బిజినెస్

ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వ్యాపార, పారిశ్రామిక రంగాలను ఏ స్థాయిలో దెబ్బతీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమను ఇది తీవ్రంగా కుదిపేసింది. మార్కెటింగ్ పరిశోధనా సంస్థ నీల్సన్ గణాంకాల ప్రకారం అక్టోబర్‌తో పోల్చితే గత నెల నవంబర్‌లో ఎఫ్‌ఎమ్‌సిజి విక్రయాలు 1-1.5 శాతం పడిపోయాయి.
దీని విలువ 3,840 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. అయితే 2.56 లక్షల కోట్ల రూపాయల విలువైన భారతీయ ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారులు సరకు నిల్వలను తగ్గించుకోవడమే దీనికి కారణం. డిజిటల్ పేమెంట్లు పూర్తిస్థాయిలో విస్తరించకపోవడంతో నగదు లావాదేవీలపైనే ఆధారపడ్డ ఎందరో వ్యాపారులు ఇప్పుడు దుకాణాల్లో ఆయా సరకులను నిల్వ చేసుకోవడం తగ్గించారు. అమ్మకాలు లేకపోవడంతో సరకు కొనుగోళ్లనూ తక్కువ చేసుకున్నారు వ్యాపారులు. ఈ ప్రభావం మొత్తం ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమ ఉత్పాదక సామర్థ్యంపై పడుతోంది. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో రిటైల్ షాపుల కొనుగోళ్లు 6.4 శాతం తగ్గాయి. ముఖ్యంగా సబ్బులు, టూత్‌పేస్టులు, షాంపూల వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తుల కొనుగోళ్లు క్షీణించాయి. ఇక గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు తాజా సర్వేలో తేలింది. ఇది కూడా ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమకు ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెడుతోంది. గ్రామాల్లో అరువుపై విక్రయాలు, రద్దయిన నోట్ల స్వీకరణ జరగడంతో అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని, పట్టణాల్లో అలాంటివి లేకపోవడంతో అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నాయని నీల్సన్ సర్వే పేర్కొంది.
ఇక గృహస్తులు సైతం తమ నెలసరి ఖర్చులను 50 శాతం మేర తగ్గించుకున్నారని, పిండి, బియ్యం, పప్పులు, చక్కెర వంటి నిత్యవసరాలతో పోల్చితే బిస్కట్లు, సాల్టీ స్నాక్స్ వంటి వినియోగాన్ని తగ్గించారని చెప్పింది. మొత్తానికి పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమ కుదేలైంది.