బిజినెస్

మళ్లీ స్కాంపీ శకం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 17: గత కొంతకాలంగా తెరమరుగైన స్కాంపీ రకం రొయ్యల సాగుకు మళ్లీ తెరలేస్తోంది. స్కాంపీనే ‘జెయింట్ ప్రాన్’ అంటారు. వైరస్ భయంతో స్కాంపీని పక్కనపెట్టిన రైతులు.. వనామీ రకం సాగుకు మొగ్గుచూపారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా వనామీదే పైచేయి అయ్యింది. తాజాగా వనామీకి వైరస్ ఎక్కువగా సోకుతుండటంతో మళ్లీ స్కాంపీ వైపు రైతుల దృష్టి మళ్లుతోంది. వనామీతో పోల్చితే తక్కువ వైరస్ ఉండటం, అంతర్జాతీయంగా డిమాండు అధికంగా ఉండటం వంటి కారణాలవల్ల మళ్లీ స్కాంపీ వైపు రైతాంగం దృష్టి సారిస్తోంది.
చేపల పెంపకంలో అగ్రగామిగా ఉన్న చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు స్కాంపీ పెంపకంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీనితో వైరస్ బారిన పడుతున్న వనామీకి స్కాంపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో అధికం
ప్రపంచంలోని దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో స్కాంపీ రొయ్యలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. 2005-06 ప్రాంతంలో భారత్ నుండి 45 వేల టన్నుల స్కాంపీ రొయ్యలను ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం అది 10 వేల టన్నులకు పడిపోయింది. నాడు స్కాంపీ రొయ్యల సాగు, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది. అయితే నీటిలో వ్యాధులు ఎక్కువగా ఉండటం వల్ల స్కాంపీ సాగును నాడు రాష్ట్ర రైతులు వదిలేశారు. ప్రస్తుతం దేశంలోని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో స్కాంపీ రొయ్య సాగు జరుగుతోంది.
ఐరోపా దేశాల్లో స్కాంపీకి డిమాండ్
ఐరోపా దేశాల్లో స్కాంపీ రొయ్యకు కొద్ది కాలంగా డిమాండు పెరిగింది. వనామి కన్నా వైరస్ తక్కువగా ఉన్న రొయ్యగా స్కాంపీకి అంతర్జాతీయంగా గుర్తింపు రావడంతో ఆయా దేశాలకు చెందిన రొయ్యల రైతులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2005 ప్రాంతంలో చైనాలో 25 వేల టన్నుల స్కాంపీ రొయ్యల సాగు జరగగా, ఇప్పుడు 4 లక్షల టన్నులకు చేరింది. అదే స్ధాయికి చేరుకోవడానికి బంగ్లాదేశ్ విశేషంగా కృషి చేస్తోంది.
ఆంధ్రాలో చెరువులు..
తెలంగాణలో రిజర్వాయర్లు
స్కాంపీ రొయ్యల పెంపకానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో మంచి వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రాలో చెరువుల్లో వీటిని పెంచుకోవచ్చు. ఇక తెలంగాణలో రిజర్వాయర్లు ఈ సాగుకు అనుకూలం. వనామీ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా సాగు జరుగుతోంది.
ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా వనామీ సాగునే ఇక్కడ రొయ్యల రైతులు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ఏపి నుంచి ఏటా 3 లక్షల టన్నుల వనామీ రొయ్యలను సాగుచేసి, ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటి నుంచి స్కాంపీని సాగులోకి తీసుకువస్తే ఏడాది ముగిసేలోపు 2 లక్షల టన్నులు సాగుచేసే అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.
వనామీతో సమానంగా స్కాంపీ
ప్రస్తుతం వనామీ సాగు జోరుగా సాగుతోంది. ఎకరానికి 50 కౌంట్ టన్నున్నర దిగుబడిని ఇస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా వనామి 50 కౌంట్ ధర కిలో 350 రూపాయలు పలుకుతోంది. ఇక స్కాంపీ విషయానికి వస్తే తల ఎక్కువ, కాళ్ళు పొడవుగా బరువు ఎక్కువగానే ఉంటుంది. వనామీ స్థాయిలోనే 50 కౌంట్ టన్ను నుంచి టన్నున్నర వరకు దిగుబడిని ఇస్తుంది. అంతర్జాతీయంగా స్కాంపీ 50 కౌంట్ ధర కూడా 350 నుంచి 380 రూపాయల వరకు పలుకుతోంది. అయతే ప్రస్తుతం చైనా, బంగ్లాదేశ్ వంటి కొన్ని దేశాలే స్కాంపీని ఎగుమతి చేస్తుండటం వల్ల ఈ ధర పలుకుతోందని రొయ్య రైతు ఒకరు చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్రానికి సంబంధించి స్కాంపీని కొల్లేరులో పెంచేందుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్‌లో మాదిరిగా వరితోపాటు స్కాంపీని సాగు చేసే ఆలోచన కనిపిస్తోంది. ఈ విధానం విజయవంతమైతే స్కాంపీతో సరికొత్త శకం మొదలైనట్టే.

చిత్రాలు..రొయ్యల చెరువులు, వైరస్ సోకిన వనామీ రొయ్యలు