బిజినెస్

ఉత్తరాది మార్కెట్‌లోకి హెరిటేజ్ ఫుడ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: హెరిటేజ్ ఫుడ్స్ ఉత్తర భారతంలోకి అడుగిడింది. 2022 నాటికి 6,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ముందుకెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. ఈ క్రమంలోనే ఉత్తరాది మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నడిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన మార్కెట్‌ను కలిగి ఉన్నది తెలిసిందే. దీంతో ఇక ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారించిన సంస్థ.. అక్కడి వినియోగదారులకు తాజా పాలను అందిస్తామన్న భరోసానిచ్చింది. ఓ జాతీయ సంస్థగా ఎదగాలని అనుకుంటున్నామని, రాబోయే ఐదేళ్లలో 6,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఢిల్లీకి అత్యంత సమీపంలోని రైతుల నుంచే పాల సేకరణ చేపడుతున్నామని, కాబట్టి తమ బ్రాండ్ పాలు తాజాగా, నాణ్యమైనవిగా ఉంటాయన్నారు. ఢిల్లీలో త్వరలో సొంతంగా పాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,380 కోట్ల రూపాయల అమ్మకాలను హెరిటేజ్ నమోదు చేసింది. ఇందులో 75 శాతం అమ్మకాలు డైరీ ఉత్పత్తులవే. ఇక ఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకూ హెరిటేజ్ సిద్ధమవుతుండగా, దానితో చర్చలు తుది దశకు చేరుకున్నాయి. అయితే ఆ సంస్థ ఏదన్నది మాత్రం బ్రహ్మణి తెలియజేయలేదు. కాగా, ఈ నెలలోనే రిలయన్స్ రిటైల్ డైరీ వ్యాపారాన్ని హెరిటేజ్ ఫుడ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రిలయన్స్ పాల ఉత్పత్తులను హెరిటేజ్ బ్రాండ్‌తో తీసుకురానున్నట్లు ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే ముందుగా ఉత్తరాది మార్కెట్‌ను హెరిటేజ్ విస్తరిస్తుండగా, పాలతోపాటు పాల ఆధారిత ఉత్పత్తులైన పెరుగు, వెన్న, మజ్జిగ, ఐస్‌క్రీమ్‌లనూ హెరిటేజ్ అమ్ముతోంది. దేశవ్యాప్తంగా 1.4 మిలియన్ లీటర్ల పాలను సంస్థ సేకరిస్తోందని బ్రహ్మణి ఈ సందర్భంగా తెలియజేశారు. మార్కెట్‌లో ప్రధానంగా అముల్, మదర్ డైరీ ఉత్పత్తులతో హెరిటేజ్‌కు గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ధరలు అందరికీ ఆమోదయోగ్యంగానే ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నట్లు బ్రహ్మణి చెప్పారు. ఇటీవలే సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన లోగోను కూడా బ్రహ్మణి ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు కుమారుడైన లోకేశ్ భార్య, టాలీవుడ్ అగ్రహీరో బాలకృష్ణ కూతురు బ్రహ్మణి అన్నది తెలిసిందే. బహుళ వ్యాపార సంస్థగా ఉన్న హెరిటేజ్.. డైరీ, రిటైల్, వ్యవసాయ, బేకరీ, పునరుత్పాదక శక్తి రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ప్రధానంగా డైరీ వ్యాపారంపైనే ఆధారపడ్డ హెరిటేజ్‌కు 15 రాష్ట్రాల్లో 15 పాల ఉత్పాదక కేంద్రాలున్నాయి. రిలయన్స్ రిటైల్ డైరీ వ్యాపార కొనుగోలుతో 5 ఉత్పాదక కేంద్రాలు హెరిటేజ్ చేతికొచ్చాయి.

చిత్రం..ఢిల్లీలో హెరిటేజ్ కొత్త లోగోను ఆవిష్కరిస్తున్న బ్రహ్మణి నారా. నూతన పాల ప్యాకెట్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న సంస్థ ప్రతినిధులు