెరిగిన అంతర్జాల వినియోగం.. దేశంలో వ్యాపార స్వరూపానే్న మార్చి వేసిందని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ చందా కొచ్చర్ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) వద్ద జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఓ వెలుగు వెలుగుతూనే ఉంది.’ అన్నారు.
సేవింగ్స్ ఖాతాదారులకు
ఇకపై నెలసరి వడ్డీ: ఒబిసి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పొదుపు ఖాతాదారులకు వారి సొమ్ముపై చెల్లించే వడ్డీని నెలనెలా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులకు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) అందుకు సిద్ధమైంది. ఈ నెల నుంచే దాన్ని అమలు చేస్తామని ఓ ప్రకటనలో శుక్రవారం ఒబిసి స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆరు నెలలకోసారి వడ్డీని సేవింగ్స్ ఖాతాల్లో బ్యాంక్ జమ చేస్తోంది. 2010 ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌పై వడ్డీరేటును రోజువారీగా బ్యాంకులు లెక్కిస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు 4 శాతం వడ్డీనిస్తుండగా, ప్రైవేట్‌రంగ బ్యాంకులు 6 శాతం వరకు ఇస్తున్నాయి. ఇక 2011లో సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీరేట్ల విషయంలోనూ వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బిఐ స్వేచ్ఛనిచ్చింది. అయితే లక్ష వరకున్న డిపాజిట్లపై అన్ని బ్యాంకులూ ఒకే వడ్డీరేటును ఇవ్వాలని, ఆపై డిపాజిట్లకు బ్యాంకుల ఇష్టానుసారమని స్పష్టం చేసింది.

ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ
చైర్మన్‌గా రాజీవ్ తల్వార్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ సిఇఒ రాజీవ్ తల్వార్.. రియల్టర్ల సంఘమైన జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గురువారం ఇక్కడ జరిగిన ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ 103వ పాలక మండలి సమావేశంలో తల్వార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో శుక్రవారం ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ తెలియజేసింది. కాగా, తులిప్ ఇన్‌ఫ్రాటెక్ సిఎండి ప్రవీణ్ జైన్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ అధ్యక్షుడిగా ఎన్నికైనది తెలిసిందే. కేంద్ర గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1998లో ఏర్పాటై, స్వయంప్రతిపత్తి కలిగిన నియంత్రిత సంస్థ ఎన్‌ఎఆర్‌ఇడిసిఒ.

ఐదేళ్ల గరిష్ఠానికి
దేశీయ కార్ల అమ్మకాలు
2015-16లో 7.87 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయంగా కార్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. 7.87 శాతం వృద్ధితో 20,25,479 యూనిట్ల కార్లు అమ్ముడైనట్లు భారతీయ ఆటోరంగ తయారీదార్ల సమాజం (ఎస్‌ఐఎఎమ్) తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో విక్రయాలు 18,77,706 యూనిట్లుగా ఉన్నట్లు పేర్కొంది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 29.08 శాతం వృద్ధిరేటు నమోదైందని, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే అధిక వృద్ధి కనిపించిందని ఎస్‌ఐఎఎమ్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.
అంతంతమాత్రంగానే ప్యాసింజర్ వాహన అమ్మకాలు: ఎస్‌ఐఎఎమ్
మరోవైపు అధిక పన్నుల భారం, డీజిల్ వాహనాలకు పర్యావరణ సమస్యలు తదితర కారణాల మధ్య ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి అంచనాను ఎస్‌ఐఎఎమ్ మరోసారి తగ్గించింది. 6-8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గడచిన రెండు నెలల్లో అంచనాను తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తొలుత 12 శాతం నుంచి 11 శాతానికి తగ్గించగా, ఇప్పుడు దాన్ని 6-8 శాతానికి తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో పెట్రోల్, ఎల్‌పిజి/సిఎన్‌జి వాహనాలపై 1 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను ప్రకటించినది తెలిసిందే. అలాగే కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీలో 2000సిసి సామర్థ్యానికిపైనున్న డీజిల్ వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించడం, తాజా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పావు శాతం తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు రుణాలకు వర్తింపజేయకపోవడం వంటివి ప్యాసింజర్ వాహన అమ్మకాలకు ప్రతిబంధకంగా మారినట్లు ఎస్‌ఐఎఎమ్ అభిప్రాయపడింది.

పది ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) శుక్రవారం 10 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 505 కోట్ల రూపాయల విలువైన ఈ ఎఫ్‌డిఐ ప్రతిపాదనల్లో సింగపూర్‌కు చెందిన హెలిక్స్ ఇనె్వస్ట్‌మెంట్ ఎఫ్‌డిఐ ప్రతిపాదన విలువే 475 కోట్ల రూపాయలు. మొత్తం 18 ప్రతిపాదనలను బోర్డు పరిగణనలోకి తీసుకోగా, రెండింటిని తిరస్కరించింది. మరో నాలుగింటిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది.

‘త్వరలో వడ్డీరేట్లు తగ్గొచ్చు’
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులు త్వరలో తగ్గిస్తాయన్న ఆశాభావాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఈ నెల 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్వహించినది తెలిసిందే. ఇందులో రెపో రేటును పావు శాతం తగ్గించింది. ఈ క్రమంలో బ్యాంకులు గృహ, వాహన తదితర రుణాలపై వడ్డీరేట్లను త్వరలోనే తగ్గించవచ్చని దాస్ అభిప్రాయపడ్డారు.

ఇండోనేసియాలో
బజాజ్, కెటిఎమ్ నెట్‌వర్క్ విస్తరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో, దాని ఆస్ట్రేలియా భాగస్వామి కెటిఎమ్ ఎజి.. ఇండోనేసియాలో తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాయి. 400సిసి వరకు సామర్థ్యం కలిగిన డ్యూక్, ఆర్‌సి బ్రాండ్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల కోసం ఇరు సంస్థలు ఇండోనేసియాలో తమ భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంటున్నాయి. బజాజ్ నిర్వహణలో కెటిఎమ్ డీలర్‌షిప్‌ల ద్వారా డ్యూక్, ఆర్‌సి బ్రాండ్ మోటార్‌సైకిళ్ల పంపిణీ జరుగుతోంది.

మిశ్రమంగా ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో సెనె్సక్స్, లాభాల్లో నిఫ్టీ

ముంబయి, ఏప్రిల్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ స్వల్పంగా నష్టపోతే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ స్వల్పంగా లాభపడింది. జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు దూరం గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ట్రేడింగ్‌లోనూ మదుపరులు కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటకు గురవగా, బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 11.58 పాయింట్లు కోల్పోయి 24,673.84 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ సూచీ 8.75 పాయింట్లు పెరిగి 7,555.20 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా చూసినట్లైతే సెనె్సక్స్ 595.80 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం 157.85 పాయింట్లు క్షీణించింది. కాగా, శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటి, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో రంగాల షేర్ల విలువ 0.82 శాతం నుంచి 0.08 శాతం వరకు దిగజారింది. అయితే యుటిలిటిస్, విద్యుత్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీ, చమురు, గ్యాస్, ఫైనాన్స్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 1.59 శాతం నుంచి 0.35 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, సింగపూర్, చైనా సూచీలు 0.09 శాతం నుంచి 0.78 శాతం నష్టపోతే, జపాన్, హాంకాంగ్, తైవాన్ సూచీలు 0.46 శాతం నుంచి 0.60 శాతం లాభపడ్డాయి. ఇక బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్లకుపైగా పలకడంతో ఐరోపా మార్కెట్లు లాభాల్లో కదలాడాయి.

- పనామా పత్రాల కలకలం -

వర్జిన్ ఐలాండ్స్‌లో
మాల్యాకు రహస్య ఆస్తులు?

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పనామా స్కాంలోనూ కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా పేరు వెలుగులోకి వచ్చింది. భారత్‌లో రూ. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి పరారైన విజయ్ మాల్యాకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రహస్య ఆస్తిపాస్తులున్నట్లు ‘పనామా’ డాక్యుమెంట్ల లీకేజీలో బయటపడింది. లిక్కర్ రారాజు అయిన విజయ్ మాల్యాకు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని వెంచర్ న్యూ హోల్డింగ్ లిమిటెడ్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని పరిశోధక జర్నలిస్టుల అంతర్జాతీయ కన్సార్టియం (ఐసీఐజే) వెల్లడించింది. ఈ కంపెనీ 2006 ఫిబ్రవరి 15 నుంచి ఆపరేషన్స్‌లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ చిరునామా 3 విఠల్ రోడ్డు బెంగళూరు పేరుతో ఉంది. ఇది విజయ్ మాల్యా ఇంటి అడ్రస్ కావటం గమనార్హం. మాల్యాకు సంబంధించిన చర, స్థిర ఆస్తులన్నింటిని బహిర్గత పరచాల్సిందిగా గురువారం సుప్రీంకోర్టు ఆయన్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. పోర్టిక్యులస్ ట్రస్ట్ నెట్ సంస్థతో కూడా మాల్యాకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఐసీఐజే పేర్కొంది. ఇది సౌత్ పసిఫిక్‌లోని కుక్ ద్వీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.