బిజినెస్

భయం.. అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఈ ఏడాది 8 నుంచి 9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే దిశగా ముందుకు సాగుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత భారీ పరిమాణంలో ఉండబోదని దేశీయ ఐటి పరిశ్రమ భరోసా ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఐటి సంస్థల్లో ఎప్పుడూ జరిగే వార్షిక మదింపు ప్రక్రియలో భాగంగా కొంత మంది ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోయి ఉండవచ్చని, అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటాతో పాటు దేశంలో నగదు రహిత చెల్లింపులు (డిజిటల్ పేమెంట్స్) పెరుగుతుండటం వలన ఒనగూడే ప్రయోజనాలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాల స్వరూపాన్ని మార్చుకునే దిశగా ఐటి పరిశ్రమ ముందుకు సాగుతోందని కేంద్ర ఐటి శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ మంగళవారం తెలిపారు. దేశంలోని కొన్ని ఐటి సంస్థలు ఉద్యోగాల సంఖ్యను కుదించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ ఈ ఏడాది ఉద్యోగాల కుదింపు భారీ పరిమాణంలో ఉండబోదని ఆయా సంస్థలు స్పష్టమైన హామీని ఇచ్చాయని ఆమె చెప్పారు. ‘వార్షిక మదింపు ప్రక్రియలో భాగంగా ఐటి సంస్థలు కొంత మంది ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోయి ఉండవచ్చు. అంతమాత్రన ఐటి సంస్థలు ఈ ఏడాది అకస్మాత్తుగా భారీ సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించుకుంటున్నాయని భావించడం తప్పే అవుతుంది. ఈ విషయంలో ఐటి సంస్థల నుంచి ప్రభుత్వానికి స్పష్టమైన హామీ లభించింది. కనుక ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె ఉద్ఘాటించారు. ప్రస్తుతం దేశీయ ఐటి పరిశ్రమ 8 నుంచి 9 శాతం వృద్ధిరేటును సాధించే దిశగా ముందుకు సాగుతోందని, కనుక ఈ వృద్ధిరేటు అకస్మాత్తుగా మందగిస్తుందని భావించేందుకు ఎటువంటి కారణాలు కనిపించడం లేదని అరుణా సుందరరాజన్ స్పష్టం చేశారు. ఐటి సంస్థలు గత రెండున్నర ఏళ్లలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్నాయని, ఈ నియామకాలు ఇలాగే కొనసాగుతాయని, ఈ అంశాన్ని వాస్తవిక దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
దేశీయ ఐటి రంగంలో లే-ఆఫ్‌ల విషయమై గత కొద్ది వారాల నుంచి వెలువడుతున్న వార్తలు అందరికీ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా లాంటి దిగ్గజ ఐటి సంస్థలు వార్షిక మదింపు ప్రక్రియను చేపట్టి పనికిరాని ఉద్యోగులతో పాటు సరిగా పనిచేయలేకపోతున్న ఉద్యోగులను తొలగించడంతో రానున్న కొద్ది వారాల్లో వేలాది మంది ఉద్యోగులకు ఐటి రంగం నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వర్క్ పర్మిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు వ్యాపార పరంగా భారత ఐటి సంస్థలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. దీనితో పాటు దేశీయ ఐటి సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు సరిగా సిద్ధం కానందున రానున్న మూడేళ్ల పాటు ఐటి రంగంలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉద్యోగాల కుదింపు జరగవచ్చని ఉద్యోగుల అనే్వషణా సంస్థ ‘హెడ్ హంటర్స్ ఇండియా’ ఇటీవల స్పష్టం చేయడం ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.

చిత్రం..కేంద్ర ఐటి శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్