బిజినెస్

అమెరికాలో 25 లక్షల కార్ల రీకాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 3: అమెరికాలో మరోసారి భారీగా కార్ల రీకాల్‌కు ఆటోరంగ సంస్థలు పిలుపునిచ్చాయి. దాదాపు 25 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఆరు అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాయి. ఎయిర్ బ్యాగుల్లో లోపాల కారణంగానే ఈ రీకాల్‌కు దిగుతున్నట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి. రీకాల్ చేస్తున్న కార్లలో జనరల్ మోటార్స్‌కు చెందిన 19 లక్షల ఎస్‌యువిలు, ఫోక్స్‌వాగన్‌కు చెందినవి 2 లక్షల 17 వేలు, మెర్సిడెస్ బెంజ్ కార్లు 2 లక్షలు, బిఎమ్‌డబ్ల్యు కార్లు 92 వేలు, జాగ్వార్ లాండ్‌రోవర్‌కు చెందినవి 54 వేలు, దైమ్లర్ వాహనాలు 5,100 ఉన్నాయి. కాగా, గత వారం రోజుల నుంచి ఇప్పటిదాకా ఈ ఎయిర్‌బ్యాగుల కారణంగా అమెరికాలో ఏకంగా కోటీ 64 లక్షల వాహనాలను ఆయా సంస్థలు రీకాల్ చేయడం గమనార్హం.

తెలంగాణ సదరన్ డిస్కంకు జాతీయ అవార్డు

హైదరాబాద్, జూన్ 3: డిస్కంల అభివృద్ధికి తెలంగాణ సదరన్ డిస్కం తీసుకున్న పటిష్టమైన చర్యలకు ప్రతిష్ఠాత్మకమైన జాతీయ అవార్డును కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌర విద్యుత్ అభివృద్ధికి తాము తీసుకున్న చర్యలకు ప్రోత్సాహకంగా ఈ అవార్డు వచ్చినట్లు తెలంగాణ సదరన్ డిస్కం సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 3,433 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి కోసం ప్లాంట్లతో తెలంగాణ సదరన్ డిస్కం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 609 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్లాంట్లు ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం 2015లో సౌరవిద్యుత్ విధానాన్ని ప్రకటించినది తెలిసిందే. కాగా, రఘుమారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 11.30 శాతం నుంచి 10.59 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. డిటిఆర్ ఫెయిల్యూర్ రేటును 10.59 శాతం నుంచి 8.91 శాతానికి తగ్గించామన్నారు. వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, దీని విలువ 700 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో 94,085 పంపుసెట్లను 455.6 కోట్ల రూపాయలతో హెచ్‌విడిఎస్ పరిధిలోకి తెచ్చామని వివరించారు.

తెలంగాణ సదరన్ డిస్కం
సిఎండి రఘుమారెడ్డి

సిండికేట్ మాయాజాలం
రోజురోజుకు తగ్గుతున్న పొగాకు ధరలు ౄ ఆందోళన చెందుతున్న రైతులు
శ్రుతి మించుతున్న వ్యాపారుల లాభాపేక్ష ౄ పట్టించుకోని బోర్డు అధికారులు కిలో రూ. 121 మించని సగటు ధర ౄ ముందుకు సాగని కొనుగోళ్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యానికి రైతుల డిమాండ్

ఒంగోలు, జూన్ 3: పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్ అవుతూ ధరలు తగ్గించి కోనుగోళ్ళు చేయటంతో రోజురోజుకు ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతులకు గిట్టుబాటు ధరలు రాక ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోని వేలం కేంద్రాల్లో కిలో పొగాకును సగటున 121 రూపాయలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయటం లేదు. వేలం కేంద్రాల ప్రారంభం నాటికి ప్రస్తుతానికి కిలోకి సుమారు 10 రూపాయలకు పైగా ధర తగ్గినట్లు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు వేలం కేంద్రాల్లో నడుస్తున్న ధరలతో పోల్చుకుంటే కిలోకు సగటున 20 రూపాయలకు పైగా తగ్గినట్లు చెబుతున్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి లక్ష్యం 120 మిలియన్ కిలోలుగా నిర్ణయిస్తే, రైతులు కాస్త అటూ ఇటుగా పండించారు. జిల్లాలో సుమారు 70 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్ణయించగా, ఆ మేరకు రైతులు ఉత్పత్తి చేశారు. మరోవైపు ఈ సారి జిల్లాలో 70 శాతం పైగా నాణ్యత కలిగిన పొగాకు ఉత్పత్తి కాగా కేవలం 30 శాతం పొగాకు మాత్రమే మధ్యరకం, లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తి జరిగింది. నిజానికి జిల్లాలో వేలం కేంద్రాల ప్రారంభంలో నాణ్యమైన పొగాకు కిలోకు గరిష్ఠ ధర సుమారు 150 రూపాయల వరకు ధర పలకగా సగటున 138 రూపాయలు పైగా ధర వచ్చింది. అయితే వ్యాపారులు వేలం కేంద్రాల్లో సిండికేట్‌గా మారి రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో రైతులు గతంలో కంటే సుమారు పది రూపాయల నుండి 20 రూపాయల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వేలం కేంద్రాలు ప్రారంభమై సుమారు 77 రోజులవగా, 70 మిలియన్ కిలోలకుగాను ఇప్పటి వరకు 31 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే అమ్ముడు పోయింది. దీంతో సగానికి పైగా పొగాకు రైతుల వద్ద నిల్వ ఉంది. వేలం కేంద్రాల కొనుగోళ్లలో జాప్యం జరిగి పొగాకు రంగు మారి నాణ్యత తగ్గి పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో మరింత గా ధరలు తగ్గితే తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి ప్రాంతంలో తరచుగా పర్యటిస్తుండటంతో అక్కడ మంచి ధరలు వస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు అంటు న్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇటీవల జిల్లాలో పర్యటించిన సమయంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అయితే ఆయన పర్యటన సమయానికి ప్రస్తుతానికి పది రూపాయలకు పైగా ధరలు తగ్గాయని రైతులు చెబుతున్నారు.
పొగాకు బోర్డు అధికారులు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయ. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దించాలని కోరుతున్నారు. కొనుగోళ్ళలో పోటీ తత్వాన్ని పెంచి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేగవంతంగా కొనుగోళ్ళు జరిగేలా కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు.