బిజినెస్

ఇపిఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్) డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్న నీట్ పరీక్షల విధానాన్ని పునఃపరిశీలించేందుకు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆమోదించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అలాగే నీట్ పరీక్షల సమయంలో యువతుల ‘ప్రైవసీ’ని గౌరవించేలా చర్యలు తీసుకోవాలన్న తన సూచనను మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్ వెంటనే ఆమోదించారని దత్తాత్రేయ తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ లబ్దిదారులకు 8.65 శాతం వడ్డీ చెల్లించాలని గతంలో కార్మిక శాఖ ప్రతిపాదించగా, దానిని 8.60 శాతానికి తగ్గించాలని ఆర్థిక శాఖ సూచించింది. దీంతో ఇపిఎఫ్ చందాదారులకు 8.65 శాతం వడ్టీ చెల్లించవలసిన అవసరం గురించి శుక్రవారం జైట్లీకి తన వాదనతో ఏకీభవించి 8.65 శాతం వడ్డీ చెల్లించాలన్న కార్మిక శాఖ ప్రతిపాదనను ఆమోదించారని దత్తాత్రేయ వివరించారు.
ఇదిలావుంటే, అంగన్‌వాడీ కార్మికులు, సహాయకులకు సామాజిక భద్రత కింద పెన్షన్, పిఎఫ్, ఇంటి సౌకర్యం కల్పించే పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన అనంతరం దీన్ని ఖరారు చేస్తామన్నారు. యాజమానితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5 శాతం చొప్పున, లబ్దిదారులు పది శాతం చొప్పున ఖర్చు భరించే విధంగా ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి సిఎస్‌టి కింద చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని అరుణ్ జైట్లీని కోరినట్లు ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి మూడో విడత కింద 450 కోట్లు తెలంగాణకు విడుదల చేయాలన్న తన విజప్తిని అరుణ్‌జైట్లీ ఆమోదించారన్నారు. తెలంగాణలో ఎయిమ్స్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని జైట్లీని కోరానని, అలాగే ఎయిమ్స్ ఏర్పాటు గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డాతో కూడా చర్చించానని దత్తాత్రేయ తెలిపారు. త్వరలో జరగనున్న భారత కార్మిక సదస్సు 48వ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఎజెండాను ఖరారు చేసినట్లు ఆయన చెప్పారు.
కాగా, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా చూసేందుకు నీట్ పరీక్షా విధానాన్ని పునఃపరిశీలించే విషయాన్ని పరిశీలిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కాపీ కొట్టకుండా చూసేందుకు పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేయాలన్న తన ప్రతిపాదనకు జవదేకర్ సానుకూలంగా స్పందించారన్నారు. పరీక్షా కేంద్రాల్లో యువతల ప్రైవసీని గౌరవించాలన్న సూచనను మన్నిస్తామని, నీట్ పరీక్షా విధానాన్ని త్వరలోనే సమీక్షిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
మిర్చి రైతులకు సంకెళ్లా?
మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న మిర్చి రైతులకు సంకెళ్లు వేయటం అన్యాయమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతులకు బేడీలు వేసే పరిస్థితి రావటం దురదృష్టకరమని దత్తాత్రేయ వాపోయారు. మిర్చి రైతులకు 6,150 రూపాయలు చెల్లించేందుకు కేంద్రం ముందుకు వచ్చిన తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం వీరిని ఆదుకునే అంశంలో ఊగిసలాట ధోరణిని కొనసాగించడం అన్యాయమని దత్తాత్రేయ విమర్శించారు. అన్ని వ్యవసాయ మార్కెట్లను ఇనాం వెబ్ ఆధారిత పథకం కింద అనుసంధానం చేయాలని ఆయన సూచించారు.