బిజినెస్

జోరుగా బంగారం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, ఏప్రిల్ 28: బంగారం అమ్మకాలు శుక్రవారం ఒక్కరోజే 40 శాతం పెరిగాయి. అక్షయ తృతీయ కావడంతో లక్ష్మీదేవికి మరో రూపంగా భావించే పసిడిని కొనేందుకు అంతా ఆసక్తి కనబరిచారు. దీంతో నిరుడుతో పోల్చితే ఈసారి విక్రయాల్లో 40 శాతం వృద్ధిని చూశామని వ్యాపారులు చెబుతున్నారు. పెళ్ళిళ్ల సీజన్ డిమాండ్, ధరలు కూడా అదుపులోనే ఉండటంతో కొనుగోళ్లకు కస్టమర్లు ముందుకు వచ్చారని ఆభరణాల వర్తకులు అంటున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు, వాణిజ్య రాజధాని ముంబయిలో పుత్తడి అమ్మకాలు శుక్రవారం జోరుగా సాగాయి.
గతంతో చూస్తే షోరూంలలోకి 30-40 శాతం మంది ఈసారి అధికంగా వచ్చినట్లు వర్తకులు చెప్పారు. వీరిలో గరిష్ఠంగా కొనుగోళ్లు జరపడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘దేశవ్యాప్తంగా ఈసారి సానుకూల సంకేతాలు కనిపించాయి. రెండేళ్ల తర్వాత మళ్లీ కస్టమర్లు షాపుల వైపు చూశారు. బంగారం కొనుగోళ్లు కూడా అంతేస్థాయిలో జరిగాయి.’ అని భారతీయ బులియన్, ఆభరణాల సంఘం (ఐబిజెఎ) డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ పిటిఐకి తెలిపారు. దీనిబట్టి నిరుడితో పోల్చితే ఈసారి కనీసం 35 శాతం అమ్మకాలు పెరిగాయని చెప్పొచ్చు అని పిఎన్‌జి జ్యుయెల్లర్స్ సిఎండి కూడా అయిన గాడ్గిల్ అన్నారు. ధరలు అదుపులో ఉండటం, ముఖ్యంగా పెళ్ళిళ్ల సీజన్ కావడంతో అక్షయ తృతీయ రోజున కొనుగోలు జరిపితే శుభప్రదమని చాలామంది భావించారంటూ ట్రేడింగ్ సరళిని ఆయన ఈ సందర్భంగా విశే్లషించారు. తర్వాత కొందామనుకున్నవారు కూడా ఇదేరోజు కొన్నారని వివరించారు. ఇక ప్రపంచ స్వర్ణ మండలికి చెందిన భారతీయ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ మాట్లాడుతూ తమకు అందిన సమాచారం ప్రకారం ఈ అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆశాజనకంగానే అమ్మకాలు జరిగాయన్నారు. నిరుడు కంటే విక్రయాలు పెరిగాయని చెప్పారు. మరోవైపు ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం 30 రూపాయలు పెరిగి 29,480 రూపాయలుగా నమోదైంది. ముంబయిలోనైతే 10 గ్రాముల ధర 120 రూపాయలు పుంజుకుంది. అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్) చైర్మన్ నితిన్ ఖండేల్వాల్ మాట్లాడుతూ అక్షయ తృతీయ ప్రభావం రెండు రోజులకుపైగా ఉంటుందని, ఇది అమ్మకాల స్థాయిని మరింత పెంచుతుందన్నారు. శుక్రవారం అమ్మకాలు బాగానే జరిగినట్లు సమాచారం ఉందని, అయితే నాణేలు, కడ్డీల కంటే ఆభరణాల కొనుగోళ్లు అధికంగా ఉన్నాయన్నారు.
అయినప్పటికీ మొత్తంగా చూస్తే నిరుడు కంటే ఈసారి 25 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేశారు. కాగా, పిసి జ్యుయెల్లర్స్ సిఒఒ ఆర్‌కె శర్మ స్పందిస్తూ ఈ ఏడాది 30-40 శాతం అమ్మకాలు వృద్ధి చెందినట్లు చెప్పారు. నిరుడు అక్షయ తృతీయకు ముందు ఆభరణాల వర్తకులు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ ఈసారి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా పిసి జ్యుయెల్లర్స్‌కు దాదాపు 80 షోరూంలు ఉన్నాయి. ఇక జిజెఎఫ్ మాజీ చైర్మన్, శ్రీరామ జ్యుయెల్లర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జివి శ్రీధర్ మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున సాధారణంగా చిన్నచిన్న, తేలికపాటి ఆభరణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అయితే పెళ్ళిళ్ల సీజన్ కావడంతో పెద్దపెద్ద నగలకూ డిమాండ్ కనిపించిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు, పశ్చిమ, ఉత్తరాది మార్కెట్లలోనూ అమ్మకాలు జోరుగా సాగాయన్నారు. మార్కెట్‌లో ఈ అక్షయ తృతీయ మళ్లీ పండగ వాతావరణాన్ని తెచ్చిందని మనుభాయ్ జ్యుయెల్లర్స్ డైరెక్టర్ సమీర్ సాగర్ అభిప్రాయపడ్డారు. ఈసారి శుక్రవారం కూడా కావడంతో అమ్మకాలు మరింతగా జరిగాయన్నారు. ఇక మదుపరులు కూడా బంగారంపై పెట్టుబడులు పెంచగా, స్టాక్ మార్కెట్లలో పసిడి వర్తక సంస్థల షేర్లు లాభాలను అందుకున్నాయి.
రకరకాల ఆఫర్లు
హైదరాబాద్: అక్షయ తృతీయ సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవడానికి వ్యాపారులు రకరకాల ఆఫర్లు ప్రకటించారు. గతంలో అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కొనడం ఆనవాయితీగా వచ్చేది. ఇది క్రమంగా అన్ని వ్యాపారాలకు పాకడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల అమ్మకందారులు సైతం అక్షయ తృతీయ కొనుగోళ్లకు ప్రచారం చేస్తున్నారు. ప్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి పలు ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈసారి అక్షయ తృతీయ అమ్మకాలకు పలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అదృష్ట దేవత వెన్నంటి ఉంటుంది అనే నమ్మకంతో ఈ రోజు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు ప్లిప్‌కార్ట్ బంగారు ఆభరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు అక్షయ తృతీయ రోజున బంగారు ఆభరణాల కొనుగోలుకు ప్రత్యేకంగా ఐదు శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. తనిష్క్ సంస్థ బంగారు ఆభరణాల తయారీ చార్జీపై అక్షయ తృతీయ సందర్భంగా 25 శాతం రాయితీ ప్రకటించింది. సాధారణ రోజుల కన్నా అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని సికింద్రాబాద్‌లోని బంగారం మార్కెట్ యజమానులు తెలిపారు. ఎంతో కొంత బంగారం కొనాలనే నమ్మకం చాలా బలంగా ఉందని, మధ్యతరగతి ప్రజలు కూడా ఈ సంప్రదాయం పాటిస్తోందని చెప్పారు.

చిత్రాలు.. అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ, ముంబయసహా దేశవ్యాప్తంగా కొనుగోలుదారులతో కళకళలాడుతున్న నగల దుకాణాలు