బిజినెస్

ఇన్ఫోసిస్ లాభం రూ. 3,708 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 13: దేశీయ రెండో అతిపెద్ద ఐటిరంగ సంస్థ.. ఇన్ఫోసిస్ లిమిటెడ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7 శాతం పెరిగింది. 3,708 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 3,465 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 17,273 కోట్ల రూపాయలుగా, పోయినసారి 15,902 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెవిన్యూ అంచనాను 8.4-8.8 శాతానికి తగ్గించింది ఇన్ఫోసిస్. అంతకుముందు ఇది 8.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య దీన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం కూడా కారణమే. శుక్రవారం ఇక్కడ ఇన్ఫోసిస్ సిఇఒ, ఎండి విశాల్ సిక్కా సంస్థ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ వార్షిక ఆదాయం 10 బిలియన్ డాలర్ల మార్కును తాకడం సంతోషకరమన్నారు. 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. కాగా, భారతీయ ఐటి రంగానికి కీలక మార్కెటైన అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో అక్కడి విధానాల ప్రభావం తప్పక దేశ ఐటి సంస్థలపై పడుతుందని సిక్కా అన్నారు. అయితే అమెరికా విధానాలు భారత ఐటి రంగాభివృద్ధికి దోహదపడేలా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే త్రైమాసిక ఆర్థిక ఫలితాల మధ్య ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. వార్షిక ఆదాయ అంచనా తగ్గిపోవడంతో ఇన్ఫోసిస్ షేర్ విలువ 2.5 శాతం క్షీణించింది. ఫలితంగా ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ 5,718.44 కోట్ల రూపాయలు హరించుకుపోయింది. 2,23,986.56 కోట్ల రూపాయలుగా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఇన్ఫోసిస్ షేర్ విలువ 2.49 శాతం పడిపోయి 975.15 రూపాయల వద్ద నిలిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో 3.6 శాతం దిగజారి 964 రూపాయల వద్ద స్థిరపడింది. ఈ ఒక్కరోజే బిఎస్‌ఇలో 12.67 లక్షల ఇన్ఫోసిస్ షేర్లు చేతులు మారగా, ఎన్‌ఎస్‌ఇలో కోటికిపైగా షేర్లు చేతులు మారాయి. మరోవైపు ఇన్ఫోసిస్ డిప్యూటి సిఒఒగా రవికుమార్ ఎస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా, చీఫ్ డెలివరి ఆఫీసర్‌గా ఉన్న రవికుమార్‌ను డిప్యూటి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం సంస్థ తెలిపింది. సంస్థ సిఒఒ యుబి ప్రవీణ్ రావుకు రవికుమార్ డిప్యూటిగా వ్యవహరిస్తారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ ప్రకటించింది.

చిత్రం..శుక్రవారం బెంగళూరులో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్థిక ఫలితాల సందర్భంగా సంస్థ సిఇఒ, ఎండి విశాల్ సిక్కా