బిజినెస్

రూ. 130 కోట్ల నగదు, నగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 130 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. అలాగే పన్ను చెల్లింపుదారుల ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయాన్ని అందుకున్నట్లు కూడా చెప్పింది.
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం గత నెల 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. కొత్త 500, 2,000 రూపాయల నోట్లనూ పరిచయం చేయగా, రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, అంతే విలువైన కొత్త నోట్లను, పాత 100, 50 ఇతరత్రా నోట్లను పొందవచ్చని, డిసెంబర్ 30 వరకు ఈ అవకాశం ఉందని కూడా మోదీ స్పష్టం చేశారు. ఈ అనూహ్య నిర్ణయంతో అక్రమార్కులు తమ అవినీతి సంపదను సక్రమ సొత్తుగా మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతుండటంతో ఐటి శాఖ ఆ దిశగా దృష్టి సారించింది.
బంగారంగా మార్చుకోవడం, జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు చేయించడం వంటి వాటిని గుర్తించగా, ఈ క్రమంలో 400లకుపైగా కేసులను నమోదు చేసింది. వీటిలో తదుపరి విచారణ నిమిత్తం 30కిపైగా కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)లకు సిఫార్సు చేసినట్లు ఓ ప్రకటనలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) వివరించింది. ఆదాయ పన్ను చట్టాల పరిధికి మించి అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, అందుకే అలాంటి కేసులను ఇడి, సిబిఐలకు అప్పగించామని, వారి దర్యాప్తులో అన్ని నిజాలు వెలుగుచూస్తాయని, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిబిడిటి పేర్కొంది. ఇకపోతే ఇడి, సిబిఐలకు అప్పగించిన కేసుల విషయానికొస్తే ముంబయి, హైదరాబాద్, పుణేల నుంచి ఒక్కోటి, బెంగళూరు నుంచి 18, లూథియానా, భోపాల్‌ల నుంచి రెండేసి చొప్పున ఉన్నాయి. మరోవైపు పన్ను పరిమితిలో లేనివారు జన్ ధన్ ఖాతాల్లో దాదాపు 1.64 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది.
ఒక్కసారిగా ఖాతాల్లో పెరుగుతున్న నగదు నిల్వలపైనా దృష్టి సారించినట్లు ఐటి అధికారులు చెబుతున్నారు. సుమారు 25.5 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో నవంబర్ 30 నాటికి డిపాజిట్ అయిన నగదు విలువ 74,321 కోట్ల రూపాయలుగా ఉందని, పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు (నవంబర్ 9) ఈ ఖాతాల్లో ఉన్న నగదు విలువ 45,636.61 కోట్ల రూపాయలని అధికారులు పేర్కొన్నారు.
కాగా, 14 లక్షల కోట్ల రూపాయలకుపైగా విలువైన 500, 1,000 రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని, నవంబర్ 27 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రద్దయిన నోట్ల విలువ 8.45 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది.