బిజినెస్

టిసిఎస్‌ను అమ్మేద్దామన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: టాటా-మిస్ర్తిల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా రతన్ టాటాపై సైరస్ మిస్ర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ టిసిఎస్‌ను ఐబిఎమ్‌కు అమ్మేయాలని చూసినట్లు ఆరోపించారు. దేశీయ ఐటి రంగ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. 100కుపైగా సంస్థలున్న 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌లో అతిపెద్ద సంస్థ అన్నది తెలిసిందే. భారతీయ స్టాక్ మార్కెట్లలో అత్యంత విలువైన సంస్థ కూడా టిసిఎస్సే. అయితే టిసిఎస్‌ను ఒకానొక దశలో ఐబిఎమ్‌కు రతన్ టాటా అమ్మేయాలని చూసినట్లు మిస్ర్తి మంగళవారం ఇక్కడ తెలిపారు. వాస్తవ ధర కంటే రెండింతలు పెట్టి బ్రిటన్‌కు చెందిన ఉక్కు సంస్థ కోరస్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రతన్ టాటాలోని ఈగోకు ఇదో నిదర్శనమని మిస్ర్తి గుర్తుచేశారు. టాటా గ్రూప్‌లోని టిసిఎస్, జెఎల్‌ఆర్ వంటి లాభదాయక సంస్థలకు మిస్ర్తి చేసిన కృషి ఏదీ లేదన్న టాటాల వాదనను మిస్ర్తి తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కార్యాలయం నుంచి ఐదు పేజీల లేఖ మంగళవారం విడుదలైంది. ఇందులో టిసిఎస్‌ను రతన్ టాటా అమ్మజూశారని పేర్కొన్నారు. మిస్ర్తి లేఖలోని వివరాల ప్రకారం 1992లో సమాన భాగస్వామ్యంతో టాటా ఇండస్ట్రీస్, గ్లోబల్ ఐటి దిగ్గజం ఐబిఎమ్ ఓ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేయగా, దీనికి రతన్ టాటా అధిపతిగా ఉన్నారు. ఈ సమయంలో 1968లో స్థాపించిన టిసిఎస్‌ను ఐబిఎమ్‌కు అమ్మేద్దామని రతన్ టాటా ప్రతిపాదించారు. అయితే అప్పటి చీఫ్ ఎఫ్‌సి కోహ్లీ అనారోగ్యంతో ఉండటం, జెఆర్‌డి టాటా ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో టాటా గ్రూప్‌కే తలమానికమైన, అత్యంత లాభదాయకమైన టిసిఎస్ ఇంకా బ్రతికి ఉందని మిస్ర్తి తెలిపారు. రతన్ టాటా ప్రతిపాదన అమలైతే టిసిఎస్ ఉండేదే కాదన్నారు. అలాంటిది తాను టాటా గ్రూప్ సంస్థల నిర్వీర్యానికి పాల్పడ్డానని, అదీ రతన్ టాటా ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1991లో జెఆర్‌డి టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోగా, టిసిఎస్ నుంచి కోహ్లీ 2000లో బయటకి వచ్చారు. 2004లో స్టాక్ మార్కెట్లలోకి టిసిఎస్ వచ్చింది. కాగా, రతన్ టాటా తప్పుడు వ్యాపార నిర్ణయాలపై మిస్ర్తి నుంచి వచ్చిన మూడో లేఖ ఇది. మిస్ర్తి నాయకత్వంలో టాటా గ్రూప్ సంస్థలన్నీ ఒక్కొక్కటిగా బలహీనపడ్డాయని, లాభాల్లో ఉన్న సంస్థలను తప్ప, నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించే చర్యలు చేపట్టలేదని, నష్టాలపాలైన సంస్థలను అమ్మేసేందుకు సిద్ధపడ్డారని రతన్ టాటా విమర్శించినది తెలిసిందే. గత నెల టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తిని టాటాలు తొలగించగా, తాత్కాలిక చైర్మన్‌గా మళ్లీ రతన్ టాటా ఎన్నికయ్యారు. నాలుగు నెలల్లో కొత్త సారథిని ఎంపిక చేసేందుకు ఓ కమిటీ కూడా ఏర్పాటైంది.
మరోవైపు టాటా గ్రూప్ సంస్థల్లో ఒక్కోదాని చైర్మన్‌గిరీ నుంచి మిస్ర్తిని తొలగించే పనిలో టాటా సన్స్ నిమగ్నమైంది. ఇప్పటికే పలు సంస్థల చైర్మన్ పదవి నుంచి మిస్ర్తిని తొలగించగా, ఇప్పుడు మిస్ర్తి తొలగింపు కోసం ఇజిఎమ్‌ను ఏర్పాటు చేయాలని టాటా పవర్‌ను టాటా సన్స్ కోరింది. ఇక డిసెంబర్ 23న టాటా కెమికల్స్ ఇజిఎమ్‌ను ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్‌లోని పలు సంస్థల స్వతంత్ర డైరెక్టర్లు మిస్ర్తికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అన్ని సంస్థల చైర్మన్ పదవుల నుంచి మిస్ర్తిని తప్పించాలని టాటా సన్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాలుగేళ్ల క్రితం రతన్ టాటా స్థానంలో టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఎన్నికైనది తెలిసిందే. టాటా సన్స్‌లో మిస్ర్తిలకు 18 శాతం వాటా ఉంది.

రతన్ టాటాతో సైరస్ మిస్ర్తి (ఫైల్ ఫోటో)