బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ చేతికి స్నాప్‌డీల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశీయ అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. టెనె్సంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఈబే నుంచి భారీ స్థాయిలో నిధులను సమీకరించింది. భారతీయ ఆన్‌లైన్ మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేయనుందన్న ఊహాగానాల మధ్య ఏకంగా విదేశీ సంస్థల నుంచి 1.4 బిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ ప్రకారం దాదాపు 10,000 కోట్ల రూపాయలు) నిధులను సేకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇకపోతే ఓ భారత అంతర్జాల సంస్థ ఇంత పెద్ద ఎత్తున నిధులను సమీకరించడం ఇదే ప్రథమం అని సోమవారం ఓ ప్రకటనలో ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇదిలావుంటే ఇంతకుముందు కూడా అడపాదడపా మొత్తం 3 బిలియన్ డాలర్లకుపైగా నిధులను ఫ్లిప్‌కార్ట్ సమీకరించింది. అప్పుడు కూడా అత్యధికంగా విదేశీ మదుపరుల నుంచే సేకరించింది. కాగా, తాజా నిధుల సమీకరణ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఫ్లిప్‌కార్ట్‌లో వ్యూహాత్మక మదుపరిగా చేరింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, నాస్పర్స్ గ్రూప్, ఏసెల్ పార్ట్‌నర్స్, డిఎస్‌టి గ్లోబల్, బైల్లీ గిఫ్ఫర్డ్ సంస్థలు పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ఇక వ్యాపారపరంగా దేశీయంగా ఫ్లిప్‌కార్ట్, ఈబే విలీనం అవుతున్న క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఈబే 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతోంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో ఈబే వ్యాపార నిర్వహణను ఫ్లిప్‌కార్ట్ చూస్తుంది. ఈ ఏడాది ఆఖర్లో ఈ లావాదేవీ కొలిక్కి రానుంది. మరోవైపు అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు భారత్‌లో గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో తాజా నిధుల సమీకరణతో అమెజాన్‌పై ఫ్లిప్‌కార్ట్ వ్యాపారపరంగా ఎదురుదాడికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తన దేశీయ ప్రత్యర్థి స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్.. స్నాప్‌డీల్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్నది తెలిసిందే. స్నాప్‌డీల్ కొనుగోలుతో పెరిగే మార్కెట్ వాటా వల్ల అమెజాన్‌కు చెక్ పెట్టవచ్చన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. స్నాప్‌డీల్ కూడా ఇటీవలికాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నది తెలిసిందే. సంస్థాగతంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది కూడా. ఇదిలావుంటే ఈ తాజా నిధుల సమీకరణతో ఫ్లిప్‌కార్ట్ విలువ ప్రస్తుతం 11.6 బిలియన్ డాలర్లకు చేరిందని సంస్థ తెలిపింది. 2015లో 15 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెప్పింది.
‘్ఫ్లప్‌కార్ట్‌కు సంబంధించి ఈ డీల్ ఓ మైలురాయి. నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్నందున భారత్‌కూ ఇది గొప్పదే. దీనివల్ల సంప్రదాయ మార్కెట్‌కు అలవాటుపడిన దేశంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ దూకుడు పెరగగలదు.’ అని ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులైన సచిన్ బన్సల్, బిన్ని బన్సల్ అన్నారు. కాగా, 100 మిలియన్లకుపైగా కస్టమర్లను కలిగి ఉన్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందినవే ఫ్యాషన్ రిటైలర్స్ మింత్రా, జబాంగ్, లాజిస్టిక్ సంస్థ ఈకార్ట్, పేమెంట్స్ యాప్ ఫోన్‌పే.
మరోవైపు స్నాప్‌డీల్ వ్యవస్థాపకులైన కునాల్ భల్, రోహిత్ బన్సల్ తమ ఉద్యోగులకు ఓ లేఖను రాశారు. స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేస్తోందన్న అంచనాల మధ్య ఈ లేఖ రాయడం విశేషమవగా, ఇందులో వాటిపై స్పందించకపోవడం గమనార్హం.
*
ఆ లేఖలో ఏముందంటే..
ప్రియమైన ఉద్యోగులారా!
ఇటీవలికాలంలో స్నాప్‌డీల్ గురించి మీడియాలో అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయి.
వీటన్నిటిపై సంస్థ భాగస్వాములు చర్చిస్తున్నారు. మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. అంతకుమించి ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా భాగస్వాములతో కలిసి శ్రమిస్తున్నాం. త్వరలోనే అంతా సర్దుకుని వ్యాపారపరంగా, ఆర్థికపరంగా సత్ఫలితాలను చూస్తామని ఆశిస్తున్నాం.
ఇక సంస్థ వార్షిక పనితీరుపై సమీక్ష దాదాపు పూర్తి కావచ్చింది. రాబోయే రెండు వారాల్లో అర్హులైనవారికి వేతన పెంపు, పదోన్నతులు కూడా లభిస్తాయి. సంస్థను లాభాల్లో నడిపించడానికి కృషి చేసిన వారందరికి నిరుడుతో పోల్చితే ఈ ఏడాది ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి.
దయచేసి మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే స్వేచ్ఛగా, నిరభ్యంతరంగా మాకు తెలియజేయండి.
ఆందోళనలు వద్దు.. అధైర్య పడవద్దు.
మరొక్కసారి చెబుతున్నాం.. ఉద్యోగుల శ్రేయస్సు, భద్రతే మా తొలి ప్రాధాన్యత.
కృతజ్ఞతలు!
ఇట్లు
మీ
కునాల్-రోహిత్