బిజినెస్

పుంజుకున్న ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారతీయ ఎగుమతులు గత నెలలో 4.32 శాతం పెరిగాయి. జనవరిలో 22.11 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్లో వృద్ధి కనిపించిందని, ఇంజినీరింగ్ గూడ్స్, ఐరన్ ఓర్ ఎగుమతులూ పెరిగాయని తెలిపింది. అయితే అంతకుముందు నెల డిసెంబర్‌తో చూస్తే 5.72 శాతం తగ్గాయి.
కాగా, దిగుమతులు గతంతో పోల్చితే 10.7 శాతం ఎగిసి 31.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు 9.84 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జనవరిలో ఇది 7.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక బంగారం దిగుమతులు నిరుడు జనవరితో పోల్చితే 29.94 శాతం పడిపోయాయి. క్రిందటిసారి 2.91 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈసారి 2.04 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జనవరిలో భారత ఎగుమతులు 220.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జనవరితో చూస్తే ఇవి దాదాపు 1 శాతం అధికం. వాణిజ్య లోటు ఈ ఏప్రిల్-జనవరిలో 86.38 బిలియన్ డాలర్లుగా, నిరుడు ఏప్రిల్-జనవరిలో 107.74 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా, ఈసారి ఐరన్ ఓర్ ఎగుమతులు పది రెట్లు ఎగబాకి 184.43 మిలియన్ డాలర్లుగా, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 2.08 బిలియన్ డాలర్ల నుంచి 2.69 బిలియన్ డాలర్లకు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు 11.89 శాతం ఎగిసి 5.45 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఈ జనవరిలో పెట్రోలియమేతర ఎగుమతులు 19.42 బిలియన్ డాలర్లుగా, చమురేతర దిగుమతులు 23.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని అంచనా. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) వివరాల ప్రకారం నిరుడు నవంబర్ నాటికి అమెరికాకు భారత ఎగుమతులు 2.63 శాతం పెరగగా, యూరోపియన్ యూనియన్ (ఈయు)కు 5.47 శాతం, జపాన్‌కు 13.43 శాతం పెరిగాయి. చైనాకు మాత్రం 1.51 శాతం తగ్గాయి.