బిజినెస్

ఎయిర్ కూలర్ల మార్కెట్‌లో స్మార్ట్ కూలర్లదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఎండాకాలం వచ్చేసింది. ఆరంభంలోనే అదిరిపోయే ఎండలు కొడుతున్నాయి. మరో రెండు నెలలు ఎండలను తట్టుకునేదెలా?.. అంటూ ఎయిర్ కూలర్ల షాపులకేసి పరుగులు పెడుతున్నారు జనం. అయితే నిరుడు చల్లగాలి వస్తే సరిపోతుందిలే అని ఆలోచించిన కస్టమర్లు.. ఈ ఏడాది మాత్రం ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో అని ఆరా తీస్తున్నారు. ఆయా సంస్థలు సైతం తమ కూలర్లను మరిన్ని ఫీచర్లతో మార్కెట్‌లోకి తెస్తున్నాయి. దీంతో సాదాసీదా ఎయిర్ కూలర్ల కంటే స్మార్ట్ కూలర్లకు డిమాండ్ పెరిగిందిప్పుడు. నీటిలోగల సూక్ష్మక్రీముల ప్రభావం ఉండకుండా యాంటి-బ్యాక్టీరియా వాటర్ ట్యాంక్స్, వాతావరణంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో ఎయిర్ రిఫ్రెషర్స్‌తోపాటు దోమల బారినుంచి తప్పించుకునే ఏర్పాట్లనూ ఎయిర్ కూలర్లతో అందిస్తున్నాయి ఆయా సంస్థలు. అలాగే టచ్ స్క్రీన్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్ వ్యవస్థలనూ అమర్చుతున్నాయి. దీంతో సులభంగా ఎయిర్ కూలర్‌ను ఆపరేట్ చేసుకోవడంతోపాటు కూర్చున్నచోటు నుంచే ఎయిర్ కండీషనర్ల మాదిరిగా ఎయిర్ కూలర్లనూ ఆపరేట్ చేసుకునే సదుపాయాన్ని వివిధ సంస్థలు కల్పిస్తున్నాయి. విద్యుత్ ఆదానూ దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాయి. తద్వారా అన్ని స్థాయిల కస్టమర్లు ఎయిర్ కూలర్ల వాడకానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఎయిర్ కూలర్ల మార్కెట్ దాదాపు 1,800 కోట్ల రూపాయలను తాకుతుందని అంచనా. ఈసారి బ్లూ స్టార్ వంటి సంస్థలూ ఎయిర్ కూలర్ల మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించాయి. ఇప్పటికే సింఫని, కెన్‌స్టార్, ఉషా ఇంటర్నేషనల్, మహారాజ, వోల్టాస్, ఓరియంట్ తదితర ప్రధాన సంస్థలు ఎయిర్ కూలర్ల మార్కెట్‌లో ఉన్నాయి. ఈ సీజన్‌లో 30 శాతానికిపైగా అమ్మకాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ఈ సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. సాదాసీదా కూలర్లతో పోల్చితే యేటేటా బ్రాండెడ్ కూలర్లకు గిరాకీ పెరుగుతోందని చెబుతున్నాయి. తమ సౌకర్యార్థం కస్టమర్లు ఎంతైనా వెచ్చించడానికి నేడు సిద్ధపడుతున్నారని, వారి అభిరుచులకు తగ్గట్లుగా తాము కూడా నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ కూలర్లను అభివృద్ధి చేస్తున్నామని వివరిస్తున్నారు. దీంతో ఎయిర్ కండీషనర్ల స్థాయి అవసరాలు ఎయిర్ కూలర్లే తీర్చుతున్నాయని అంటున్నారు. ప్రారంభ స్థాయి ఏసి ధరలతో పోల్చితే సగానికిపైగా తక్కువ ధరకే ఆధునిక ఫీచర్లు కలిగిన ఎయిర్ కూలర్లు మార్కెట్‌లో లభిస్తుండటం కూడా ఎయిర్ కూలర్ల అమ్మకాలను పెంచుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ‘ఈ ఏడాది మరిన్ని కొత్త సదుపాయాలతో ఎయిర్ కూలర్లను మార్కెట్‌లోకి తెచ్చాం. యాంటి-బ్యాక్టీరియల్, గాలి విస్తారంగా వీచే ఏర్పాట్లను చేశాం. ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించాం.’ అని మహారాజ వైట్‌లైన్ బ్రాండ్ పేరిట అమ్మకాలు చేపడుతున్న గ్రూప్ ఎస్‌ఇబి ఇండియా సిఇఒ సునీల్ వాద్వా పిటిఐకి తెలిపారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అమ్మకాలను చూస్తున్నామని చెప్పారు. ‘వాతావరణంలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఎయిర్ కూలర్ల అమ్మకాలను ఊపందుకునేలా చేశాయి.’ అన్నారు. ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎవిపి-మార్కెటింగ్ భరత్ ఖర్బానంద మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు కాగలదన్న అంచనాలు పరిశ్రమలో ఉన్నాయన్నారు. ఈ వేసవికాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదు అవుతున్న క్రమంలో ఎయిర్ కూలర్ల అమ్మకాలు కూడా ఈసారి రికార్డు స్థాయిలోనే ఉంటాయనిపిస్తోందని కెన్‌స్టార్ సిఒఒ రాజీవ్ కెన్యూ అన్నారు. గతంతో పోల్చితే ఈ సీజన్‌లో 22 శాతం అధికంగా అమ్మకాలను అందుకుంటామన్న విశ్వాసాన్ని కనబరిచారు. కాగా, ప్రస్తుతం బ్రాండెడ్ కూలర్ల ధరలు మార్కెట్‌లో కనిష్టంగా 3,200 రూపాయలు, గరిష్ఠంగా 18,500 రూపాయలు పలుకుతున్నాయి. విండో, డెజర్ట్, టవర్, పర్సనల్ కూలర్ల ఆధారంగా ఈ ధరలు మారుతాయి. ఇక మార్కెట్ లీడర్ సింఫని.. డిజిటల్ టచ్ స్క్రీన్, వాయిస్ అసిస్ట్, మస్కిటో రిపెల్లెంట్ సదుపాయాలతో ఎయిర్ కూలర్లను విక్రయిస్తోంది. బ్లూ స్టార్, టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్ కూడా డిజిటలైజ్డ్ కూలర్లను అందుబాటులోకి తెచ్చాయి. ‘ఈ ఏడాదే మేము ఎయిర్ కూలర్ల మార్కెట్‌లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించాం. ప్రీమియం కేటగిరీ/బ్రాండెడ్ ఎయిర్ కూలర్ల విభాగాల్లో రానున్న మూడేళ్లలో 10 శాతం మార్కెట్ వాటాను అందుకోవాలన్నదే మా లక్ష్యం.’ అని బ్లూ స్టార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ చెప్పారు. ఈ సీజన్‌లో కనీసం 50 కోట్ల రూపాయల అమ్మకాలను ఆశిస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచే మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున కూలర్లను దించామన్నారు. ఇక వోల్టాస్ అధ్యక్షుడు, సిఒఒ ప్రదీప్ బక్షీ మాట్లాడుతూ కస్టమర్లు ప్రస్తుతం నాణ్యమైన ఉత్పత్తులనే కొనేందుకు ఇష్టపడుతున్నారని, ఖరీదు గురించి ఆలోచించడం లేదన్నారు. దీంతో ఎయిర్ కూలర్ మార్కెట్‌లో మున్ముందు బ్రాండెడ్ ఉత్పత్తులదే హవా అని అభిప్రాయపడ్డారు. గడచిన 12-18 నెలల కాలంలో ఎంతలేదన్నా 10 కొత్త బ్రాండ్లు వచ్చాయని గుర్తుచేశారు. ఈ ఏడాది తాము 30 శాతం వృద్ధిని చూస్తామని అనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తానికి ఎయిర్ కూలర్ల మార్కెట్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది.