బిజినెస్

పండగ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యాంశాలు
ౄ పావు శాతం తగ్గి 6.25 శాతానికి రెపోరేటు
ౄ 5.75 శాతానికి దిగిన రివర్స్ రెపో
ౄ 4 శాతం వద్ద నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) యథాతథం
ౄ ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా 7.6 శాతం
ౄ వర్షాలతో జిడిపి వృద్ధికి ఊతం
ౄ వచ్చే ఏడాది మార్చి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం
ౄ సెప్టెంబర్ నాటికి 372 బిలియన్ డాలర్లతో
ఆల్‌టైమ్ హై వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు
ౄ ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న
చర్యలతో వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశం
ౄ అమెరికా ఎన్నికలు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ
మార్కెట్‌లో క్షీణించిన డిమాండ్‌తో అనిశ్చితి వాతావరణం
ౄ డిసెంబర్ 7న వచ్చే ద్వైమాసిక ద్రవ్యసమీక్ష

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్ మధ్య తొలి ద్రవ్యసమీక్షను నిర్వహించిన ఆర్‌బిఐ నూతన గవర్నర్ ఉర్జిత్ పటేల్.. ఆరంభంలోనే ఆ డిమాండ్‌ను ఆలకించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొత్త సారథిగా మంగళవారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు నేతృత్వం వహించిన ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ కీలక వడ్డీరేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) చొప్పున తగ్గించారు మరి. రెపో రేటును 6.25 శాతానికి, రివర్స్ రెపో రేటును 5.75 శాతానికి దించారు. గడచిన ఆరేళ్లలో ఈ స్థాయిలో రెపో, రివర్స్ రెపోలు ఎన్నడూ లేకపోవడం గమనార్హం.
2010 నవంబర్‌లో రెపో రేటు 6.25 శాతం వద్దే ఉంది. మళ్లీ ఆ స్థాయికి ఇప్పుడే చేరింది. 2011 అక్టోబర్‌లోనైతే ఏకంగా 8.5 శాతంగా ఉంది. బ్యాంకులకిచ్చే రుణాలపై ఆర్‌బిఐ వడ్డీ వసూలు చేసేదే రెపో రేటు. బ్యాంకులు ఆర్‌బిఐ వద్ద డిపాజిట్ చేసిన సొమ్ముపై బ్యాంకులకు ఆర్‌బిఐ చెల్లించేదే రివర్స్ రెపో రేటు. ఈ డిపాజిట్ల స్థాయినే నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)గా పరిగణిస్తున్నాం. ఇదిలావుంటే ఆర్‌బిఐ తాజా నిర్ణయాన్ని వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఈ దసరా, దీపావళి పండగల కానుకగా అభివర్ణిస్తున్నాయి. గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు చౌకవుతాయని ఆశిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందించాలని బ్యాంకులను ఆర్‌బిఐ సూచనప్రాయంగా కోరింది. నిరుడు జనవరి నుంచి రెపో రేటును ఆర్‌బిఐ 175 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే బ్యాంకులు ఈ స్థాయిలో రుణాలపై వడ్డీరేట్లను తగ్గించలేదని ఆర్‌బిఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో బ్యాంకుల నిర్ణయం కోసం అంతా ఎదురుచూస్తున్నారు. తాజా తగ్గింపుతోనైనా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తారన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఉర్జిత్ పటేల్ వ్యక్తం చేశారు. చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు.
కాగా, నూతన గవర్నర్‌గా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేతి నుంచి అధికారాన్ని అందుకున్న ఉర్జిత్ పటేల్ తాజా ద్రవ్యసమీక్షతో మంచి మార్కులనే కొట్టేశారు. రాజన్ వడ్డీరేట్లను తగ్గించరని, వృద్ధిని ఆటంకపరుస్తున్నారని కొన్ని వర్గాలు, ముఖ్యంగా అధికార బిజెపి విమర్శించిన నేపథ్యంలో పటేల్ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. గడచిన ఆరు నెలల్లో వడ్డీరేట్లు తగ్గడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం పటేల్‌కు సానుకూల సంకేతాలనిస్తోంది. ఇకపోతే ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్యవిధాన కమిటీ (ఎమ్‌పిసి).. తమ తొలి సమీక్షలో వడ్డీరేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. మిగతా ముగ్గురు ఆర్‌బిఐ నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ ఆరుగురు వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు ఈ అధికారం కేవలం ఆర్‌బిఐకే ఉండగా, ఇప్పుడు సగం ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయినట్లైంది.
ఇక ద్రవ్యసమీక్ష సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పటేల్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండొచ్చన్నారు. అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, ప్రైవేట్‌రంగ పెట్టుబడుల్లో మందగమనం వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) వృద్ధిరేటుపై ప్రభావం చూపవచ్చాన్నారు. అయినప్పటికీ 7.9 శాతంగా నమోదు కావచ్చన్న ఆయన మున్ముందు ద్రవ్యోల్బణం అదుపులో ఉండగలదన్న విశ్వాసాన్ని కనబరిచారు. కాగా, మార్చి నాటికి 5 శాతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో వచ్చే ఏడాది జనవరి-మార్చిలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ పరిశోధన విభాగం చెబుతోంది. ఇక ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఇసిబి) ద్వారా అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) ఒక ఆర్థిక సంవత్సరంలో 3 మిలియన్ డాలర్ల వరకు నిధులను సమీకరించుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది.
అలాగే ఈ వారంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలకు తుదిరూపం ఇస్తామని చెప్పింది. బ్యాంకింగ్ రంగాన్ని ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ)పై పటేల్ స్పందిస్తూ మరింత లోతైన, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజన్ హయాంలోనే చర్యలు ప్రారంభమైనప్పటికీ మరింత ప్రభావవంతంగా ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థపై సైబర్ దాడులు పెరుగుతున్న క్రమంలో భద్రతను పెంచుతామన్న ఆయన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపబోదన్నారు. ఇకపోతే ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం ఆటో పరిశ్రమకు ఊతమిస్తుందని, ఈ పండగ సీజన్‌లో అమ్మకాలు పెరగడానికి దోహదపడుతుందని ఆటోరంగ సమాజం సియామ్ అభిప్రాయపడింది. అయితే బ్యాంకులు ఆటో రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తేనే ఇది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించింది. ఆ దిశగా నిర్ణయాలు బ్యాంకర్ల నుంచి వెలువడుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రధాన ఆటోరంగ సంస్థలన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతించాయ. నిర్మాణ రంగం కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే చాలాకాలం నుంచి హౌసింగ్ సేల్స్ మందగమనంలో ఉన్నాయని, గృహ రుణాలపై వడ్డీరేట్లను బ్యాంకులు మరింతగా తగ్గించాలని క్రెడాయ్ కోరింది.
వడ్డీరేట్లను తగ్గించిన ఐసిఐసిఐ
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ మంగళవారం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించిన నేపథ్యంలో 5 బేసిస్ పాయింట్లను తక్షణమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 9.10 శాతం నుంచి 9.05 శాతానికి తీసుకొచ్చింది. తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఎవరేమన్నారు?

‘దేశ ఆర్థిక వ్యవస్థను ఆర్‌బిఐ నిర్ణయం బలోపేతం చేస్తుంది. బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలి.’
- ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్
‘ఆర్‌బిఐ నిర్ణయం అందరికీ ఉపయోగకరం. వృద్ధికి ఊతం.’
- ఆర్థిక కార్యదర్శి అశోక్ లావస
‘ఆర్‌బిఐ చర్య స్వాగతించదగినది. మదుపరుల విశ్వాసాన్ని ఇది పెంపొందిస్తుంది.’
- నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ అరవింద్ పనగరియా
‘పండగ సీజన్‌లో ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం. బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందిస్తాయి.’
- ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ అశ్వినీ కుమార్
‘ద్రవ్యలభ్యత ఆధారంగా వడ్డీరేట్లను తగ్గిస్తాం. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటాం.’
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
‘ఆర్‌బిఐ తాజా నిర్ణయం కొనుగోళ్ల శక్తికి ఊతమిస్తుంది. వడ్డీరేట్ల తగ్గింపును స్వాగతిస్తున్నాం.’
- ఐసిఐసిఐ సిఇఒ చందా కొచ్చర్
‘ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంది.’
- యెస్ బ్యాంక్ ఎండి రాణా కపూర్
‘వడ్డీరేట్ల తగ్గింపు కోసం చాలా రోజుల నుంచి వేచిచూస్తున్నాం. మొత్తం ఆటో పరిశ్రమ ఆర్‌బిఐ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది.’
- మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ
‘ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు కూడా ఖతాదారుల ప్రయోజనార్థం అమలు పరచాలి.’
- సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
‘వచ్చే ఏడాది మార్చిలోగా మరోసారి వడ్డీరేట్లను ఆర్‌బిఐ తగ్గిస్తుందని ఆశిస్తున్నాం.’
- అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్
‘దేశీయ ఎగుమతులకు ఊతమిచ్చేలా ఆర్‌బిఐ మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలి.’
- ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్
‘బ్యాంకులన్నీ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలి. ఆర్‌బిఐ నిర్ణయం ప్రయోజనం అందరికీ అందాలి.’
- క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్
chitram...
మంగళవారం ముంబయలో విలేఖరులతో మాట్లాడుతున్న ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్